Begin typing your search above and press return to search.

డిగ్గీ రాజా ముందే లాగి పెట్టి పీకాడ‌ట‌!

By:  Tupaki Desk   |   22 April 2017 4:17 AM GMT
డిగ్గీ రాజా ముందే లాగి పెట్టి పీకాడ‌ట‌!
X
ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాంగ్రెస్ అధిష్ఠానానికి న‌మ్మిన బంటు.. గాంధీల కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడైన ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిగ్విజ‌య్ సింగ్ అలియాస్ డిగ్గీ రాజాకు నోట మాట రానంత షాక్ త‌గిలింది. త‌న ఎదుటే కాంగ్రెస్ నేత‌లు కుమ్ములాట‌ల్ని నిస్స‌హాయంగా ఆయ‌న చూస్తుండిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. భువ‌న‌గిరి - యాదాద్రి డీసీసీ అధ్య‌క్ష ఎన్నిక సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు భౌతిక‌దాడుల వ‌ర‌కూ వెళ్లిన‌ట్లుగా తెలిసింది. జ‌రుగుతున్న తంతును చూస్తుండిపోవ‌టం త‌ప్ప.. డిగ్గీ రాజా ఏమీ చేయ‌లేక‌పోయార‌ని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒక‌రు.. మ‌రోకాంగ్రెస్ నేత చెంప ఛెళ్లుమ‌నిపించ‌టం డిగ్గీ రాజా జీర్ణించుకోలేని అంశంగా చెబుతున్నారు. ఇంత‌కీ.. అస‌లేం జ‌రిగింది? భౌతిక దాడుల వ‌ర‌కూ విష‌యం ఎందుకు వెళ్లింది? కాంగ్రెస్ నేత చెంప ఛెళ్లుమ‌నిపించింది ఎవ‌రు? త‌న తీరుతో డిగ్గీ రాజాకు షాకిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎవ‌ర‌న్న విష‌యంలోకి వెళితే..

న‌ల్గొండ జిల్లా నుంచి విడిపోయిన భువ‌న‌గిరి.. యాదాద్రిల‌కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎంపిక అంశంపై జిల్లా ముఖ్య‌నేత‌ల అభిప్రాయాల్ని తెలుసుకునే కార్య‌క్ర‌మం ఒక‌టి జ‌రిగింది. ఈ స‌మావేశంలో డిగ్గీ రాజాతో పాటు.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. పీసీసీ కోశాధికారి గూడూరునారాయ‌ణ రెడ్డి త‌దిత‌ర కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎవ‌రిని ఎంపిక చేయాల‌న్న విష‌యం మీద చ‌ర్చ షురూ అయ్యింది. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన మాజీ ఎమ్మెల్సీ భిక్ష‌మ‌య్య‌గౌడ్ తాను ఆస‌క్తిగా ఉన్న‌ట్లుగా చెప్పారు. ఆయ‌న మాట‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా గూడూరు నారాయ‌ణ‌రెడ్డి చెప్పి.. ఆయ‌న్ను ఎంపిక చేయ‌ట‌మే మంచిద‌న్నారు.

ఇక్క‌డి వ‌ర‌కూ సీన్ బాగానే జ‌రిగినా.. ఇక్క‌డే మొత్తంగా మారిపోయింద‌ని తెలుస్తోంది. భిక్ష‌మ‌య్య‌గౌడ్ ఎంపిక‌పై మీ అభిప్రాయం ఏమిటంటూ ఎమ్మెల్సీ కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని డిగ్గీ రాజా అడిగారు. దీనికి స్పందించిన కోమ‌టిరెడ్డి త‌న అభిప్రాయానికి విలువ‌నిచ్చి.. తాను చెప్పిన వ్య‌క్తి కే డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తానంటే పేరు చెబుతాన‌ని.. త‌న మాట‌కు త‌గ్గ‌ట్లే ఎంపిక ఉండాల‌న్నారు. కోమ‌టిరెడ్డి మాట‌ల‌కు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన నారాయ‌ణ రెడ్డి.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంట్రాక్టులు చేస్తూ కోట్లు సంపాదించార‌ని.. వాటితో రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. ఆయ‌న్ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించిన‌ట్లు తెలిసింది.

దీంతో కోమ‌టి రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్య‌క్తం చేస్తూ.. బ్రోక‌ర్ గా ప‌ని చేసి రాజ‌కీయాలు చేస్తున్న నువ్వు మాట్లాడ‌తావా? న‌యింతో దందాలు చేసిన హిస్ట‌రీ నీది.. నువ్వు నా గురించి మాట్లాడ‌తావా? అంటూ ఫైర్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా మాటా మాటా పెరిగిన‌ట్లుగా స‌మాచారం. తూటాల్లాంటి మాట‌ల స్థాయి దాటిన నేత‌లు ఆగ్ర‌హంతో ఊగిపోయిన‌ట్లుగా తెలిసింది. ఈ స‌మ‌యంలో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన కోమ‌టిరెడ్డి.. నారాయ‌ణ రెడ్డి చెంప ఛెళ్లుమ‌నిపించిన‌ట్లుగా స‌మాచారం. ఊహించ‌ని ప‌రిణామంతో డిగ్గీ.. ఉత్త‌మ్ ల‌తో స‌హా అక్క‌డి నేత‌లంతా షాక్ కు గురైన‌ట్లుగా తెలిసిందే. చెంప‌దెబ్బ‌తో ఉద్రిక్త‌త మ‌రింత పెరిగి.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య కాసేపు భౌతిక దాడులు జ‌రిగిన‌ట్లుగా స‌మాచారం. అనంత‌రం పెద్ద‌లంతా నేత‌ల్ని కూల్ చేయ‌టానికి నానా పాట్లు ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతంలో ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌కు స్వ‌ల్ప గాయాలు అయిన‌ట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/