చిరు మాటను బట్టి కేసీఆర్ కే సపోర్టా?

Thu Nov 08 2018 16:00:08 GMT+0530 (IST)

తెలంగాణ ఎన్నికల వేళయ్యింది.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు బయటపడడం లేదు.  మూల స్తంభాలుగా నిలబడ్డ ఫ్యామిలీలో ఒకటి ఎలాగూ టీడీపీకే సపోర్టుగా నిలుస్తోంది. ఇక మిగతా ఫ్యామిలీలు ఎందుకొచ్చిన తంటా అని సైలెంట్ గా ఉంటున్నాయి.  సినిమా ఇండస్ట్రీకే పెద్ద దిక్కు అయిన మెగాఫ్యామిలీ.. తాజాగా కేసీఆర్ వెంట నడుస్తోందని ప్రచారం జోరందుకుంది. హైదరాబాద్ లో  కొద్దిరోజుల కింద  జరిగిన ఓ సినిమా వేడుకలో పాల్గొన్న మెగా స్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ గా మారాయి.  కేసీఆర్ పాలన తీరును - దేశంలోనే ఆయనే బెస్ట్ సీఎం అని చిరంజీవి కొనియాడారు.  కేసీఆర్ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. కేసీఆర్ తనను కలిసిన ప్రతీసారి సినీ పరిశ్రమ గురించి ఏదో చేయాలని తపన పడేవాడని వివరించాడు. ఇంతకన్నా మంచి  సీఎం ఉంటాడా అని కొనియాడారు. ఇలా తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి సపోర్ట్ కేసీఆర్ కే ఉందని తెలియజేసేలా ఈ వీడియో ప్రచారంలోకి రావడం విశేషం.

ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టడం లేదు. అప్పట్లో కేసీఆర్ - కేటీఆర్ ను కలిసి టీఆర్ ఎస్ పథకాలు అద్భుతమని కొనియాడారు.  రైతులకు 24 గంటల కరెంట్ - రైతుబంధు - రైతుబీమా తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. కేటీఆర్ తో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే పవన్  తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు గులాబీ పార్టీకేనని జనసేన తెలంగాణ నాయకులకు చెప్పాడనే ప్రచారం జరుగుతోంది.. ఇలా తెరవెనుక టీఆర్ ఎస్ కు జనసేన కార్యకర్తలు - నాయకుల మద్దతు ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఇది బయటపడడం లేదు.

ఇక మెగా హీరోలు రాంచరణ్ - బన్నీ కూడా తండ్రి బాబాయి బాటలోనే గులాబీకి మద్దతుగా నిలుస్తున్నారనే వార్తలొస్తున్నాయి. రాంచరణ్ భార్య ఉపాసన ఎంపీ కవితతో కలిసి హరితహారం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొని టీఆర్ ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. అల్లు అర్జున్ అయితే హరితహారంలో మొక్కలు నాటారు కూడా.. రాంచరణ్ కూడా మంత్రి తలసాని సహా పలువురు టీఆర్ ఎస్ మంత్రులతో అప్పుడప్పుడు పలు సభలు - సమావేశాల్లో పాల్గొన్నారు.

ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతానికైతే కారుకే జై కొట్టారని తెలుస్తోంది. చిరంజీవి - పవన్ - చరణ్ - బన్నీ సహా పలువురు హీరోల ఓటు తెలంగాణ రాష్ట్రసమితికేనని తెలుస్తోంది.  ఈ విషయంలో చిరు - పవన్ బయటపడినా..  వారి వారసుల హీరోలు మాత్రం ఇంకా నోరువిప్పడం లేదు..