డ్రాగన్ వ్యూహం పాత చింతకాయ పచ్చడే

Sun Aug 13 2017 13:25:32 GMT+0530 (IST)

తన చుట్టూ ఉన్న ఏ దేశాన్ని విడిచి పెట్టకుండా అందరిపై అధిపత్యాన్ని ప్రదర్శించాలనే దుష్టబుద్ధి డ్రాగన్కు ఎక్కువనే సంగతి ప్రపంచానికి తెలిసిన ముచ్చటే.  తాజాగా డోక్లాం వివాదంలోనూ తన తీరును మరోసారి ప్రదర్శించిన చైనాకు ఊహించని రీతిలో షాకిచ్చింది భారత్. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్.. మనకూ అత్యంత వ్యూహాత్మక ప్రాంతమే. భారత్ మీద అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు వీలుగా డోక్లామ్ సరిహద్దు వద్ద రోడ్డు నిర్మాణాన్ని చేపట్టిన చైనా ఎత్తును గుర్తించిన భారత్.. అక్కడ తన సైనికుల్ని మోహరించింది. బుజ్జి దేశమైన భూటాన్ కు ఉన్న పరిమిత సైనిక వనరుల్ని అసరా చేసుకొని చైనా చెలరేగిపోవాలని భావించింది.ఊహించని రీతిలో సహజ మిత్రుడైన భూటాన్ కు భారత్ కు బాసటగా నిలవటం చైనా ఏమాత్రం సహించలేకపోతోంది. అందుకే మాటల యుద్ధాన్ని మొదలు పెట్టింది. బెదిరింపులకు దిగింది. తన సొంత మీడియాను అసరా చేసుకొని హెచ్చరికల దందాకు దిగింది.

ఒత్తిడికి తలొగ్గి.. డ్రాగన్ తో ఎందుకు పెట్టుకోవటం అన్నట్లుగా మైండ్ గేమ్ షురూ చేసింది. అయితే.. భారత్ పాలకులు మారారని.. గతంలో మాదిరి చైనా పప్పులు భారత్ లో ఉడికే పరిస్థితి లేదన్న విషయాన్ని చైనా అర్థం చేసుకునేసరికి యాభై రోజులు పట్టింది. క్యాలెండర్లో వారాలకు వారాలు గడుస్తున్నా.. తాము ఏ స్థాయిలో బెదిరింపులకు దిగినా.. భారత్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకపోవటం.. తాను మొదట్నించి వినిపించే వాదననే వినిపించటం చైనాకు ఓ పట్టాన మింగుడుపడనివిగా మారాయి.

సైనిక అధికారులతో జరిపిన సమావేశాల్లోనూ చైనా కోరుకున్నట్లుగా భారత్ నాయకత్వం నుంచి పరిష్కార మార్గం రాకపోవటంతో చైనా పాలక వర్గంలోని కీలక నేతలు గొంతు విప్పటం షురూ చేశారు. దీనికి ధీటుగా భారత్ నుంచి కూడా స్పందన రావటం చైనాకు షాకింగ్ వ్యవహారమే.

డోక్లామ్ వ్యవహారంలో చైనా అనుసరిస్తున్న వ్యూహంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.  చైనా వేస్తున్న ఎత్తుల్ని చూస్తే.. ఆ దేశం త్రిముఖ వార్ స్ట్రాటజీని ప్రయోగిస్తున్నట్లుగా చెప్పాలి. ఈ వ్యూహం చైనాకు ఎప్పుడూ అలవాటే. ఒక మాటలో చెప్పాలంటే పాతచింతకాయ పచ్చడి లాంటిదే. ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే.. మీడియాతో ప్రజల్ని ప్రభావితం చేయటం.. మైండ్ గేమ్.. న్యాయపోరాటం చేయటం లాంటి వాటితో శత్రువును దెబ్బ తీసేలా చేస్తుంది. 2003లో చైనా సైన్యం ఈ వ్యూహాన్ని తెర మీదకు తెచ్చింది. 2010లో దక్షిణ చైనా సముద్రం సహా పలు వివాదాస్పద అంశాల్లో చైనా దీన్నే అస్త్రంగా ప్రయోగిస్తుంటుంది. ప్రస్తుతం డోక్లామ్ ఇష్యూలో కూడా చైనా ఇదే తీరును ప్రదర్శిస్తోంది.

తొలిసారి ఈ వ్యూహాన్ని ఫిలిప్పీన్స్ పై చైనా ప్రయోగించింది.  దక్షిణ చైనా సముద్రంపై చైనా అధిపత్యానికి వ్యతిరేకంగా 2016లో ఐక్యరాజ్యసమితి సముద్ర సంబంధిత హక్కుల ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వటం.. ఫిలిప్పీన్స్ కు అప్పట్లో విజయం లభించినా దానికి ఫలితం లేకుండా ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్నును తన వైపునకు తిప్పుకుంది. దీంతో.. చైనా అధిపత్యాన్ని ఆ దేశం అంగీకరించినట్లైంది.

మీడియాను ఎంత శక్తివంతంగా వాడుతుందో తాజా డోక్లాం ఎపిసోడ్ లో చూస్తున్నదే. అదే పనిగా రెచ్చగొట్టే కథనాలు వండి వార్చేలా చేయటం.. బెదిరింపులతో ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేయటం.. తమ చర్యలకు అందరూ మద్దతు పలికేలా చేయటం లాంటివి చూస్తున్నదే. మీడియాను ఉపయోగించుకొని భారత్ అడుగులు ముందుకు పడకుండా చేసే ప్రయత్నాల్లో చైనా తలమునకలై ఉందని చెప్పొచ్చు. అందుకే.. డ్రాగన్ తీరును పట్టించుకోకుండా తనదైన హుందాతనాన్ని భారత్ మిస్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.