Begin typing your search above and press return to search.

సీనియారిటీకే ప్రాధాన్యం...ఆయ‌నే సీఎం

By:  Tupaki Desk   |   13 Dec 2018 1:47 PM GMT
సీనియారిటీకే ప్రాధాన్యం...ఆయ‌నే సీఎం
X
ఎడారి రాజ్యం రాజు ఎవ‌రో తేలింది. వెటరన్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న యువనేత సచిన్ పైలెట్ ను గెహ్లాట్ సీఎం కుర్చీ రేసులో వెనక్కి నెట్టినట్టే కనిపిస్తోంది. రెండు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన 67 ఏళ్ల గెహ్లాట్ పేరుని ఈ సాయంత్రం అధికారికంగా ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

199 సభ్యుల రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 100మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే తుది ఫలితాల తర్వాత కాంగ్రెస్ 99వద్దే ఆగిపోగా - బీజేపీ 73చోట్ల విజయం సాధించింది. బీఎస్పీ 6 - సీపీఎం 2 - రాష్ట్రీయ లోక్‌ తాంత్రిక్ పార్టీ (ఆర్‌ ఎల్పీ)-3 - భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ)-2 - రాష్ట్రీయ లోక్‌ దళ్ (ఆర్‌ ఎల్డీ) 1 చోట గెలుపొందగా - స్వతంత్రులు 13చోట్ల విజయం సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు మరో సభ్యుడి మద్దతు అవసరం కాగా - దాని మిత్రపక్షం ఆర్‌ఎల్డీ నుంచి ఒక సభ్యుడు గెలుపొందడంతో మ్యాజిక్ సంఖ్యను చేరుకున్నట్లే. దీనికితోడు బీఎస్పీ కూడా మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పని మరింత సులువైంది. ఇక ముఖ్యమంత్రి ఎంపికపై ఆ పార్టీ కసరత్తు ప్రారంభించింది. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠం కోసం పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ - యువనేత సచిన్ పైలట్ ఇద్దరూ పోటీపడగా, రెండుసార్లు సీఎంగా పనిచేసిన గెహ్లాట్ మూడోసారి అవకాశం ద‌క్క‌డం దాదాపు ఖరారైంది.

రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం రేసులో మొదటి నుంచి పోటీలో ఉన్న అశోక్ గెహ్లాట్ - సచిన్ పైలెట్ గురువారం రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సీఎం కుర్చీ తనకేనని గెహ్లాట్ స్పష్టమైన హామీ పొందినట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ తర్వాత ఆయన జైపూర్ తిరిగి వెళ్లారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి ఒక సీటు తక్కువ రావడంతో యువకుడైన సచిన్ కు బదులు గెహ్లాట్ అనుభవం పైన పార్టీ నమ్మకం ఉంచినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్‌ గా ఉండి పార్టీని విజయపథంలో నడిపించిన పైలట్ కూడా ఆ రేసులో ముందున్నప్ప‌టికీ...సీనియ‌ర్‌ నే అవ‌కాశం వ‌రించింది.