Begin typing your search above and press return to search.

12 ప్ర‌శ్న‌లు వేశారు స‌రే..వీటి మాటేంటి హ‌రీశా?

By:  Tupaki Desk   |   10 Oct 2018 7:10 AM GMT
12 ప్ర‌శ్న‌లు వేశారు స‌రే..వీటి మాటేంటి హ‌రీశా?
X
హ‌రీశ్ రావు ఎలాంటివాడో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎవ‌రెట్లా ఉన్నా తెలంగాణ ప్ర‌యోజ‌నాలు ముఖ్యం. ఆ త‌ర్వాతే ఇంకేమైనా. దుర‌దృష్ట‌వ‌శాత్తు హ‌రీశ్ లాంటి నేత ఏపీలో క‌నిపించ‌రు. తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం అదే ప‌నిగా మాట్లాడే హ‌రీశ్ లాంటి త‌ర‌హాలో.. ఏపీ గురించి.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టం గురించి.. దాని కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల గురించి ఏ ఒక్క నేత ఎందుకు మాట్లాడ‌రు? అన్న‌ది క్వ‌శ్చ‌న్.

తెలంగాణ ఇస్తే చాలు.. మొద‌టి ముఖ్య‌మంత్రి ద‌ళితుడే సీఎంగా ఉంటాడ‌ని.. అదే జ‌ర‌గ‌కుండా కేసీఆర్ మెడ‌కాయ మీద త‌ల‌కాయ ఉండ‌ద‌ని.. త‌న‌ను తాను నరుక్కుంటాన‌న్న కేసీఆర్ తాను మార్చిన మాట‌కు ఇప్ప‌టివ‌ర‌కూ స‌మాధానం చెప్పింది లేదు.

అంతేనా.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగితే చాలు.. రెండు రాష్ట్రాలు అన్న‌ద‌మ్ముల మాదిరి క‌లిసి ఉంటామ‌ని చెప్పిన హ‌రీశ్ లాంటోళ్లు.. ఈ రోజు అదే ప‌నిగా పంచాయితీల మీద పంచాయితీలు చేస్తూ.. వాటికి ఏపీ ప్ర‌జ‌ల్ని బ‌ద్నాం చేసే తీరును ప‌లువురు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ఏపీ స‌ర్కారుకు సంధిస్తున్న‌ట్లుగా 12 ప్ర‌శ్న‌లు వేసిన హ‌రీశ్ తీరు చూస్తే.. ఆయ‌న‌కు ఏపీ ప్ర‌జ‌లు బ‌త‌కాల‌న్న ఆలోచ‌న లేన‌ట్లుగా ఉంద‌నిపించ‌క మాన‌దు.

ఒక రాష్ట్ర తాజా మాజీ మంత్రిగా తాను ప్రాతినిధ్యం వ‌హించే రాష్ట్రంముందు ఉండాల‌ని.. త‌మ ప్ర‌జ‌లు బాగుండాల‌ని కోరుకోవ‌టం మామూలే. కానీ.. త‌మ సోద‌ర రాష్ట్రం నాశ‌న‌మైనా ఫ‌ర్లేదు.. ప్ర‌యోజ‌నాలు దెబ్బ తిన్నా ఫ‌ర్లేదన్న‌ట్లుగా మాట్లాడుతున్న వైన‌మే అర్థం కానిది.

హ‌రీశ్ తాజాగా సంధించిన 12 ప్ర‌శ్న‌ల‌కు సామాన్యులు సైతం కౌంట‌ర్ చెప్ప‌గ‌లిగే ప‌రిస్థితి. అలాంటి ఆంధ్రా ప్రాంత అధికార ప‌క్ష నేత‌లు చేత‌కాని ద‌ద్ద‌మ్మాల్లా ఎందుకు మౌనంగా ఉంటున్నార‌న్న‌ది అర్థం కానిది. హ‌రీశ్ సంధించిన 12 ప్ర‌శ్న‌ల‌కు కౌంట‌ర్లు చూస్తే..

1. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు చివరిదాకా ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. ఆ వైఖరిని మార్చుకున్నారా? భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడకుండా ఉంటారా? దీనిపై టీడీపీ పొలిట్‌ బ్యూరోలో తీర్మానం చేశారా?

