Begin typing your search above and press return to search.

`ఉద్ధానం`పై ప‌వ‌న్ కు చిన‌రాజ‌ప్ప కౌంట‌ర్!

By:  Tupaki Desk   |   24 May 2018 11:13 AM GMT
`ఉద్ధానం`పై ప‌వ‌న్ కు చిన‌రాజ‌ప్ప కౌంట‌ర్!
X
జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీ‌కాకుళం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఉద్ధానం కిడ్నీ బాధిత‌లు స‌మ‌స్య‌ల‌పై స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఉద్ధానం కిడ్నీ బాధితుల స‌మ‌స్యలు ప‌రిష్క‌రించ‌డం కోసం ఒక ప్ర‌త్యేకమైన‌ మానిట‌రింగ్ టీం ను 48 గంటల్లో ఏర్పాటు చేయాల‌ని చంద్ర‌బాబుకు ప‌వ‌న్ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. చంద్ర‌బాబు అలా చేయ‌ని ప‌క్షంలో త‌న పోరాట యాత్ర‌ను ఒక‌రోజు వాయిదా వేసి 24 గంట‌ల‌పాటు నిరాహార దీక్ష చేస్తాన‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప స్పందించారు. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లకు ఆయ‌న దీటుగా బ‌దులిచ్చారు. బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు ప్ర‌భుత్వం అన్నిర‌కాల ఏర్పాట్లు - చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని అన్నారు. ఇన్నాళ్లూ ఉద్ధానం స‌మ‌స్య‌పై స్పందించ‌న ప‌వ‌న్ ...ఈరోజు హ‌డావిడి చేసి నిరాహార దీక్ష చేస్తాన‌న‌డం స‌రికాద‌ని మండిప‌డ్డారు.

ఉద్దానం కిడ్నీ వ్య‌వ‌హారం ప‌వ‌న్ - టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి తెర‌ తీసింది. 48 గంట‌ల్లోపు ఉద్ధానం బాధితుల‌కు సంబంధించి మానిట‌రింగ్ టీంను ఏర్పాటు చేయకుంటే నిరాహార దీక్ష‌కు దిగుతాన‌ని ప‌వ‌న్ అల్టిమేటం జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. 48 గంట‌ల్లో చంద్ర‌బాబు స్పందించ‌కుంటే ఆయ‌న‌కు ఉద్ధానం ప్ర‌జ‌ల ప‌ట్ల చిత్త‌శుద్ది లేదని, మ‌నుషులు అధోగ‌తి పాలై న‌లిగిపోతోన్నా......చ‌నిపోతున్నా...ప‌ట్ట‌ద‌ని, ఆయ‌న‌కు మ‌న‌సు లేద‌ని భావిస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు. చంద్ర‌బాబు స్పందించ‌కుంటే త‌న పోరాట యాత్రను ఆపి మ‌రీ ఒక రోజు నిరాహార దీక్ష చేస్తాన‌ని హెచ్చరించారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు చిన‌రాజ‌ప్ప కౌంట‌ర్ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌ చాలా రోజుల నుంచి ఉంద‌ని - దానిని ప‌రిష్క‌రించేందుకు చంద్ర‌బాబు చ‌ర్య‌లు చేప‌ట్టారని అన్నారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత మంచినీటి సౌక‌ర్యం క‌ల్పించార‌ని, బాధితుల‌కు ప‌రీక్షించేందుకు టెస్ట్ సెంట‌ర్ ఏర్పాటు చేశార‌ని చెప్పారు. బాధితులంద‌రికీ నెల‌కు 2500 చొప్పున అంద‌జేస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను చూడ‌కుండా....ఈరోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చి నిరాహార దీక్ష చేస్తాన‌న‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే ప్ర‌శ్నించాల‌ని, కానీ....ఈ వ్య‌వ‌హారంపై ప‌వ‌న్ రాజ‌కీయం చేయ‌కూడ‌ద‌ని అన్నారు.