Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎంపై సోదరుడే పోటీ చేస్తాడట

By:  Tupaki Desk   |   22 Feb 2019 2:38 PM GMT
డిప్యూటీ సీఎంపై సోదరుడే పోటీ చేస్తాడట
X
రాజకీయాల్లో అన్నదమ్ముల మధ్య పోటీ కొత్తేమీ కాకపోయినా ఇలాంటిది ఎక్కువగా రాయలసీమ రాజకీయాల్లోనే కనిపిస్తుంది. పైగా ఇటీవల కాలంలో అన్నదమ్ములు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి హాయిగా రాజకీయాలు చేసుకుంటున్నారు. ఒకవేళ్ల ఇద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నా రాజకీయ క్షేత్రాలు ఒక్క చోటే ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్పకు మాత్రం ఈసారి సొంత సోదరుడి నుంచే పోటీ ఉంటుందంటున్నారు.అందుకు కారణం ఆయన సోదరుడు లక్మణమూర్తి జనసేన టిక్కెట్ కోసం అప్లయి చేసుకోవడమే.

చినరాజప్ప పెద్దపురం అసెంబ్లీ నియజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మణ మూర్తి కూడా ఆ నియోజకవర్గానికే టికెట్ కోరుతూ జనసేన స్క్రీనింగ్ కమిటీకి అప్లికేషన్ ఇచ్చారు. ఆయన అభ్యర్థిత్వాన్ని జనసేన ఎంతవరకు లెక్కలోకి తీసుకుంటుందో తెలియదు కానీ చినరాజప్పకు మాత్రం ఈ పరిణామాలు చిక్కులే తెస్తున్నాయి.

ఇప్పటికే ముద్రగడ ఉద్యమ సమయంలో కాపులను అటు వెళ్లకుండా ఆపలేకపోయారని.. ఆ తరువాత జనసేన ప్రాభవాన్ని తగ్గించడంలోనూ చినరాజప్ప ఏమీ చేయలేకపోతున్నారని స్వయంగా చంద్రబాబుకే అసంతృప్తి ఉందని చెబుతారు. ఇలాంటి తరుణంలో ఏకంగా ఆయన సోదరుడే జనసేనలో చేరి టిక్కెట్ కోరితే ఇప్పుడు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారట చినరాజప్ప.

మరోవైపు జనసేన టిక్కెట్ల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 220 అప్లికేషన్లు వచ్చాయి. వైద్యుల -, ఇంజినీర్లు - రాజకీయాల్లు ఇప్పటికే ఉన్నవారు, వ్యాపారులు - ఉద్యోగులు - మహిళలు ఇలా.. అన్ని వర్గాల వారు జనసేన టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.