సామాన్యుడి కౌంట‌ర్ : తెలంగాణ‌ను అడ్డుకోవ‌ట‌మే బాబు ఆలోచనే అయితే.. తెలంగాణ‌కు అనుకూలంగా లేఖ ఇచ్చిన మొద‌టి నేత చంద్ర‌బాబు. నిజానికి తెలంగాణ‌కు అనుకూలంగా లేఖ రాయటం ద్వారా ఆంధ్రా ప్రాంతానికి తీర‌ని అన్యాయం చేశారు. దుర‌దృష్టం ఏమంటే.. ఏ ఆంధ్రాకు అయితే బాబు అన్యాయం చేశాడో.. అదే రాష్ట్రానికి ఆయ‌న సీఎం కావ‌టం. అదే స‌మ‌యంలో తెలంగాణ‌కు అనుకూలంగా లేఖ ఇవ్వ‌టం ద్వారా చెప్పలేని రీతిలో మేలు చేసి మ‌రీ బాబు తిన్న‌న్ని తిట్లు మ‌రెవ‌రూ తిన‌లేద‌న‌టం నిజం కాదా?

2. ఉద్యోగులు - ప్రభుత్వ సంస్థలు - హైకోర్టు విభజన - కరెంటు - పోలవరం వంటి వివాదాల్లో చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వాదనలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వేసిన కేసులను ఆయన ఉపసంహరించుకుంటారా?

సామాన్యుడి కౌంట‌ర్ : తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం హ‌రీశ్ ఏ విధంగా త‌పిస్తారో.. ఆంధ్రా ప్రాంతం అవ‌స‌రాల్ని కూడా ప‌ట్టించుకోవాలి క‌దా. తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం ఏపీ మీద రాష్ట్రం వేసిన కేసుల మాటేంటి? ఆ మాట‌కు వ‌స్తే.. ఏపీ దాకా ఎందుకు.. తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన రీడిజన్ల మీద తెలంగాణ మేధావులే వ్య‌తిరేకిస్తున్నారు. ముందు ఏపీని ప్ర‌శ్నించే ముందు.. తెలంగాణ మేధావుల‌కు స‌మాధానం చెబితే బాగుంటుంది.

3. కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసి పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను చంద్రబాబు లాక్కున్నారు. వాటిని తిరిగి ఇచ్చేయడానికి సిద్ధమా? ఇందుకు చంద్రబాబును ఒప్పించేలా కాంగ్రెస్‌ ఆయనతో అంగీకారం ఏమైనా కుదుర్చుకుందా?

సామాన్యుడి కౌంట‌ర్ : బాబు పేరు చెప్పి హ‌రీశ్ అండ్ కో ఆంధ్రోళ్ల మీద వేస్తున్న నిందల్లో ఇదొక‌టి. ఏడు మండ‌లాల గురించి చెబుతున్న హ‌రీశ్‌.. మాట‌కు ఒక‌సారి నిజాం కాలం నాటి అని మాట్లాడుతుంటారు. మ‌రి.. అదే నిజాం కాలంలో ఈ ఏడు మండ‌లాలు ఎవ‌రి కింద ఉండేవి. ఆ మాట‌కు వ‌స్తే.. నాడు హైద‌రాబాద్ స్టేట్‌లో క‌లిసే నాటికి ఏడు మండ‌లాలు ఏపీ అధీనంలో ఉండేవ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతే ఎలా హ‌రీశ్‌?

4. పోలవరాన్ని 150 మీటర్ల ఎత్తులో కట్టి - 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో డ్యామ్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలం రామాలయంతోపాటు తెలంగాణలోని లక్షల ఎకరాలు మునిగిపోతాయి. పోలవరం డిజైన్‌ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా?

సామాన్యుడి కౌంట‌ర్ : ఉమ్మ‌డి రాష్ట్రంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టు ఓకే అయ్యింది. ఈ రోజున తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు పోల‌వ‌రం అడ్డంకి అని గొంతు చించుకునే హ‌రీశ్‌లాంటోళ్లు.. పోల‌వ‌రం కార‌ణంగా జ‌రిగే న‌ష్టంపై ఎందుకు గ‌ళం విప్ప‌ట్లేదు? కోర్టు కేసులు ఎందుకు వేయ‌రు? మైకుల ముందు చేసే డిమాండ్లతో ప్ర‌యోజ‌నం ఉంటుందా? పోల‌వ‌రం నిజంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌ష్ట‌మైతే.. దానిపైన ఇప్ప‌టివ‌ర‌కూ బ‌లంగా ఎందుకు త‌మ వాద‌న‌ను వినిపించ‌లేదు హ‌రీశ్‌?

