Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఎంపీ వ‌ర్సెస్‌ ఎమ్మెల్యే ఫైట్?

By:  Tupaki Desk   |   23 July 2017 5:26 AM GMT
టీఆర్ ఎస్ ఎంపీ వ‌ర్సెస్‌ ఎమ్మెల్యే ఫైట్?
X
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో నిర్ణ‌యం ఏదైనా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌దే మాట ఫైన‌ల్ అనేది అంద‌రికి తెలిసిన ర‌హ‌స్యం. ఒక‌వేళ పార్టీలోని నేత‌ల మ‌ధ్య పొరాపొచ్చాలు ఏమైన ఉన్నా వాటిని క‌ప్పిపుచ్చుకుంటారే తప్ప ర‌చ్చ చేసుకోరు. కానీ అలాంటి తీరుకు భిన్నంగా తాజాగా క‌ల‌క‌లం రేకెత్తే సంఘ‌ట‌న జ‌రిగింది. పార్టీలోని అంత‌ర్గ‌త వార్ కార‌ణంగా స‌స్పెన్ష‌న్ల ప‌ర్వం చోటుచేసుకుంది. అందులోనూ ఏకంగా క్షేత్ర‌స్థాయిలో కీల‌క‌మైన ప‌ద‌వి అయిన ఎంపీపీని పార్టీ నుంచి పక్క‌న పెట్టారు. ఇదంతా ఎంపీ - ఎమ్మెల్యేల మ‌ధ్య వార్ కార‌ణంగా అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీఆర్ ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌ కుమార్‌ జన్మదిన వేడుకలు వేములవాడ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ రంగు వెంకటేశ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎంపీ జన్మదిన వేడుకలను భారీఎత్తున నిర్వహించారు. తొలుత ర్యాలీ నిర్వహించారు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యే అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. తన ఇలాఖాలో ఎంపీ జన్మదిన వేడుకలు నిర్వహించడం ఏమిటంటూ స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌ బాబు కోపోద్రిక్తులయ్యారని ప్ర‌చారం జ‌రుగుతోంది. వేడుకలు నిర్వహించినందుకు వివిధ కారణాలు చూపుతూ ఎంపీపీ రంగు వెంకటేశ్‌ గౌడ్‌ తోపాటు నాయకులు చిలుక పెంటయ్య - పూడూరి రాజిరెడ్డి - రాజాగౌడ్‌ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామని ప్రకటించారు. వీరికి టీఆర్‌ ఎస్‌ తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

అయితే ఎంపీపీ స‌హా పార్టీ పార్టీ నేత‌ల‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. పార్టీ అంత‌ర్గ‌త పేచీలు నాయ‌కుల‌ను స‌స్పెండ్ చేసే స్థాయికి చేరడం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవ‌ల పార్టీ ప‌రిణామాల‌పై సీరియ‌స్‌ గా దృష్టి సారించిన‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా ప‌రిణామంపై ఏ విధంగా స్పందిస్తారోన‌ని గులాబీ వ‌ర్గాలు ఎదురు చూస్తున్నాయి.