Begin typing your search above and press return to search.

ఇండోచైనా యుద్ధ‌మే అమెరికాకు కావాల్సింది!

By:  Tupaki Desk   |   26 July 2017 10:36 AM GMT
ఇండోచైనా యుద్ధ‌మే అమెరికాకు కావాల్సింది!
X
చైనా దూకుడుకు క‌ళ్లెం వేయాలంటే డోక్‌లామ్ వివాదంలో అమెరికా క‌చ్చితంగా ఇండియాకు మ‌ద్ద‌తివ్వాల‌ని రెండు రోజుల కింద‌ట వాషింగ్ట‌న్ ఎగ్జామిన‌ర్ ప‌త్రిక స్ప‌ష్టంచేసింది. మ‌న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌లో ఇండియాకు అమెరికా మ‌ద్ద‌తివ్వ‌డాన్ని చైనా జీర్ణించుకోలేక‌పోతోంది. దీంతో స‌హ‌జంగానే చైనా ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ నిప్పులు చెరిగే క‌థ‌నం రాసింది. రెండు దేశాల‌ మ‌ధ్య యుద్ధం కోసం అమెరికా చూస్తున్న‌దంటూ ఎప్ప‌టిలాగే అక్కడి అధికార మీడియా లేనిపోని క‌థ‌నాల‌ను రాసింది. ఎక్క‌డ ఏ వివాదం త‌లెత్తినా అమెరికా అక్క‌డ వాలిపోతుంద‌ని, కానీ చాలా అరుదుగా మాత్రం ఆ దేశం నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది.

ఇండియా, అమెరికా సంబంధాల‌ను కీర్తిస్తూ సాగిన ఈ క‌థ‌నం చైనాకు క‌చ్చితంగా ముప్పేన‌ని, అంతేకాదు అమెరికా ప‌క్ష‌పాత వైఖ‌రికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని గ్లోబ‌ల్ టైమ్స్ క‌థ‌నం తెలిపింది. అయితే ఈ ప‌క్ష‌పాత వైఖ‌రి యుద్ధానికి దారి తీస్తుంద‌నీ ఆ ప‌త్రిక హెచ్చ‌రించింది. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఎలా వ్య‌వ‌హ‌రించిందో అమెరికా ఇప్పుడూ అలానే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఆ ప‌త్రిక విమ‌ర్శించింది. ``ఇండియా, చైనా మ‌ధ్య యుద్ధం కోసం పాశ్చాత్య శ‌క్తులు ఎదురుచూస్తున్నాయి. ఈ యుద్ధం ద్వారా త‌మ‌కు కావాల్సిన వ్యూహాత్మ‌క ల‌బ్ధిని పొందాల‌ని చూస్తోంది``` అని గ్లోబ‌ల్ టైమ్స్ ఆరోపించింది. ఓవైపు అమెరికా ఇండియా ప‌క్ష‌పాతిగా ఉంద‌ని ఆరోపిస్తూనే.. మ‌రోవైపు ఇండియా, అమెరికా సంబంధాలపై ట్రంప్ పెద్ద‌గా దృష్టి సారించ‌లేద‌ని చెప్ప‌డం ద్వారా ఆ ప‌త్రిక త‌న నైజాన్ని చాటుకుంది. 1962 ఇండియా, చైనా యుద్ధం వెనుక కూడా అమెరికా, రష్యా ఉన్నాయ‌ని గ్లోబ‌ల్ టైమ్స్‌ ఆరోపించింది. అయితే త‌మ భూభాగాన్ని కాపాడుకోకుండా చైనాను ఎవ‌రూ అడ్డుకోలేర‌ని కూడా ఆ క‌థ‌నం బెదిరింపుతో కూడిన స్ప‌ష్ట‌తను ఇచ్చింది.