5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతించవద్దని కేంద్రానికి వివిధ సంస్థలకుచంద్రబాబు 30 లేఖలు రాశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? అది చెప్పకుండా పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా?

సామాన్యుడి కౌంట‌ర్ :ఇక‌్క‌డ కూడా అంతే.. బాబు పేరు చెప్పి ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీయాల‌ని హ‌రీశ్ వ్య‌వ‌హ‌రించ‌టం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. బాబు త‌ర్వాత‌.. తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న ప్రాజెక్టుల తీరును తెలంగాణ పాత్రికేయులు.. ప్ర‌ముఖులు.. మేదావులు త‌ప్పు ప‌డుతున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా ఏపీ మీద అదే ప‌నిగా నోరు పారేసుకోవ‌టం మంచిదా?

6. కాళేశ్వరం - తుమ్మిడిహట్టి - సీతారామ - తుపాకులగూడెం - దేవాదుల - పెన్‌ గంగ - రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవడానికి చంద్రబాబు ఒప్పుకొన్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పగలరా?

సామాన్యుడి కౌంట‌ర్ : తెలంగాణ ఉద్య‌మం సంద‌ర్భంగా వినిపించిన ముఖ్య‌మైన నినాదాల్లో ఒక‌టి విడిపోయి క‌లిసి ఉందామ‌ని. ఆ నినాదం స్ఫూర్తికి భంగం వాటిల్లేలా హ‌రీశ్ అండ్ కో ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నట్లు. ఏ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు వారికి ముఖ్యం. కానీ.. ప‌క్క‌నోడి బాగుప‌డొద్దు.. మ‌నం మాత్ర‌మే మంచిగా ఉందామ‌నుకుంటూ ఏపీ ప్ర‌జ‌ల మీద విషం క‌క్కుడేంది?

7. పోలవరంతో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌ కు తరలిస్తున్నందున.. నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణానదిలో 80 టీఎంసీల వాటా ఇవ్వాలని గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు వస్తాయి. కానీ నీళ్లు ఇవ్వబోమని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చంద్రబాబు కొర్రీలు పెట్టారు. నల్లగొండ - మహబూబ్‌ నగర్‌ ప్రజల కోసం 45 టీఎంసీల నీటిని కాంగ్రెస్‌ సాధించగలదా?

సామాన్యుడి కౌంట‌ర్ : ఒక ఉమ్మ‌డి కుటుంబం విడిపోతే.. అప్ప‌టివ‌ర‌కూ ప్రాణానికి ప్రాణంగా ఉండే అన్న‌ద‌మ్ముల మ‌ధ్యే స‌వాల‌చ్చ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వాటిని సామ‌ర‌స్య పూరిత వాతావ‌ర‌ణంలో మాట్లాడుకోవ‌టం అవ‌స‌రం. అదేమీ లేకుండా అడ్డ‌గోలు వాద‌న‌ల‌తో ఒక‌రికి మాత్ర‌మే ప్ర‌యోజ‌నం క‌ల్పించేలా వాద‌న‌లు వినిపించ‌టం స‌బ‌బేనా?

8. హైదరాబాద్‌ తోపాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు మిషన్‌ భగీరథను చేపడితే.. గోదావరి - కృష్ణా నదీ జలాలను వాడుకోవడం తప్పు అని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఇది తప్పు అని ఆయన ఏమైనా పశ్చాత్తాపం వ్యక్తం చేశారా?

సామాన్యుడి కౌంట‌ర్ : హైద‌రాబాద్‌ కు నీళ్లు ఇచ్చే ప్ర‌య‌త్నాన్ని దెబ్బ తీసేలా ఏపీ ప్ర‌భుత్వం ప్లాన్ చేసింద‌ని చెప్పే హ‌రీశ్ ఒక విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఆంధ్రోళ్ల‌ను ఆర్థికంగా దెబ్బ తీసిన త‌మిళ‌నాడు దాహార్తి కోసం తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించిన విశాల హృద‌యం ఆంధ్రోళ్ల‌ది. తాము విడిపోయిన రాష్ట్రం క‌ష్టాన్ని చూడ‌లేక స్పందించిన గుణాన్ని మ‌ర్చిపోవ‌ద్దు. అలాంటి తీరును హ‌రీశ్ ఎందుకు ప్ర‌ద‌ర్శించ‌రు?

