Begin typing your search above and press return to search.

గత పాతికేళ్లలో బీజేపీ, కాంగ్రెస్ గ్రాఫ్

By:  Tupaki Desk   |   17 March 2017 5:30 PM GMT
గత పాతికేళ్లలో బీజేపీ, కాంగ్రెస్ గ్రాఫ్
X
భారతదేశ రాజకీయ చరిత్రలో గత పాతికేళ్లలో ఏం జరిగింది...? శతాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ కుంగి కృశించిపోయి మరణ దశకు చేరుకుంది. గొప్ప భవిష్యత్తును వెతుక్కుంటూ హిందూ దేశాన్ని మొత్తం ఏలాలని తపించిన బీజేపీ అనుకున్న లక్ష్యం దిశగా కదులుతోంది. ఇదంతా కేవలం పాతికేళ్ల కాలంలోనే జరిగిన పరిణామం.. పాతికేళ్ల సమకాలీన చరిత్రలో కాంగ్రెస్ ఓడ బండి అయింది.. బీజేపీ బండి ఓడగా మారింది.

1991 నాటికి కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటికి 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దీనావస్థ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

* 1991లో బీజేపీ పాలనలో నాలుగు రాష్ట్రాలే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ - రాజస్థాన్ - ఉత్తర్ ప్రదేశ్ - మధ్యప్రదేశ్ లలో మాత్రమే అప్పటికి ఆ పార్టీ అధికారంలో ఉండేది. అప్పటికి ఈశాన్య రాష్ట్రాలు - దక్షిణాన తమిళనాడు మినహా మిగతా చోట్ల మొత్తం... మహారాష్ర్టలో కూడా కాంగ్రెస్ పాలన ఉండేది.

* 1995 నాటికి బీజేపీ పాలన 3 రాష్ట్రాలకు తగ్గిపోయింది. రాజస్థాన్ మినహా మిగతా రాష్ర్టాలన్నీ కమలం చేతి నుంచి జారిపోయాయి. కొత్తగా గుజరాత్ - ఢిల్లీల్లో మాత్రం గెలవగలిగింది. మరోవైపు కాంగ్రెస్ ఖాతాలో మరో రాష్ట్రం అదనంగా చేరి మొత్తం 13 రాష్ట్రాల్లో పాలన సాగించింది.

* 2000 సంవత్సరం నుంచి బీజేపీ పురోగమించడం మొదలైంది. అయిదు రాష్ట్రాల్లో పాగా వేసింది. మరోవైపు కాంగ్రెస్ పాలన సింగిల్ డిజిట్ కు చేరింది. 9 రాష్ట్రాలకు పరిమితమైంది.

* 2005 నాటికి బీజేపీ మరో రాష్ట్రాన్ని కలుపుకొని 6 రాష్ట్రాల్లో పాగా వేయగా కాంగ్రెస్ తిరిగి పుంజుకుని 14 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.

* 2014కి వచ్చేసరికి లెక్కలు మళ్లీ తిరగబడ్డాయి. బీజేపీ 11 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ మళ్లీ 9 రాష్ట్రాలకు పడిపోయింది. తొలిసారిగా కాంగ్రెస్ పాలిత రాష్ర్రాల కంటే బీజేపీ పాలిత రాష్ర్టాల సంఖ్య పెరిగింది.

* 2016 నాటికి బీజేపీ పాలన 13 రాష్ట్రాలకు పాకింది. కాంగ్రెస్ 6 రాష్ట్రాలకు పరిమితమైంది.

* 2017 నాటికి ఏకంగా 16 రాష్ర్టాల్లో బీజేపీ, దాని భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ కేవేలం అయిదు రాష్ట్రాలకే పరిమితమైంది. అందులోనూ మేఘాలయ.. మిజోరాంలు చిన్న రాష్ర్టాలు. ఆ రెండింటితో పాటు పంజాబ్ - హిమాచల్ ప్రదేశ్ - కర్ణాటకల్లో మాత్రమే అధికారంలో ఉంది.

..ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా బలహీన పడి రోజురోజుకీ బక్కచిక్కిపోతున్న కాంగ్రెస్ పార్టీని బతికి బట్టకట్టించే బాధ్యత రాహుల్ గాంధీ మీద ఉన్నప్పటికీ ఆయన శక్తిసామర్థ్యాలు చాలడం లేదన్నది అందరికీ తెలిసిందే. పాతికేళ్ల ఈ పరిణామ క్రమాన్ని చూసుకుంటే బీజేపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ భౌగోళికంగా దేశంలోని సుమారు మూడొంతల భాగాన్ని పాలిస్తోంది. కాంగ్రెస్ గట్టిగా అయిదో వంతు భాగాన్నీ పాలించడం లేదు. ఇదే ట్రెండు కొనసాగితే మరో పదేళ్లలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/