Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా మీద ఫోక‌స్ పెంచిన విప‌క్షాలు

By:  Tupaki Desk   |   31 July 2015 9:03 AM GMT
ప్రత్యేక హోదా మీద ఫోక‌స్ పెంచిన విప‌క్షాలు
X
ఏపీ రాజ‌కీయాలు ర‌గులుకుంటున్నాయి. గ‌త ప‌ద్నాలుగు నెల‌లుగా విభ‌జ‌న సంద‌ర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల‌కు సంబంధించిన అంశాల విష‌యంలో పెద్ద‌గా ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హరించిన విప‌క్షాలు ఇప్ప‌డిప్పుడే దృష్టి సారిస్తున్నాయి.

ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నోరు విప్ప‌టం లేద‌న్న విమ‌ర్శ‌కు తెర దించుతూ ఆయ‌న త్వ‌ర‌లో ఢిల్లీలో దీక్ష చేస్తారంటూ ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లైతే.. ఈ విష‌యంపై ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా తూతూ మంత్రంగా కాకుండా.. ప్ర‌త్యేక హోదా నినాదాన్ని బ‌లంగా వినిపించ‌టం ద్వారా.. ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకోవాల‌న్న‌ది జ‌గ‌న్ ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తోంది.

మ‌రోవైపు.. ప్ర‌త్యేక హోదా అంశంపై ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద‌గా దృష్టి సారించ‌ని వామ‌ప‌క్షాలు.. ఆ లోటును తీరుస్తూ.. తాజాగా ఒక ప్ర‌క‌ట‌న చేశాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న విష‌యంపై కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రిని నిర‌సిస్తూ.. త్వ‌ర‌లో బ‌స్సుయాత్ర‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా ఏపీ సీపీఐ పార్టీ కార్య‌ద‌ర్శి వ్యాఖ్యానించారు.

ఇందుకోసం తాము శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం జిల్లా హిందూపూర్ వ‌ర‌కు బ‌స్సు యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ మ‌ధ్య‌న అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ సైతం ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కుగా ఆయ‌న అభివ‌ర్ణించ‌టం తెలిసిందే. చూస్తుంటే.. ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని గెలుచుకోవ‌టానికి ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర‌పైకి తీసుకురావ‌టం మిన‌హా మ‌రో మార్గం లేనట్లుగా విప‌క్షాలు భావిస్తున్నాయా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.