Begin typing your search above and press return to search.

చింతమనేనికి చుక్కలు కనిపించాయా?..1

By:  Tupaki Desk   |   2 Dec 2015 4:36 AM GMT
చింతమనేనికి చుక్కలు కనిపించాయా?..1
X
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. పశ్చిమగోదావరి జిల్లాలో తిరుగులేని నాయకుడిగా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా అయిన చింతమనేని ప్రభాకర్ సుపరిచితులు. మీసం మెలేయటం.. పబ్లిక్ గా తొడ కొట్టటం.. దురుసు ప్రవర్తనతో చేయి చేసుకోవటం లాంటి వ్యవహారాలతో ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఎక్కువే. వివిధ పోలీస్ స్టేషన్లో 37 కేసులు ఆయనపై నమోదై.. కోర్టు విచారణల్లో ఉన్నాయి. మంత్రి మొదలు పోలీసు అధికారులపైనా చేయి చేసుకున్న ఘన చరిత్ర చింతమనేని సొంతమంటారు. ఇసుక వ్యవహారంలో ఎమ్మార్వో వనజాక్షి విషయంలో ఏపీ సర్కారుకు లేనిపోని తలనొప్పులు తెచ్చిన చింతమనేని.. ఆ సందర్భంగా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగింది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనతో తాజాగా ఓ ఛానల్ తో ముఖాముఖి కార్యక్రమాన్ని చేసింది. హాట్.. హాట్ గా సాగిన ఈ ఇంటర్వ్యూ విశేషాలు చూస్తే..

ప్రశ్న; దూరంగా చూస్తే.. దుర్మార్గుడు.. రౌడీగా కనిపిస్తాడు. దగ్గర నుంచి చూస్తే తనను నమ్మకున్న వారి కోసం ఎంతకైనా సిద్ధపడే నాయకుడిగా కనిపిస్తారు. ఎందుకీ భిన్నత్వం..?.. ఇంటర్వ్యూ అంటే చుట్టూ పరిసరాలు అందంగా.. ఆహ్లాదకరంగా ఉండేలా చూస్తారు. కానీ.. గొర్రెల మధ్య ఇంటర్వ్యూ ఎందుకు?

చింతమనేని; గ్రామీణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేను. పొద్దున లేచిన దగ్గర నుంచి గొర్రె.. కుక్క ఇలా అన్నింటితో మమేకమవుతూ ఉండేవాడిని.

ప్రశ్న; సన్నిహితులు టైగర్ అంటే.. ప్రత్యర్థులు రౌడీ.. గూండా అంటారు?

చింతమనేని; ఒకరికి స్వీట్ ఇష్టం. కొందరికి హాట్ ఇష్టం. ఇంకొందరికి వగరు అంటే ఇష్టం. టైగర్ అన్నా.. గుండా అన్నా పట్టించుకోను.

ప్రశ్న; ఇప్పటివరకూ ఎంతమందిని హత్య చేశారు? ఎంతమందిపై దాడులు చేశారు? ఎంతమందిని హతమార్చే ప్రయత్నం చేశారు?

చింతమనేని; నాకు అర్థం కావటం లేదు.. మీరు జోక్ చేస్తున్నారా అని. ఇప్పటివరకూ వ్యక్తిగతంగా ఒక్కరిని కూడా హర్ట్ చేయలేదు. నా చర్య వల్ల ఒక్కరి మనసు కూడా గాయపడలేదు.

ప్రశ్న; అంటే.. మీ చేతికి రక్తం అంటలేదని చెబుతున్నారా?

చింతమనేని; రక్తం అంట లేదు కాదు.. అంటబోదని కూడా చెబుతున్నా.

ప్రశ్న; మీ మీద వివిధ పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసుల మాటేమిటి?

చింతమనేని; నేనేమీ ఆ కేసులు లేవని చెప్పటం లేదు కదా. అదేమీ కోర్టు చెప్పింది కాదు కదా. మీరు రిపోర్ట్ ఇస్తే కేసులు కడతారు. మీరు నా మీద కేసులు ఉన్నాయి.. కేసులు ఉన్నాయని పదే పదే చెబుతున్నారు. మీరు ఎవరైనా.. నా మీద ఉన్న ఆరోపణల్ని నిరూపిస్తారా? మీకు ఆ ఖలేజా ఉందా? న్యాయస్థానాల్లో నా మీద ఉన్న ఆరోపణలకు శిక్షలు వేయిస్తారా?

ప్రశ్న; మీ తీరుతో మీ రాజకీయ ప్రత్యర్థులు భయపడిపోతున్నారు?

చింతమనేని; నా రాజకీయ ప్రత్యర్థులని చెబుతున్నారు.. ఒక్కరి పేరు చెప్పండి? నా రాజకీయ ప్రత్యర్థి ఇతగాడు? ఇతన్ని హతమార్చే ప్రయత్నం చేశావు? వ్యక్తిగతంగా నీకు పుట్టిన కాడి నుంచి వీడు నీ ప్రత్యర్థి అని చూపించండి? (మధ్యలో కల్పించుకోబోతుంటే..) ముఖాముఖి కార్యక్రమం అని చెప్పినప్పుడు మీరు ఎంత మాట్లాడతారో.. నాకు అంతే మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మీరు అవినీతి పుత్రిక సాక్షి ప్రతినిధిలా మాట్లాడకూడదు. నేను ఎవరి మీదనైనా హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు కానీ.. ఆస్తుల్ని కబ్జా చేసినట్లు కానీ ఆధారాలు ఉన్నాయా? మీకు ఆ ఖలేజా ఉందా?

