Begin typing your search above and press return to search.

కులాల కుమ్ములాట!

By:  Tupaki Desk   |   11 Sep 2018 6:14 AM GMT
కులాల కుమ్ములాట!
X
తెలంగాణలో ముందస్తు హడావుడి ప్రారంభమైంది. అన్ని రాజకీయ పార్టీలు వారివారి వ్యూహాల రూప కల్పనలో నిమగ్నమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి తొలి జాబితా105 మంది అభ్యర్ధులతో ప్రకటించి తన దూకుడు చూపించింది. ఇక కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం పార్టీలు పొత్తుల చర్చలు చేయాలనుకుంటున్నాయి. ప్రధామికంగా చర్చలు పూర్తి అయ్యాయంటున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఓ రూపు దాల్చలేదు. ఇక భారతీయ జనతా పార్టీ - వామపక్షాలు - తెలంగాణలో కొత్త పార్టీ తెలంగాణ జన సమితి - పవన్ కల్యాణ్ పార్టీ జనసేన - వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి స్పష్టత రాలేదు. ఈ పార్టీలు ఎవరితో జత కడతాయి... ఎవరిని వదులుకుంటాయి అనేది ఇంకా తేలలేదు. దీనిపై నాలుగైదు రోజుల్లో ఓ స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు. ముందుగా కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తులు కుదిరితే తెలంగాణలో పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ రాజకీయ పార్టీల వ్యూహ - ప్రతివ్యూహాలు ఇలా ఉంటే మరోవైపు కుల సంఘాలు తెలంగాణ ఎన్నికల తెరపైకి వస్తున్నాయి. పైకి ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా కులం లేకుండా దేశంలో రాజకీయ మనుగడ కష్టం. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ కుల సంఘాలకు ప్రాధాన్యం పెరిగిపోతూనే ఉంది. ప్రతి కులం వారు అన్ని పార్టీలు తమకు ప్రాధాన్యం ఇవ్వాలని - టిక్కట్ల పంపిణీ వివక్ష చూపరాదని డిమాండ్ చేస్తున్నాయి.

తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ అథమ పక్షం 10 సీట్లు కేటాయించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలా ఇవ్వని పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని, వారికి ఓటు వేయరాదంటూ ముదిరాజులకు పిలుపునిస్తామని వారంటున్నారు. దీనిపై ఓ సమావేశం నిర్వహించి తీర్మానం కూడా చేశారు ముదిరాజ్‌లు. ఇక బీసీల వంతు. తెలంగాణలో జనభాపరంగా బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు తెలంగాణ వ్యాప్తంగా 65 సీట్లు బీసీలకు ఇవ్వాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తన్నారు. వీరు కూడా సోమవారం నాడు సమావేశమై 65 స్ధానాలు ఇవ్వాలంటూ తీర్మానం చేశారు. ఇక తెలంగాణ జనాభాలో 20 శాతం ఉన్న మాదిగలకు ప్రతి పార్టీ 20 సీట్లు వంతున కేటాయించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రకటనలు చేస్తున్నారు. ఇక యాదవులు - గొల్ల కురుమలు తమ అభ్యర్ధులు ఏ పార్టీకి చెందిన వారైనా వారికే ఓటు వేస్తామని పలు చోట్ల ప్రతినబూనుతున్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కులాలు ఎన్నికల సమరాంగణానికి పై అంటున్నాయి.