ఒత్తిడి పెట్టి మెగాబ్రదర్స్ కు బీజేపీ చిరాకు తెప్పిస్తోందా?

Sun Aug 18 2019 17:39:51 GMT+0530 (IST)

ఎవరి అవసరాలు వారివి. అవసరం ఉన్నోడు అదే పనిగా అడుగుతుంటాడు. అవసరం లేనోళ్లు కడుపు నిండిన మారాజులా కూర్చుంటాడు. అవసరం ఉన్నోడిని అస్సలు పట్టించుకోరు. అయితే.. ఇప్పుడు చెప్పిందంతా వ్యక్తిగత స్థాయి. వ్యక్తిగతంగానే ఇన్ని లెక్కలు ఉంటే.. సౌత్ లో పాగా వేయాలి.. అందునా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాలకు తామే ప్రత్యామ్నంగా మారాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయటానికి అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు కమలనాథులు.అయితే.. అసలు చిక్కంతా ఏమంటే.. బీజేపీ లార్గెట్ చేసిన ఏపీలో బలమైన.. ప్రజాకర్షణ కలిగిన నాయకుడితో పాటు.. క్రౌడ్ పుల్లింగ్ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఏపీ బీజేపీకి లేరు. ఇలాంటివేళ.. పార్టీని పటిష్టం చేసుకోవటానికి.. ప్రజాకర్షణ కలిగిన నాయకుల అవసరం కమలనాథులకు ఎక్కువగా ఉంది. అందుకే బలమైన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ మీద బీజేపీ గురి పెట్టింది.

రెండు రోజుల క్రితమే మాట్లాడిన జనసేనాధిపతి.. పార్టీని విలీనం చేయాలని విపరీతమైన ఒత్తిడి వస్తుందని.. కానీ తాను మాత్రం పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టిన ఆయన.. తన పక్కన ఒక్కరు ఉన్నా తన తుదిశ్వాస విడిచిపెట్టే వరకూ జనసేనను నడిపిస్తానన్నారు. తనను విపరీతంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని.. అయినప్పటికీ తాను వారి బాటలో నడవనని స్పష్టం చేశారు. తనను అదే పనిగా అడుగుతూ.. పార్టీని విలీనం చేయాలన్న మాట చెబుతున్నారని.. అదే రీతిలో పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు.

ఓపక్క పవన్ కోసం ప్రయత్నం చేస్తున్న బీజేపీ.. తాజాగా మెగాస్టార్ చిరు మీద కూడా గురి పెట్టిందా? అన్న అనుమానాన్ని నిజం చేసేలా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన మెగాస్టార్.. ఒక ప్రముఖ పార్టీ తననురావాలని కోరినట్లు చెప్పారు. తనను వాళ్ల పార్టీలో చేర్చాలనుకుంటున్నట్లు చెప్పారు.

అయితే.. తానా విషయంపై ఇప్పుడెలా స్పందిస్తానని చెప్పారు. వాళ్ల పూర్తి ఆలోచన.. ఆశ.. దానిపై తాను స్పందించలేనని చెప్పిన చిరు.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీదనేనని చెప్పారు. మొత్తానికి మెగా బ్రదర్స్ కోసం కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు అదే పనిగా ఫెయిల్ అవుతున్నారు. టార్గెట్ చేస్తే సొంతం కావాలనుకునే కమలనాథులు.. ఎంతకూ కొరుకుడుపడని రీతిలో వ్యవహరిస్తున్నమెగా బ్రదర్స్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.