చైనాకు తన బుద్ధి ఏంటో చూపిస్తున్న పాక్

Wed Jan 11 2017 22:18:03 GMT+0530 (IST)

శత్రువు శత్రుడు మత్రువు అనే కోణంలో భారత్ తో కయ్యం పెట్టుకునే పాకిస్తాన్ ను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్న చైనాకు మెల్లమెల్లగా తత్వం బోధపడుతున్నట్లుంది.  పాకిస్థాన్ ఉగ్రవాదుల తయారీ కేంద్రమని తెలిసినా ప్రపంచానికే ముప్పు ఉందని తెలిసినా ఇన్నాళ్లూ వెనకేసుకొచ్చిన చైనా తనదాకా వచ్చేసరికి జాగ్రత్త పడుతోంది. పాక్ బోర్డర్ కు దగ్గరగా ఉన్న జిన్ జియాంగ్ ప్రావిన్స్ ప్రభుత్వం.. భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. పాక్ నుంచి ఉగ్రవాదుల వలసలు తమ ప్రాంతంలోకి ఎక్కువవుతున్నాయని భావించిన అక్కడి ప్రభుత్వం.. అవసరమైతే సరిహద్దును మూసేయాలని నిర్ణయించినట్లు జినువా న్యూస్ వెల్లడించింది.

ఇందుకు కారణం ఏమిటంటే... తమ ప్రాంతంలోకి ఉగ్రవాదుల చొరబాటును పాకిస్తాన్ అడ్డుకోలేకపోతుండటమే. పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థాన్ లలో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు తమ ప్రాంతంలోకి చొరబడి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని జిన్ జియాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు భయపడుతున్నారు. జిన్ జియాంగ్ లోని హోటన్ ప్రాంతంలో ఆదివారం జరిపిన సోదాల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. డిసెంబర్ 28న ఇదే ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు చనిపోవడంతో భద్రతా సిబ్బంది ఈ సోదాలు నిర్వహించి వారిని మట్టుబెట్టారు. బయటి ప్రపంచానికి మాత్రం తాము మిత్రులమేనని పాక్ - చైనా విదేశాంగ మంత్రులు చెబుతున్నా.. జిన్ జియాంగ్ ప్రావిన్స్ నేతలు మాత్రం ఉగ్రదాడులపై ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నారు. పీపుల్స్ రీజినల్ కాంగ్రెస్ లో జిన్ జియాంగ్ చైర్మన్ షోహ్రత్ జకీర్ మాట్లాడుతూ.. అక్రమ వలసలను నిరోధించేందుకు బోర్డర్ లో కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. అధికారులు - కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా పాక్ నుంచి వస్తున్న అక్రమ వలసలపై దృష్టిసారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలానికి పాకిస్తాన్ కు అసలు విషయం తెలిసివచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/