Begin typing your search above and press return to search.

ముగిసిన కోళ్ల పందాలు..చేతులు మారిన వేల‌కోట్లు

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:26 PM GMT
ముగిసిన కోళ్ల పందాలు..చేతులు మారిన వేల‌కోట్లు
X
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలవైపు వెళ్లే రోడ్లన్నీ జామ్ అయిపోతాయి. కేవలం ఆంధ్రప్రాంత ప్రజలే కాదు.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో సంక్రాంతి వినోదానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లంతా ఏపీలోని ఉభయగోదావరి జిల్లాలకు తరలివెళ్తుంటారు. ఇందులో మెజార్టీ కోళ్ల పందాల ప్రియులే అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పండుగకు చివరి రోజు కావడంతో పందాలు జోరుగా సాగాయి. ఉంగుటూరు - బాపులపాడు - గోపవరపుగూడెం - అంపాపురం తదితర ప్రాంతాల్లో కోడి పుంజులకు కత్తులు కట్టి మరీ కయ్యానికి దింపారు.ఈ మూడు రోజుల కోడిపందాల్లో దాదాపు వెయ్యి కోట్ల కు పైగా చేతులు మారినట్టు లెక్కలేస్తున్నారు.

కనుమ రోజున కృష్ణా జిల్లా విజయవాడతో పాటు గన్నవరం నియోజకవర్గంలో కోడి పందాలు హోరెత్తిపోయాయి. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే తొలి రెండు రోజుల్లోనే రెండు వందల కోట్ల బెట్టింగ్‌ సాగిందంటున్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించారు. ఏలూరు - తణుకు తదితర ప్రాంతాల్లో పందాల రాయుళ్లతో బరులు కిటకిటలాడాయి. స్థానికులతో పాటు యానాం - తెలంగాణ - తమిళనాడు - కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచే కాక.. విదేశీయులు సైతం పందాల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు.

ఇక అటు తూర్పు గోదావరి జిల్లాలోనూ కోడి పందాల జోరు కొనసాగింది. అనేక చోట్ల వేల సంఖ్యలో బెట్టింగులు సాగాయి. కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందాలను హాస్యనటుడు పృథ్వీ సందర్శించారు. అంతే కాదు తాను కూడా స్వయంగా ఓ కోడిని పట్టుకుని రంగంలోకి దిగారు. మొత్తం మీద ఈ ఏడాది జరిగిన కోడి పందాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనధికారికంగా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఈ సారి సంక్రాంతి పందెం లీగ్‌ సూపర్‌ హిట్‌ అయినట్లేనని నిర్వాహకులు అంటున్నారు.

కాగా, సంక్రాంతి సంద‌ర్భంగా రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినూత్నతరహాలో పందుల పందెం జరిగింది. పందుల హోరాహోరీపై కూడా పందెం రాయుళ్లు కాసుల పంట పండించుకొన్నారు.. కర్నూలు - మహబూబ్‌నగర్ - గద్వాల్ - హిందూపురం - కల్యాణ దుర్గం - కడప - బేతంచర్ల తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పందులు పాల్గొన్నాయి. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో పొటేళ్ల పందేలు జోరుగా జరిగాయి.