ప్రియాంక తొలిసభలోనే అడ్డంగా బుక్కయిందిగా

Tue Feb 12 2019 19:00:01 GMT+0530 (IST)

కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ - తూర్పు యూపీ ఇంచార్జ్ ప్రియాంకగాంధీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఆమెకు ఊహించని ఆదరణ కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నం ఘోరంగా అబాసుపాలయింది. లక్నో నగరంలో పాల్గొన్న భారీ ర్యాలీపై కాంగ్రెస్ - బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. అంతేకాకుండా....ప్రియాంక కోసం కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ పూర్తిగా విఫలం అయింది.ఐసీసీ కార్యదర్శిగా - యూపీ తూర్పు ప్రాంత ఇన్ చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి యూపీకి వచ్చిన ప్రియాంకకు అడుగడుగునా పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. సాదాసీదా వస్త్రధారణతో - మోములో చిరునవ్వుతో - ఆద్యంతం కార్యకర్తలకు - ప్రజలకు అభివాదం చేస్తూ శ్రేణుల్లో ప్రియాంక జోష్ నింపారు. తన నాయనమ్మ - మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తలపించారు. సోదరుడు - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పశ్చిమ యూపీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి బస్సు టాప్ పై నిలబడి ప్రియాంక మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రోడ్‌షో భారీ ఎత్తున సాగింది. రండి.. అందరం కలిసి సరికొత్త భవిష్యత్ ను నిర్మిద్దాం. వినూత్న రాజకీయాలకు శ్రీకారం చుడదాం.. ఈ మహాక్రతువులో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం.కృతజ్ఞతలు అంటూ లక్నోకు బయలుదేరే ముందు సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక గాంధీ పోస్టు చేశారు.

అయితే ఈ ప్రచార పర్వంపై బీజేపీ పాలిత రాష్ట్రంలో ప్రియాంక గాంధీకి అద్భుతమైన స్వాగతం లభించింది అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి - ఏఐసీసీ కమ్యూనికేషన్ కన్వీనర్ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పై కర్ణాటక బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ కౌంటర్ చేసింది. గజ్వేల్ లో ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి సభకు హాజరైన జనం ఫొటోను పెట్టారని.. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. వాళ్లు దోచుకున్నారు.. అబద్దాలు చెప్పారు ఇపుడు ఫొటోషాప్ చేసి జిమ్మిక్కు చేస్తున్నారని విమర్శించింది. మోసపూరిత ఫొటోలతో కాంగ్రెస్ 2019 ఎన్నికలకు వెళ్తోందని కామెంట్ చేసింది. వారసత్వంగా వచ్చిన ఓ నాయకురాలికి ఇలా ప్రమోషన్ ఇస్తున్నారంటూ విమర్శించింది. దీంతో ప్రియాంక చతుర్వేది షాక్ తిన్నారు. తన అకౌంట్ లో గజ్వేల్ సభ జనం ఫొటో తీసేసి.. ముందు జరిగిన పొరపాటును సవరించారు.