Begin typing your search above and press return to search.

ట్రంప్ గిల్లిక‌జ్జాల‌ను స‌హించేది లేదంటున్న చైనా

By:  Tupaki Desk   |   26 May 2017 3:12 PM GMT
ట్రంప్ గిల్లిక‌జ్జాల‌ను స‌హించేది లేదంటున్న చైనా
X
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అమెరికా-చైనా మ‌ధ్య ప్ర‌త్య‌క్ష కార‌ణాల‌తో వివాదం నెల‌కొంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమంగా నిర్మించిన దీవుల్లోకి అమెరికా యుద్ధనౌక చొచ్చుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. దీనిపై చైనా మండిప‌డింది. అమెరికా యుద్ధనౌకలను చైనా జలాల్లో మోహరించడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంద‌ని చైనా అధికార ప్రతినిధి రేన్ గౌంక్యాంగ్ తెలిపారు. అందుకే త‌న యుద్ధ నౌక‌ను అమెరికా వెన‌క్కు పిల‌వాల‌ని హిత‌వు ప‌లికారు. లేనిప‌క్షంలో ఉద్రిక్త‌ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌ని వ్యాఖ్యానించారు.

అమెరికా యుద్ధనౌకలు మోహరించిన ప్రాంతం తమ దేశ అధీనంలో ఉందని తెలిపిన చైనా ప్ర‌తినిధి ఈ విష‌యంలో వివాదం త‌లెత్త‌కుండా అమెరికా జాగ్రత్త ప‌డాల‌ని సూచించారు. స‌ముద్ర జ‌లాల‌ను ఉల్లంఘించి అమెరికా చేసిన చ‌ర్య‌ను తాము గ‌ర్హిస్తున్న‌ప్ప‌టికీ తమ మిలటరీ మాత్రం దాడి చేయకుండా సమయమనం పాటించిందని చైనా ప్ర‌తినిధి వివ‌రించారు. అయితే...భవిష్యత్తులో ఇలాగే సంయమనం పాటిస్తామనే నమ్మకం మాత్రం లేదని, అవసరమైతే ఎలాంటి చర్యకైనా సిద్ధమేన‌ని ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

కాగా, దక్షిణచైనా సమ్రుద జలాలపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చైనా శతవిధాలా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత నౌకాయానం (ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్) ఉండాలని కోరుకుంటున్న అమెరికా తన క్షిపణి విధ్వంసక నౌక యూఎస్‌ ఎస్ డీవేని అక్కడ మోహరించింది. దక్షిణ చైనా కృత్రిమ దీవుల్లో 12 నాటికల్ మైళ్ల దూరం అది ప్రయాణించిందని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిన తర్వాత ఇదే తొలిఘటన. పొరుగున ఉన్న తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం దేశాలు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా దక్షిణ ప్రాంత సముద్ర జలాల్లో చైనా కృత్రిమ దీవులను, ఓడరేవులను నిర్మిస్తూ వస్తున్నది. అందులో ఒకటైన స్ప్రాట్లీ దీవుల్లోని మిస్‌చీఫ్ రీఫ్‌కు అత్యంత సమీపంలోనే యూఎస్‌ఎస్ డీవే సంచరించిందని ఓ అధికారి తెలిపారు. ఇది తమ సార్వభౌమత్వాన్ని, భద్రతావ్యవస్థను సవాల్ చేయడంగానే భావించాల్సి ఉంటుందని చైనా ప్రతినిధి వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/