Begin typing your search above and press return to search.

విజ‌య్ కేసులో స‌రికొత్త ట్విస్టు!

By:  Tupaki Desk   |   16 Dec 2017 1:50 PM GMT
విజ‌య్ కేసులో స‌రికొత్త ట్విస్టు!
X
క‌మెడియ‌న్ విజ‌య సాయి హత్య కేసులో రోజుకో కొత్త ట్విస్టు బ‌య‌టికొస్తోంది. త‌న భార్య వ‌నిత‌తో పాటు - అడ్వ‌కేట్ శ్రీనివాస్‌ - శ‌శిధ‌ర్ లు మాన‌సికంగా వేధించ‌డం వ‌ల్లే తాను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నాన‌ని విజ‌య్ సూసైడ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు , ఆ ఆత్మ‌హ‌త్య‌కు ఏమాత్రం సంబంధంలేద‌ని చెప్పిన వ‌నిత అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. విజయ్ కి వనిత వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒక‌టి నిన్న‌ బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నం రేపింది. ఈ నేప‌థ్యంలో తాజాగా అజ్ఞాతంలో ఉన్న వ‌నిత విడుద‌ల చేసిన సెల్ఫీ వీడియో ఒక‌టి తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఆ వీడియోలో విజ‌య్ పై వ‌నిత తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాకుండా, ఓ అమ్మాయితో విజ‌య్ స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను మీడియాకు విడుదల చేసింది. తానెక్క‌డికీ పారిపోలేద‌ని, విజ‌య్ త‌ల్లిదండ్రులు త‌న‌పై అవాస్త‌వ‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, అన్ని ఆధారాల‌తో త్వ‌ర‌లోనే వ‌చ్చి పోలీసుల‌కు లొంగి పోతాన‌ని తెలిపింది. ప్ర‌స్తుతానికి పోలీసులు త‌న‌ను క్ష‌మించాల‌ని - త్వ‌ర‌లోనే లొంగిపోయి అన్ని విష‌యాలు వివ‌రిస్తాన‌ని పేర్కొంది. విజ‌య్ నిజ స్వ‌రూపం అంద‌రికీ తెలియాల‌ని - తామిద్ద‌రం ఏ కార‌ణాల‌తో విడిపోయామో ఆధారాలు చూపిస్తాన‌ని తెలిపింది.

మూడేళ్లుగా తాను విజయ్ కి దూరంగా బ్ర‌తుకుతున్నాన‌ని - త‌న ఆత్మహత్యతో సంబంధం లేద‌ని వ‌నిత మ‌రొక‌సారి తెలిపింది. విజయ్ కొన్ని త‌ప్పులు చేశాడ‌ని - అత‌డి త‌ల్లిదండ్రులు వాటిని క‌ప్పిపుచ్చాల‌ని చూస్తున్నార‌ని ఆరోపించింది. తాను భ‌ర్త‌ను కోల్పోయిన ఆడపిల్లన‌ని - ఎలా బ్ర‌తుకుతాన‌ని - త‌న‌కు అత్త‌మామ‌లు హాని త‌ల‌పెడితే త‌న బిడ్డ భవిష్యత్తు ఏమ‌వుతుంద‌ని ప్ర‌శ్నించింది. అందుకే విజ‌య్ గురించి త‌గిన ఆధారాలు సేక‌రించేందుకే అజ్ఞాతంలోకి వెళ్లాన‌ని - త‌న‌ భర్త ఎలాంటి వాడో వీడియోలు - ఆడియోలు - ఫొటోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతాన‌ని చెప్పింది. త‌న‌పై వ‌స్తున్న పుకార్ల‌న్నింటికీ జ‌వాబు చెబుతాన‌ని తెలిపింది. తమ కొడుకు చనిపోయాడని విజ‌య్ త‌ల్లిదండ్రులు ఆలోచిస్తున్నార‌ని, మ‌నవరాలు భవిష్యత్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని తెలిపింది. కార్లు - బంగ్లాలు కోసం తాను కోర్టులో కేసులు వేయ‌లేద‌ని - ఎలాంటి కేసులు వేశానో ఎవ‌రైనా చూడ‌వ‌చ్చ‌ని తెలిపింది. వ‌నిత సెల్‌ ఫోన్ ను ట్రాక్ చేసిన పోలీసులు ఆమె కాకినాడలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కోసం 3 ప్రత్యేక టీమ్ లు కాకినాడ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంపై పోలీసుల నుంచి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

అయితే, వ‌నిత వీడియోల‌పై విజ‌య తండ్రి సుబ్బారావు స్పందించారు. విజ‌య్ ఎంతో ప్రేమ‌గా చూసుకునే కారును వ‌నిత లాక్కొని వెళ్లింద‌ని - ఆ మ‌న‌స్తాపంతోనే విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఆయ‌న ఆరోపించారు. ఆ కారును శ‌శిధ‌ర్ రెడ్డి ఇంట్లో పెట్టింద‌ని - ఆ ఇల్లు కూడా త‌న‌దేన‌ని చెబుతోంద‌ని ఆరోపించారు. వ‌నిత ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్న‌ట్లుగానే, త‌మ ద‌గ్గ‌ర కూడా ఆమెకు సంబంధించిన ఆధారాలున్నాయ‌ని , అన్నిటినీ పోలీసుల‌కు, కోర్టుకు స‌బ్ మిట్ చేస్తామ‌ని చెప్పారు. ఆమె త‌ప్పు చేయ‌న‌పుడు పారిపోవ‌ల‌సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. 3 సంవ‌త్స‌రాల నుంచి బ‌య‌ట‌పెట్ట‌ని వీడియోలు విజ‌య్ చ‌నిపోయిన త‌ర్వాత బ‌య‌ట‌పెట్ట‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. విజ‌య్ ను వ‌నిత ఎపుడూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేద‌ని - చాలాసార్లు బెదిరించింద‌ని - ఆ మాన‌సిక క్షోభ వ‌ల్లే విజ‌య్ చ‌నిపోయాడ‌ని ఆరోపించారు. త‌న‌తో ఆస్తి తగాదాల కార‌ణంగానే విజ‌య్ చ‌నిపోయాడ‌ని వ‌నిత ఆరోపిస్తోంద‌ని, అల్లారు ముద్దుగా పెంచుకున్న విజ‌య్ ను తామెందుకు చంపుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. ఆమె పెళ్లి త‌ర్వాత ఏమి సంపాదించ‌లేద‌ని, అటువంటిది తన డ‌బ్బులు 40 ల‌క్ష‌లు విజ‌య్ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని ఎలా చెబుతుంద‌ని ప్ర‌శ్నించారు.