Begin typing your search above and press return to search.

టీడీపీ జ‌మానా!..లేడీ ఆఫీస‌ర్స్ ప‌నిచేయ‌లేరంతే!

By:  Tupaki Desk   |   13 Jan 2019 10:01 AM GMT
టీడీపీ జ‌మానా!..లేడీ ఆఫీస‌ర్స్ ప‌నిచేయ‌లేరంతే!
X
ఏపీలో అధికారం టీడీపీ చేప‌ట్టిన నాటి నుంచి ఆ పార్టీ నేత‌ల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఓ రెండేళ్ల క్రితం త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షిపై ఓ టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా దాడికి దిగితే... ఇప్పుడు అదే పార్టీకి చెందిన మ‌రో ఎమ్మెల్యే ఏకంగా స‌బ్ క‌లెక్ట‌ర్‌ పైనే చిందులు తొక్కారు. మొత్తంగా టీడీపీ జ‌మానాలో అధికారులు స్వేచ్ఛ‌గా ప‌నిచేసే వాతావ‌ర‌ణం లేద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో కృష్ణా - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల స‌రిహ‌ద్దు ప్రాంతంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అనుచ‌రులు అక్ర‌మంగా ఇసుక త‌ర‌లిస్తున్నార‌న్న స‌మాచారం మేర‌కు కృష్ణా జిల్లాకు చెందిన త‌హ‌శీల్దార్ వ‌న‌జాక్షి... ఆ ఇసుకాసురుల‌ను అడ్డుకునేందుకు ధైర్యంగా రంగంలోకి దిగారు. ఆమె అక్క‌డ కాలు మోపారో, లేదో... విష‌యం తెలుసుకున్న చింత‌మనేని హుటాహుటీన అక్క‌డ‌కు చేరుకున్నారు.

ఇసుక త‌ర‌లింపును అడ్డుకోవ‌డానికి మీరెవ‌రంటూ ఆ మ‌హిళా త‌హ‌శీల్దార్‌ పై చిందులు తొక్కారు. నిబంధ‌న‌ల మేర‌కే చ‌ర్య‌లు తీసుకునేందుకు వ‌చ్చాన‌ని స‌మాధానం ఇచ్చిన వ‌న‌జాక్షిపై చింత‌మ‌నేని త‌న అనుచ‌రుల‌తో క‌లిసి చేయి చేసుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌న‌జజాక్షి కింద‌ప‌డిపోగా... మ‌హిళ అన్న క‌నిక‌రం కూడా లేకుండా జుట్టు ప‌ట్టుకుని మ‌రీ లాగారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ చిన్న‌పాటి వీడియో - ఫొటోలు నెట్ లో వైర‌ల్ గా మారాయి. ఈ ఉదంతం టీడీపీ నేత‌లు - రెవెన్యూ అసోసియేష‌న్‌ కు మ‌ధ్య భారీ వివాదాన్నే రేపింది. అయితే చాలా చాక‌చ‌క్యంగా టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు పావులు క‌దిపి... బాదితురాలైన వ‌న‌జాక్షి నుంచే క్ష‌మాప‌ణ‌లు చెప్పించారు. ఈ ఘ‌ట‌న‌తో టీడీపీ ప‌రువు దాదాపుగా గంగ‌లో క‌లిసిపోయినంత ప‌నైంది.

ఈ ఘ‌ట‌న‌తోనైనా టీడీపీ నేత‌లు బుద్ధిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అంతా ఆశించారు. అయితే ఎంత జ‌రిగినా టీడీపీ నేత‌ల్లో మార్పు మాత్రం రావ‌డం లేదు. ఈ ఘ‌టన జ‌రిగిన త‌ర్వాత కూడా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ త‌నదైన రీతిలో దురుసు వ‌ర్త‌న‌కే ప్ర‌యారిటీ ఇవ్వ‌గా.... ఆయ‌న‌పై ఏకంగా కేసులు కూడా న‌మోద‌య్యాయి. తాజాగా ఇప్పుడు కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత‌ - పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ వంతు వ‌చ్చింది. చింత‌మ‌నేని త‌హశీల్దార్ స్థాయి మ‌హిళ‌పై దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తే... చింత‌మ‌నేని కంటే తాను మ‌రింత ఎక్కువేన‌న్న రీతిలో బోడె ప్ర‌సాద్ ఏకంగా యువ ఐఏఎస్ అధికారిణి - కృష్ణా జిల్లా స‌బ్ క‌లెక్ట‌ర్‌ పైనే రంకెలేశారు. నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ఓ రైతుకు చెందిన ట్రాక్ట‌ర్‌ ను సీజ్ చేసిన స‌బ్ క‌లెక్ట‌ర్ మిషా సింగ్‌... దానిపై రూ.2 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తే... జ‌రిమానా చెల్లించ‌కుండానే అధికారుల‌పై దౌర్జ‌న్యం చేసి మ‌రీ ట్రాక్ట‌ర్‌ ను త‌ర‌లించుకుపోయారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ నేత‌ల‌కు చెందిన వారి ట్రాక్ట‌ర్ల‌నే సీజ్ చేస్తారా? అంటూ మిషా సింగ్‌ పై బోడె చిందులు తొక్కార‌ట‌. అంతటితో ఆగ‌కుండా... మిషా సింగ్ త‌న డ్యూటీ తాను చేయ‌డ‌మే నేరంగా భావించిన బోడె.. ఆమెపై ఏకంగా సీఎం చంద్ర‌బాబుకే ఫిర్యాదు చేశార‌ట‌.

ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాల్లోకెళితే... కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరులో రూ.10 కోట్లు విలువ చేసే 2.84 ఎకరాల పుల్లేరు కట్టభూమిని కొందరు చదును చేస్తున్నట్లు ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో రంగంలోకి దిగిన సబ్ కలెక్టర్ మీషా సింగ్‌ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని - నిందితులను అరెస్ట్ చేయాలని పెనమలూరు ఎమ్మార్వో మురళీకృష్ణ - సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడ భూమిని చదును చేస్తున్న ప్రొక్లెయిన్ ను అధికారులు సీజ్ చేశారు. రూ.2 లక్షల మేర జరిమానా విధించారు. అంతలోనే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రొక్లెయిన్ ను తన గెస్ట్ హౌస్ కు తరలించార‌ట‌. నాడు త‌హ‌శీల్దార్‌ పై దాడి ఘ‌ట‌న‌తో చింత‌మ‌నేని వివాదంలో కూరుకుపోతే... నేడు ఏకంగా స‌బ్ క‌లెక్ట‌ర్ స్థాయి అధికారిణిపైనే చిందులు తొక్కిన బోడె ప్ర‌సాద్ మ‌రో వివాదం రేపారు. ఈ త‌రహా వ‌రుస ఘ‌ట‌న‌లు చూస్తుంటే... టీడీపీ జ‌మానాలో కీల‌క స్థానాల్లో ప‌నిచేస్తున్న మ‌హిళా అధికారులు త‌మ ప‌ని తాము చేసుకోలేక‌పోతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాకుండా అస‌లు టీడీపీ జ‌మానాలో మ‌హిళా అధికారులు విధుల‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డిపోవాల్సిన దుస్థితి వ‌చ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది.