Begin typing your search above and press return to search.

చైనా దెబ్బ‌కి కిమ్ విల‌విల‌

By:  Tupaki Desk   |   25 Sep 2017 5:17 AM GMT
చైనా దెబ్బ‌కి కిమ్ విల‌విల‌
X
అవును! నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒంటికాలిపై రెచ్చిపోయిన ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్‌-ఉన్‌ కు అత్యంత మిత్ర దేశం డ్రాగ‌న్ కంట్రీ చైనా అదిరిపోయే దెబ్బ కొట్టింది. దీంతో కిమ్ విలవిల లాడిపోతున్న‌ట్టు స‌మాచారం. ఒక‌ప‌క్క ఐక్య‌రాజ్య‌స‌మితి ఎన్ని ఆంక్ష‌లు విధించినా, అమెరికా ఎంత‌గా హెచ్చ‌రించినా ఎంత‌మాత్రం లెక్క‌చేయ‌కుండా త‌న దుందుడుకు ప్ర‌ద‌ర్శిస్తున్న కిమ్‌.. చైనా దెబ్బ‌కి చేతులు ఎత్తేసే ప‌రిస్థితి చేరుకున్నాడ‌న అంటున్నారు. ఒకానొక ద‌శ‌లో అమెరికాను నాశ‌నం చేసే దాకా నిద్ర‌పోనంటూ.. ఏకంగా హైడ్రోజన్ బాంబుతో విరుచుకుప‌డిన ఈ బుల్లి దేశం నియంత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చైనా - ర‌ష్యా అండ చూసుకుని రెచ్చిపోతున్నాడ‌ని అమెరికా ప‌రోక్షంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు దేశాల‌నూ దెప్పిపొడుస్తూనే ఉంది. అయితే, కిమ్ విష‌యంలో చైనా అనూహ్యంగా తీసుకున్న కొన్ని సంచ‌న‌ల నిర్ణ‌యాలు ఇప్పుడు నియంత‌ను నిలువునా ఒణికించేస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. కిమ్ ఎంతగా రెచ్చిపోయినా చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన చైనా ఇప్పుడు అన్ని వైపుల నుంచి త‌న‌పై ఒత్తిడి పెర‌గ‌డంతో పంథా మార్చింది. ఒకానొక ద‌శ‌లో కిమ్‌ను వెనకేసుకు వ‌స్తూ.. ఇంకా క‌ఠిన ఆంక్ష‌లు అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించిన చైనా ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకుంది. ఉత్త‌ర‌కొరియాకు నిత్యం చైనా నుంచి వెళ్లే వస్త్ర ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. చమురు ఎగుమతులపై పరిమితులు విధించింది. ద్రవీకృత సహజ వాయువును ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడాన్ని శనివారం నుంచే నిలిపివేస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శుద్ధి చేసిన చమురు ఎగుమతులపై అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పరిమితులు కొనసాగు తాయని పేర్కొంది.

ఫ‌లితంగా శుద్ధి చేసిన చమురు ఎగుమతులను సంవత్సరానికి 20 లక్షల బ్యారెళ్ల‌కుకు పరిమితం చేసినట్లు డ్రాగ‌న్ దేశం స్పష్టం చేసింది. వస్త్ర దిగుమతులను కూడా శనివారం నుంచే నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు బొగ్గు, ఇనుము, ఇతర వస్తువుల దిగుమతులను కూడా నిలిపివేసింది. తాజాగా పలు దిగుమతులపై చైనా నిషేధం విధించింది. ఈ ఊహించని ప‌రిణామంతో కిమ్ అండ్ కో నివ్వెర‌పోయిన‌ట్టు చైనా మీడియా వెల్ల‌డించింది. అంతేకాదు, ఎగుమ‌తులు, దిగుమ‌తుల విష‌యంలో దాదాపు 70% వ‌రకు ఉత్త‌ర‌కొరియా.. చైనాపైనే ఆధార ప‌డుతున్నార‌ని, ఇప్పుడు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని మీడియా వెల్ల‌డించింది. మ‌రోప‌క్క‌, చైనా తీసుకున్న నిర్ణ‌యాన్ని అమెరికా స్వాగ‌తించిన‌ట్టు వాషింగ్ట‌న్ తెలిపింది. ఇదే విధంగా మిగిలిన దేశాలు కూడా కిమ్‌కు స‌హ‌క‌రించ‌డం మానుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో ఇంత‌కాలం విర్ర‌వీగుతూ వ‌స్తున్న కిమ్ దారిలోకి వ‌స్తాడ‌ని వాషింగ్ట‌న్ అంచ‌నా వేసింది. అయితే, కిమ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి.