Begin typing your search above and press return to search.

చిరూ... నీరో చ‌క్ర‌వ‌ర్తిని మించిపోయారే!

By:  Tupaki Desk   |   18 March 2018 7:05 AM GMT
చిరూ... నీరో చ‌క్ర‌వ‌ర్తిని మించిపోయారే!
X
ఏపీలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తుందా? రాదా? అన్న విష‌యంపైనే చర్చ జ‌రుగుతోంది. అటు హోదా కోసం ఆది నుంచి పోరాటం సాగిస్తున్న విప‌క్ష వైసీపీతో పాటుగా హోదా అవ‌స‌రం లేదంటూ మొన్న‌టిదాకా స‌న్నాయి నొక్కులు నొక్కి... ఇప్పుడు హోదా కావాల్సిందేన‌ని మాట మార్చేసిన అధికార టీడీపీతో పాటుగా దాదాపుగా అన్ని రాజ‌కీయ ప‌క్షాలు కూడా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని నిన‌దిస్తున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని ఒకే ఒక్క అంశ‌మే న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై ఏకంగా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేదాకా ప‌రిస్థితి వెళ్లిందని చెప్పాలి. అంతేకాకుండా ప్ర‌త్యేక హోదాపై మాట మార్చేస్తూ త‌న‌దైన క‌ప్ప‌దాటు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న టీడీపీ వైఖ‌రిని క‌డిగిపారేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఆ పార్టీతో పొత్తును క‌త్తిరించేసుకున్నారు. అంతేనా చంద్ర‌బాబు అక్ర‌మ పాల‌న‌, లోకేశ్ అవినీతిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు. ప‌వ‌న్ మీటింగ్ తోనే ఏపీలో రాజ‌కీయ వేడి ప‌తాక స్థాయికి వెళ్లింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉన్న ఏపీకి చెందిన ప్ర‌తి ప్ర‌తి ప్ర‌జా ప్ర‌తినిధి కూడా ఏపీకి జ‌రిగిన అన్యాయంపై మాట్లాడ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. చ‌ట్ట‌స‌భల్లో లేని నేత‌లు కూడా మాట పెగ‌ల్చ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి. మొత్తంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌యంపై మాట పెగ‌ల్చ‌క‌పోతే... ఎక్క‌డ రాజ‌కీయాల నుంచి క‌నుమ‌రుగు అయిపోతామోన‌న్న భ‌యం రాజ‌కీయ నేత‌ల‌ను వెంటాడుతోంద‌నే చెప్పాలి.

ఇలాంటి కీల‌క త‌రుణంలో మెగాస్టార్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించి, ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఘోరంగా విఫ‌ల‌మైపోయి, తిరిగి సినిమాల్లోకే వెళ్లిపోయిన చిరంజీవి మాత్రం ప్ర‌త్యేక హోదాపై ఇప్ప‌టిదాకా మాట మాత్రంగా కూడా ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అంతేకాదండోయ్‌... ఏపీ కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికై, యూపీఏ స‌ర్కారులో కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన చిరు... అస‌లు ప్ర‌త్యేక హోదాపై ఇప్ప‌టిదాకా సింగిల్ మాట కూడా మాట్లాడ‌లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇటు రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో పాటు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళ‌మెత్తుతున్న విష‌యం తెలిసిందే. అలాంటిది టాలీవుడ్‌లో అగ్ర క‌థ‌నాయ‌కుడిగానే కాకుండా... ఏపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌లో స‌భ్యుడిగా ఉండి కూడా చిరు నోట ఒక్క మాట కూడా రాక‌పోవ‌డం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించే విషయ‌మే. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం పార్టీ పేరిట జ‌నాల్లోకి వ‌చ్చిన చిరు... సినిమాల్లో మాదిరిగా హిట్ కొట్ట‌లేక‌పోయారు. త‌న సొంత జిల్లా సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మ‌హిళా నేత చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చిరు... చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా తిరుప‌తిలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే తాను క‌న్న సీఎం క‌ల‌లు క‌ల్ల‌లుగానే మిగిలిపోవ‌డంతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసిన చిరు... ఏకంగా రాజ్య‌స‌భ‌కు నామినేట్ అవ‌డ‌మే కాకుండా కేంద్ర మంత్రిగానూ త‌న ముచ్చ‌ట‌ను తీర్చుకున్నారు.

కేంద్ర మంత్రి ప‌ద‌వి ఊడ‌గానే... రాజకీయాల‌పై ఆస‌క్తి త‌గ్గించేసిన చిరు చాలా స్త‌బ్దుగా ఉండిపోయారు. అంతేకాకుండా రాజ‌కీయాలు త‌న‌కు ప‌డ‌వ‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన చిరు... ఖైదీ నెంబ‌ర్ 150 ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల పేరు చెప్పి పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రుకాలేన‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు లేఖ రాసి మ‌రీ పార్లమెంటు గేటు కూడా ఎక్క‌కుండా త‌ప్పించేసుకున్నారు. వ‌చ్చే నెల‌లో రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం కూడా ముగియ‌నున్న నేప‌థ్యంలో ఇక‌పై పూర్తి స్థాయిలో సినిమాల‌కే ప‌రిమితం కావాల‌ని చిరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంత రాజ‌కీయాల‌ను వ‌దిలేసినా, సినిమాలకే ప‌రిమిత‌మైనా... ఓ కేంద్ర మాజీ మంత్రిగా, ఏపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ఎంపీగా క‌నీసం రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాపై ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా ఎలా ఉండ‌గ‌లుగుతున్నారో చిరుకే తెలియాలి అన్న వాద‌న వినిపిస్తోంది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీరును రోమ్ చ‌క్ర‌వ‌ర్తి నీరోను ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు. రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌బ‌డిపోతూ ఉంటే... నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నార‌ట‌. అదే త‌ర‌హాలో మొత్తం ఏపీ అంతా ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతుంటే... చిరు మాత్రం నీరో మాదిరిగా త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అయినా నీరో, చిరుకు తేడా ఏమిట‌న్న విష‌యాన్ని కూడా ప్ర‌స్తావిస్తున్న జ‌నం... నీరో చేతిలో ఫిడేల్ ఉంటే, చిరు చేతిలో ఫిడేల్ మాత్ర‌మే లేద‌ని కూడా చెప్పుకుంటున్నారు. అయినా ప్ర‌త్యేక హోదాపై అంద‌రినీ క‌డిగి పారేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న సోద‌రుడు చిరును మాత్రం ప్ర‌శ్నించ‌కుండానే ముందుకు సాగుతుండ‌టం నిజంగానే ఆశ్చ‌ర్య‌మ‌నిపించ‌క మాన‌దు. మొత్తంగా మెగాస్టార్ ఫ్యామిలీ వైఖ‌రే ఇంతేలే అన్న కోణంలో విశ్లేష‌ణ‌లు కూడా సాగుతున్నాయి.