9. రూ.5 వేల కోట్ల విలువైన సీలేరు పవర్‌ ప్రాజెక్టును చంద్రబాబు లాక్కున్నారు. తెలంగాణకు ఏపీ ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టును తిరిగి ఇచ్చేస్తామని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా? నష్టపరిహారమైనా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందా?

సామాన్యుడి కౌంట‌ర్ : విభ‌జ‌న వేళ.. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని భారీగా దెబ్బ తీస్తూ.. ఎన్నో వ‌రాలు తెలంగాణ‌కు ఇస్తే.. ఇప్ప‌టివ‌రకూ ఏ ఆంధ్రా ప్రాంత నాయ‌కుడు ప్ర‌శ్నించింది లేదు. అలాంట‌ప్పుడు ఏపీకి న‌ష్టం వాటిల్లేలా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ట్లుగా హ‌రీశ్ లాంటోళ్లు ఎందుకు ప్ర‌శ్నిస్తుంటారు. ఆంధ్రా వాళ్ల‌కు అన్ని తెలివితేట‌లే ఉంటే.. ఏపీని వ‌దిలేసి హైద‌రాబాద్ లో అంత భారీగా పెట్టుబ‌డులు పెడ‌తారా?

10. ఏపీకి చెందిన 1200 మంది విద్యుత్తు శాఖ ఉద్యోగులను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తే.. వారిని విధుల్లో చేర్చుకోకుండా ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. పని చేయకున్నా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. వారిని విధుల్లో చేర్చుకుని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కేసులను ఉపసంహరించుకునేలా చేస్తారా?

సామాన్యుడి కౌంట‌ర్ : విద్యుత్ ఉద్యోగుల పంచాయితీని తెర మీద‌కు తెస్తున్న హ‌రీశ్‌.. అలాంటి వ్య‌వ‌హారాలు రెండు రాష్ట్రాల మ‌ధ్య చాలానే ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఎందుకు ఓపెన్ గా ఒప్పుకోరు. త‌ను తేల్చాల్సిన ఏ అంశాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం తేల్చ‌కుండా కొర్రీలు పెడుతుందన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

11.. నిజాం కాలం నుంచి ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ వాదిస్తోంది. కోర్టుల్లో కేసులు వేసింది. వాటిలో ఏపీకి వాటా ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? కేసుల ఉపసంహరణకు ఒప్పుకున్నారా?

సామాన్యుడి కౌంట‌ర్ : ఇద్ద‌రు క‌లిసి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసిన‌ప్పుడు.. విడిపోయేట‌ప్పుడు స‌మంగా పంచుకుంటారా? లేక‌.. ఒక‌రికి లాభంగా.. మ‌రొక‌రికి న‌ష్టంగా పంచుతారా? విడిపోవ‌ట‌మే ల‌క్ష్య‌మైన‌ప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా ఎందుకు వ్య‌వ‌హ‌రించిన‌ట్లు? నిజాం కాలం నాటి ఆస్తులు కావాల‌న్న‌ది ఏపీ వాద‌న త‌ప్పు అయితే.. ఈ రోజున హైద‌రాబాద్ ఇంత భారీగా అభివృద్ధి చెంది.. భారీ ఆదాయంగా మారిన‌ప్పుడు ఏపీకి చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌లేద‌న్న‌ది

12.. ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో ఏపీ సహాయ నిరాకరణ చేస్తోంది. ఈ వివాదాల పరిష్కారానికి సహకరిస్తానని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా?

సామాన్యుడి కౌంట‌ర్ : గుండెల మీద చేయి వేసుకొని హ‌రీశ్ ఒక్క మాట చెబితే స‌రిపోతుంది. నిజంగానే రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న పంచాయితీలు ఏపీ ప్ర‌భుత్వం కార‌ణంగానే పెండింగ్‌ లో ఉన్నాయా? తెలంగాణ ప్ర‌భుత్వం పెట్టిన కొర్రీల వ‌ల్ల కూడా కాదా? అయినా.. రెండు రాష్ట్రాల మ‌ధ్య వివాదాల్ని రెండేళ్ల టైమ్ లైన్ తో ఎందుకు ప‌రిష్క‌రించుకోన‌ట్లు? ఒక‌వేళ‌.. ఏపీ స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తే.. ఆ విస‌యాన్ని మొద‌టి నుంచే మీడియాతో చెప్పాలే కానీ.. ఎన్నిక‌ల వేళ‌.. రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా లేని వేళ ప్ర‌స్తావించ‌టంలో మ‌ర్మ‌మేంది హ‌రీశా?