Begin typing your search above and press return to search.

మేం ఇండియాలోకి చొర‌బ‌డితే ర‌చ్చ ర‌చ్చే

By:  Tupaki Desk   |   22 Aug 2017 12:29 PM GMT
మేం ఇండియాలోకి చొర‌బ‌డితే ర‌చ్చ ర‌చ్చే
X
అడ్డ‌గోలు వాద‌న‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన చైనా త‌న బ‌రితెగింపును మ‌రింత‌గా పెంచింది.ఎన్ని దేశాలు త‌మ వాద‌న‌ను అడ్డంగా కొట్టేస్తున్నా.. చైనా మాత్రం డోక్లామ్ త‌మ‌దే అని ఇప్ప‌టికీ వాదిస్తూనే ఉంది. భూటాన్ కూడా ఆ భూభాగం త‌మ‌దే అని ఇప్ప‌టికే స్ప‌ష్టంచేసిన విష‌యం తెలిసిందే. అటు అమెరికా - జ‌పాన్ కూడా ఈ వివాదంలో భార‌త్‌ కే మ‌ద్ద‌తు తెలిపాయి. అయినా చైనా తీరు మాత్రం మార‌డం లేదు. డోక్లామ్ వివాదంపై చైనా ఇవాళ కొత్త బెదిరింపుల‌కు దిగింది. త‌మ భూభాగంలోకి భార‌త బ‌ల‌గాలే అక్ర‌మంగా చొర‌బ‌డ్డాయ‌న్న అర్థం వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేసింది. త‌మ బ‌ల‌గాలు భార‌త భూభాగంలోకి చొర‌బ‌డితే ర‌చ్చ ర‌చ్చ‌వుతుంద‌ని వార్నింగ్ ఇచ్చింది. భార‌త్ వాద‌న పూర్తి హాస్యాస్ప‌దంగా - విష‌పూరితంగా ఉంద‌ని ఆరోపించింది.

`చైనా రోడ్డు నిర్మాణం చేస్తున్న‌ద‌న్న సాకుతో భార‌త బ‌ల‌గాలు హ‌ద్దు దాటాయి. వాళ్లు చెప్పే కార‌ణం హాస్యాస్ప‌దంగా ఉంది. ఇది చూసి ఏ దేశ‌మైనా త‌న ప‌క్క దేశంలో త‌న‌కు ఇష్టం లేని ప‌నులు జ‌రుగుతుంటే చొర‌బ‌డ‌తాయా? ఇండియా కూడా స‌రిహ‌ద్దులో నిర్మాణాలు చేప‌డితే చైనా బ‌ల‌గాలు కూడా చొచ్చుకురావ‌చ్చా? అలా అయితే ఎంత గంద‌ర‌గోళం అవుతుందో తెలుసా?`` అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి హువా చున్యింగ్ అన్నారు. మ‌రోవైపు డోక్లాం ముక్కోణ జంక్షన్‌ లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా ప్రజావిమోచన సైన్యం (పీఎల్‌ ఏ) భారత సరిహద్దుల్లో గతవారం సైనిక విన్యాసాలు జరిపినట్లు చైనా అధికార వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ - టీవీ చానెల్ చైనా సెంట్రల్ వార్తాకథనాలు వెలువరించాయి. డోక్లాం వివాదం గురించి ప్రస్తావించకుండానే మూడు నెలలు సైనికుల శిక్షణ కోసం టిబెట్‌ లో విన్యాసాలు జరిపినట్లు తెలిపాయి.

కాగా, డోక్లాం వివాద పరిష్కారం కోసం చైనా సానుకూలంగా స్పందిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్ ఎల్లవేళలా శాంతియుత సంబంధాలనే కోరుకుంటుందన్నారు. తమ దేశ సార్వభౌమత్వ పరిరక్షణ తమకు తెలుసునని ఆయన ఐటీబీపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో చెప్పారు. అయితే భారత్ ఇంత స‌మ‌న్వ‌య రీతిలో చెప్తుంటే చైనా రెచ్చ‌గొట్టే వ్యాఖ్యాలు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.