ప్రశ్న; నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి.

చింతమనేని; అయితే.. అవేంటో చెప్పండి. ఆ ఆధారాలేంటో చూపించండి. దానికి నేను సమాధానం చెబుతాను.

ప్రశ్న; ముందు.. మీరు ప్రశాంతంగా ఉండండి.

చింతమనేని; నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. కానీ.. మీరు బ్లడ్ బర్న్ అయ్యేలా మాట్లాడుతున్నారు.

ప్రశ్న; రాజ్యాంగ బద్ధుడినై ఉంటానని ప్రమాణం చేసిన మీరు.. పశ్చిమగోదావరి జిల్లాలో రాజ్యాంగేతర శక్తిగా మారారని మీ మీదున్న కేసులు చెబుతున్నాయి. కాదంటారా?

చింతమనేని; పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు లక్షణ రేఖ కాదు. అదేం భగవద్గీత కాదు. పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటే.. న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొంటే అదేం తప్పు కాదు. అయినా.. నా మీద కేసులేంటి? రాస్తారోకో చేశానని? ధర్నా చేశారనేగా.

ప్రశ్న; చట్టాల్ని కాపాడటం తర్వాత చట్టాల్ని చేతుల్లోకి తీసుకుంటారు. మీకు దౌర్జన్యం చేసే హక్కు ఎవరిచ్చారు?

చింతమనేని; ఎవరి చేశారండి? నా హక్కుల కోసం ప్రయత్నం చేస్తే మీరు నేను దౌర్జన్యం చేసినట్లుగా అంటున్నారు. నేను దౌర్జన్యం చేశారని ఎలా ప్రూవ్ చేయగలుగుతారు..?

ప్రశ్న; మంత్రి హోదాలో వట్టి వసంతకుమార్ రచ్చబండ కార్యక్రమం పెడితే.. ఎమ్మెల్యేగా మీరు వెళ్లి చేయి చేసుకోవటం? నెట్టటం.. కొట్టటం రాష్ట్ర ప్రజలంతా చూశారు. నేను కొత్తగా చెప్పటం కాదు. వేదిక మీదకు వెళ్లి.. వట్టి వసంతకుమార్ చొక్కా పట్టుకోవటం హుందాతనం అంటారా?

చింతమనేని; మీరు.. ఒక విషయాన్ని ఆలోచించాలి. అది దెందులూరు నియోజకవర్గం. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ . నా నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం పెడితే.. ప్రధానమంత్రి మొదలు ఎవరు వచ్చినా.. అక్కడి స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహిస్తారు. ఎవరైతే నా మీద ఓటమి పాలయ్యారో వాళ్లను తీసుకొచ్చి కూర్చోబెడితే ఏం చేయాలి

ప్రశ్న; కొట్టేస్తారా? కొట్టేస్తారా? మంత్రిని కొట్టేస్తారా?

చింతమనేని; వినండి. నేను మాట్లాడేటప్పుడు అడ్డుపడనన్నారు. (సరే.. మాట్లాడండి అని మీడియా ప్రతినిధి అని కామ్ అయ్యారు) ఆ రోజు జరిగిన విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. చూడండి. అందులో ఎవరు ముందు చేయి చేసుకున్నారో. నా వీధికి వచ్చి.. నా ఇంటికి వచ్చి నా మీద చేయి చేసుకుంటే.. ఊరుకోవటానికి మేం ఏమైనా గాజులు వేసుకొని ఉన్నామా? ప్రమాణం చేశానని చెబుతున్నారు. మిమ్మల్ని ఈ చెంప మీద కొడితే ఆ చెంప ఇస్తారా?

ప్రశ్న; ఇసుక వ్యాపారంలో మీరు ఎన్ని కోట్లు సంపాదించారు?

చింతమనేని; ఒక్క రూపాయి బిళ్ల కూడా సంపాదించల.

ప్రశ్న; అంటే..?

చింతమనేని; ఒక్క రూపాయి బిళ్ల కూడా సంపాదించల.

ప్రశ్న; అంటే.. వ్యాపారం చేయలేదంటారా?

చింతమనేని; చేశా. కానీ.. ఎప్పుడు..?ఎప్పుడైతే నేదురమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ ఎంప్లాయిమెంట్ స్కీం కింద శాండ్ ఇచ్చారో.. అప్పుడు నేను శాండ్ కాంట్రాక్టర్ గా ఉన్నాను. అప్పుడు డబ్బులు సంపాదించాను. జనాలకు ఖర్చు పెట్టాను. అది రాజకీయ పరపతికి ఉపయోగపడింది. అంతే తప్ప.. నేను సంపాదించింది లేదు.. దాచుకున్నది లేదు.