Begin typing your search above and press return to search.

బాబుకు బిగ్ బ్లో!..జ‌గ‌న్‌ తో ఆమంచి భేటీ!

By:  Tupaki Desk   |   13 Feb 2019 7:10 AM GMT
బాబుకు బిగ్ బ్లో!..జ‌గ‌న్‌ తో ఆమంచి భేటీ!
X
ఎన్నిక‌ల‌కు ముందు అధికార టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. టీడీపీకే కాకుండా ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు ఈ ప‌రిణామం మ‌రింత‌గా ఇబ్బంది పెట్ట‌నుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపుగా ప‌రిగ‌ణిస్తున్న ఈ ప‌రిణామం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ప్ర‌కాశం జిల్లాలోని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీకి రాజీనామా చేసి పారేశారు. అంతేకాకుండా కాసేప‌టి క్రితం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్ లో ప్ర‌త్య‌క్ష‌మైన ఆమంచి లోట‌స్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. వైసీపీలోకి చేరాల‌ని గ‌ట్టి నిర్ణ‌య‌మే తీసుకున్న ఆమంచి... అందులోనే జ‌గ‌న్‌ తో భేటీ అయ్యార‌ని విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఆమంచి పార్టీని వీడితే క‌ష్ట‌మేన‌ని, ఎన్నిక‌ల ముందు ఈ ప‌రిణామం త‌మ‌కు పెద్ద దెబ్బ కొట్ట‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న‌తో ఆమంచిని నిలువ‌రించేందుకు చంద్ర‌బాబు అందుబాటులో అన్ని వ్యూహాల‌ను అమ‌లు చేశారు.

మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావుతో పాటు త‌న కుమారుడు నారా లోకేశ్ ఫోన్ చేసినా దారికి రాని ఆమంచిని బుజ్జ‌గించేందుకు ఏకంగా తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులును కూడా చంద్ర‌బాబు రంగంలోకి దింపారు. ఈ క్ర‌మంలో తోట‌తో ఉన్న అనుబంధం మేర‌కు ఆయ‌న‌తో భేటీ అయిన ఆమంచి... చంద్ర‌బాబును క‌లిసేందుకు ఒప్పుకున్నారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబును క‌లిసిన ఆమంచి.. పార్టీలో త‌న‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను - పార్టీలోనే త‌న‌కు యాంటీగా మారిన ప‌రిస్థితుల‌ను ఏక‌రువు పెట్టారు. ఆమంచి చెప్పిన వివ‌రాల‌ను విన్న చంద్ర‌బాబు.. వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేక‌పోయిన‌ట్లుగా స‌మాచారం. దీంతో చంద్రబాబుతో భేటీ త‌ర్వాత పార్టీ మారే విష‌యంలో తాను ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ని - అయితే టీడీపీలోనే కొన‌సాగుతాన‌ని కూడా చెప్ప‌లేన‌ని ఆమంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ క్ర‌మంలో మ‌రోమారు చంద్ర‌బాబుతో ఆమంచి భేటీ అవుతార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. అయితే ఈ భేటీ జ‌ర‌గ‌లేదు గానీ... ఆమంచి నేరుగా జ‌గ‌న్‌ తో భేటీ అయ్యారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి లోట‌స్ పాండ్‌ కు వెళ్లిన ఆమంచి... తాను టీడీపీకి రాజీనామా చేశాన‌ని ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే వైసీపీలో చేర‌బోతున్న‌ట్లుగా కూడా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే త‌న రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబుకు పంపించాన‌ని కూడా ఆమంచి ప్ర‌క‌టించారు. టీడీపీకి ఎందుకు రాజీనామా చేశాన‌న్న విష‌యాన్ని కూడా కుండబ‌ద్ద‌లు కొట్టిన ఆమంచి... చీరాల‌లో ప్ర‌భుత్వం పార్టీకి సంబంధం లేని శ‌క్తులు ఎంట్రీ ఇచ్చాయ‌ని, వాటిపై ఫిర్యాదు చేస్తే అధిష్ఠానం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌భుత్వాన్ని అతీత శ‌క్తులు న‌డిపిస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. స‌మాజంతో సంబంధం లేని వ్య‌క్తులు సీఎంను క‌లుస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు.

ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకుంటున్న ప‌సుపు కుంకుమ కార్య‌క్ర‌మాన్ని అభాసుపాల్జేస్తున్నార‌ని కూడా ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ప‌విత్ర‌మైన పేర్లు పెట్టి డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. అయినా ఇప్పుడు టీడీపీ ప్ర‌జ‌ల‌కు న‌చ్చే విధంగా లేద‌ని కూడా ఆమంచి సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. త్వ‌ర‌లోనే ఓ మంచి రోజు చూసుకుని వైసీపీలో చేర‌తాన‌ని ఆయ‌న చెప్పారు. మాట త‌ప్ప‌ని నేత‌గా జ‌గ‌న్ అంటే న‌మ్మ‌క‌ముంద‌ని, అయినా ఇప్పుడు జ‌గ‌న్ త‌ప్ప రాష్ట్రానికి మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని కూడా ఆమంచి చెప్పారు. వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి కుమారుడిగా జ‌గ‌న్ కూడా నీతివంత‌మైన పాల‌న‌ను అందిస్తార‌న్న న‌మ్మకం త‌న‌కుంద‌ని, ఈ క్ర‌మంలోనై వైసీపీలో చేరుతున్నాన‌ని ఆమంచి ప్ర‌క‌టించారు.