Begin typing your search above and press return to search.

చూపుడు వేలు.. చిరు..బాలయ్యల మీదకు..

By:  Tupaki Desk   |   22 Jan 2017 3:46 PM GMT
చూపుడు వేలు.. చిరు..బాలయ్యల మీదకు..
X
కాలం చిత్రమైంది. ఎప్పుడేం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఎప్పుడూ లేనిది తెలుగోళ్లు తొలిసారి టాలీవుడ్ ప్రముఖులపై కోపంగా ఉన్నారు. తమ సమస్యలపై రీల్ హీరోలు రియల్ గా ఎందుకు రియాక్ట్ కారన్నది ఇప్పుడు చాలామంది నోటి నుంచి కొత్త ప్రశ్న వస్తోంది. తమిళనాడులో జల్లికట్టుపై అక్కడి సినీ ప్రముఖులు స్పందించిన తీరుతో.. ఆంధ్రాలో సరికొత్త వాదన ఒక ప్రాణం పోసుకుంది.

విభజన సందర్భంగా ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదాను ఇవ్వకపోవటంపై ఇప్పటికే పలువురు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీతో సమస్యకు సొల్యూషన్ ను వెతికేసింది మోడీ సర్కారు. పనిలో పనిగా తాముచేసిన పనికి సన్మానాలు చేయటం ద్వారా ఆ అంశాన్నివెనక్కి వెళ్లేలా చేశారు.

తాజాగా జల్లికట్టును నిషేదిస్తూ సుప్రీం ఆదేశాలు ఇవ్వటం.. దీనిపై తమిళులు కట్టలు తెగిన ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని ప్రదర్శించటం.. యావత్ తమిళనాడు నిరసనలతో స్తంభించిపోవటం ఒక ఎత్తు అయితే.. అందులో తమిళ హీరోలు.. చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా అంతా రోడ్ల మీదకు రావటం ఉద్యమానికి మరింత స్ఫూర్తిగా మారింది. ఇప్పుడా ఉదాహరణను చూపిస్తూ.. ఏపీ ప్రత్యేక హోదా..విభజన హామీల సమితి నేతలు సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

తమిళనాడు స్ఫూర్తిగా ప్రత్యేక హోదా కోసం తెలుగు సినీ పరిశ్రమ మద్దతు తెలపాలని కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో అందరూ పాల్గొనాలని చెప్పటమే కాదు.. ప్రజాప్రతినిధులుగా ఉన్న చిరంజీవి.. బాలకృష్ణ లు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరితో మొదలైన ఈ వాదన కానీ బలంగా మారితే.. అగ్రతారలకు ఇబ్బందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/