కిందామీదా పడ్డాకే మిత్రుల మధ్య పొత్తు పక్కా!

Sat Aug 12 2017 12:31:51 GMT+0530 (IST)

అదేం చిత్రమో కానీ పేరుకు మిత్రులే కానీ.. సీట్ల లెక్క దగ్గరకు వచ్చేసరికి ప్రతిసారీ పేచీనే. సార్వత్రిక ఎన్నికల వేళకు కొన్ని నెలల ముందే టీడీపీ.. బీజేపీ మధ్యన పొత్తు ఉంటుందన్న విషయం తెలిసిందే. చివరి క్షణం వరకూ సీట్ల సర్దుబాటు విషయంలో చర్చల మీద చర్చలు జరుగుతూనే ఉన్న విషయం చూసిందే. మొన్నామధ్యన జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళలోనూ  రెండు పార్టీల మధ్యన పొత్తు ఉంటుందా?  లేదా? అన్న విషయం మీద కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే.. చివరకు ఎవరికి వారుగా పోటీ చేశారు.

మిత్రపక్షమైనా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాలుగా వ్యవహరించటం ఈ రెండు పార్టీల్లో కనిపిస్తోంది. తాజాగా కాకినాడ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా?  అన్నది ప్రశ్నగా మారింది. కలిసే పోటీ చేస్తాయన్న నమ్మకం ఉన్నప్పటికీ.. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో జరిగిన డ్రామా అంతా ఇంతా కాదు. ఎప్పటి మాదిరే చివరి నిమిషం వరకూ సీట్ల సర్దుబాటుకు సంబంధించి మహా ఉత్కంట నెలకొంది.

కాకినాడ కార్పొరేషన్లో మొత్తం 48 సీట్లు ఉండగా.. బీజేపీ తమకు 15 సీట్లు కావాలని కోరింది. ఇందుకు.. ఏపీ అధికారపక్షమైన టీడీపీ ససేమిరా అన్నది. చివరకు.. పలు చర్చల అనంతరం బీజేపీకి తొమ్మిది సీట్లను కేటాయించేందుకు ఓకే చెప్పాలి. దీనిపై కమలనాథులు చిన్నబుచ్చుకున్న పరిస్థితి. సీట్ల సర్దుబాటు విషయంలో నెలకొన్ని ఉత్కంట నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. చివరకు రెండు పార్టీల మధ్య పొత్తు ఫైనల్ అయ్యింది.

ఈ ఎపిసోడ్ లో బీజేపీ తన డిమాండ్ నుంచి కాస్త తగ్గాల్సి వచ్చింది. చివరకు కుదిరిన ఒప్పందం ప్రకారం.. టీడీపీ 39 వార్డుల్లో.. బీజేపీ తొమ్మిది వార్డుల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. రెండు పార్టీల మధ్య పొత్తు నెలకొన్నప్పటికీ.. రెబెల్స్ అభ్యర్థులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. పార్టీల మధ్యన కుదిరిన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవటానికి ససేమిరా అంటున్నారు. ఇదిలా ఉంటే.. పార్టీలు నిర్ణయించిన వారికి మాత్రమే బీఫారం ఇస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. అధికారపక్షానికి మిత్రపక్షంతో ఉన్న చేసుకున్న సీట్ల సర్దుబాటుపై బీజేపీ పూర్తిస్థాయిలో సంతృప్తి లేకపోవటంతో పాటు.. రెబెల్స్ పుణ్యామా అని  తుదిఫలితంపై ప్రభావం పడితే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.