కేసీఆర్ ఢిల్లీలో మరిచిన అసలు విషయం ఇదేనా?

Sun Jun 17 2018 22:06:24 GMT+0530 (IST)

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ నాలుగో పాలకమండలి సమావేశంలో కేంద్రమంత్రులు - పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు - ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ భేటీలో పాల్గొన్నారు. అంతకుముందే ఆయన ప్రధానమంత్రితో భేటీ అయి రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు - పరిష్కారానికి హామీ పొందే ప్రయత్నం చేశారు.కాగా నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించి తెలంగాణలో వ్యవసాయరంగ సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. ``తెలంగాణలో 98శాతం మంది సన్న - చిన్నకారు రైతులున్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం రుణ లభ్యత - వ్యవసాయోత్పత్తుల ధరలు పంటల సాగుపై ఎలాంటి ప్రభావం చూపదు. రైతు బీమా యోజన ద్వారా 18 నుంచి 60ఏళ్ల లోపు రైతులకు రూ.5లక్షల బీమా కల్పించాం. రైతు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించనుంది. బీమా ప్రీమియంతో ఖజానాపై ఏటా రూ.వెయ్యి కోట్ల మేర భారం పడుతుందని వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి 50లక్షల మంది రైతులకు బీమా కల్పించబోతున్నాం` అని కేసీఆర్ పేర్కొన్నారు.

కాగా ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక గళం ఎత్తుకున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఆయన బీజేపీ సర్కారును విమర్శించారు. బీజేపీయేతర సీఎంలను కలిసి ప్రత్యామ్నాయ రాజకీయవేదికను రూపొందించే ప్రయత్నం చేశారు. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ రథసారథి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ - జేడీఎస్ నాయకుడు - కర్ణాటక సీఎం కుమారస్వామి ఉన్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ సీఎం  కేజ్రీవాల్ చేస్తున్న దీక్షకు మద్దతుగా గళం విప్పగా... సీఎం కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నీతిఅయోగ్ సమావేశానికి గైర్హాజరు అయినప్పటికీ ఆయన విషయాన్ని మాటమాత్రమైన ప్రస్తావించకపోవడం...తన ప్రసంగం వరకే పరిమితం అయిపోయి...ఢిల్లీ నుంచి తిరుగుటపాలో వచ్చేయడం ఆసక్తికరంగా మారింది.