Begin typing your search above and press return to search.

డ్రాగ‌న్‌ కు మిత్రులు ఎవ‌రు? శ‌త్రువులు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   22 Aug 2017 10:10 AM GMT
డ్రాగ‌న్‌ కు మిత్రులు ఎవ‌రు? శ‌త్రువులు ఎవ‌రు?
X
ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న రెండు దేశాలు చైనా.. భార‌త్‌. ఈ రెండింటి మ‌ధ్య నెల‌కొన్న డోక్లాం స‌రిహ‌ద్దు వివాదం పుణ్య‌మా అని గ‌డిచిన కొద్ది రోజులుగా ఈ రెండు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. చైనా దుష్ట‌బుద్దిని ప్ర‌పంచానికి తెలియ‌జేసేలా చేయ‌టంలో భార‌త్ స‌క్సెస్ అయితే.. త‌న దుష్ట‌బుద్ధిని త‌న‌కు తానే బ‌య‌ట‌పెట్టుకొని ఆగ్ర‌హంతో ర‌గిలిపోతోంది చైనా. డ్రాగ‌న్ అంటే చాలు.. పేచీలకోర‌న్న ఇమేజ్‌ ను సొంతం చేసుకుంది.

ఇరుగుపొరుగుతో ఏ మాత్రం స‌ఖ్యంగా మెల‌గ‌ని దేశంగా పేరు తెచ్చుకున్న చైనాకు.. నిజంగానే అంద‌రితోనూ గొడ‌వ‌లే ఉన్నాయా? ఆ దేశంలో ఫ్రెండ్ షిప్ చేసే దేశాలు అస్స‌ల్లేవా? అన్న సందేహాలు ప‌లువురికి వ‌స్తుంటాయి. మ‌రి.. చైనాతో స‌రిహ‌ద్దుల్ని పంచుకునే దేశాలు ఏంటి? వాటితో డాగ్ర‌న్ దేశానికి ఉన్న రిలేష‌న్స్ ను చూస్తే.. ఆ వివ‌రాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌న‌టంలో సందేహం లేదు.

భార‌త్ తో కాకుండా చైనాకు మొత్తంగా 13 దేశాల‌తో స‌రిహ‌ద్దుల్ని పంచుకుంటోంది. భార‌త్ దాయాది పాకిస్థాన్ విష‌యానికి వ‌స్తే.. చైనాతో ఆ దేశం మంచి సంబంధాలే ఉన్నాయి. ఆర్థిక అవ‌స‌రాల‌తో పాటు.. ఆగ్ర‌రాజ్య‌మైన అమెరికాతో ఉన్న పంచాయితీ నేప‌థ్యంలో పాక్ ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్న చైనా.. ఆర్థికంగానూ.. వివిధ అంశాల్లో త‌న స్నేహ హ‌స్తాన్ని చాచి మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అమెరికాతో ఉన్న విభేదాల కార‌ణంగా ర‌ష్యాతో డ్రాగ‌న్ వ్యూహాత్మ‌క స్నేహాన్ని నెరుపుతోంది.

ఇదే స‌మ‌యంలో ర‌ష్యా సైతం చైనా విష‌యంలో అదే విధానాన్ని అనుస‌రిస్తోంది. చైనాతో క‌లిసి న‌డిస్తే.. ఏదో ఒక రోజున అగ్రరాజ్య‌మైన అమెరికాను నిలువ‌రించొచ్చ‌న్న‌ది ఆ దేశ భావ‌న‌. చైనాతో మిత్రుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ష్యా.. భార‌త్‌ కూ మిత్రుడే అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఇక‌.. అమెరికాతో నిత్యం త‌గువులు పెట్టుకునే ఉత్త‌ర‌కొరియాతో చైనా స్నేహం అంద‌రికి తెలిసిందే. ఈ మ‌ధ్య‌న అమెరికా మీద ఒంటి కాలి మీద లేచిన ఉత్త‌ర‌కొరియా.. చైనా మాట‌తో వెన‌క్కి త‌గ్గిన వైనం చూస్తే.. చైనాతో ఎంత జిగిరీ స్నేహం ఉందో ఇట్టే అర్థం కాక మాన‌దు. చైనాకు స‌రిహ‌ద్దు దేశాలైన క‌జ‌కిస్థాన్‌.. లావోస్‌.. మ‌య‌న్మార్ లు కూడా చైనాతో ఫ్రెండ్లీగా ఉండే దేశాలే.

ఇక‌.. చైనాతో పంచాయితీలు ఉన్న దేశాల్లో మంగోలియా.. వియ‌త్నాం.. జ‌పాన్‌.. తైవాన్‌.. భార‌త్ లు ఉంటాయి. ఈ దేశాల‌కు చైనాతో స‌రిహ‌ద్దు పంచాయితీలు ఎక్కువ‌. అదే స‌మ‌యంలో చైనాకు స‌రిహ‌ద్దు దేశాలైన మ‌రికొన్ని దేశాల తీరు కాస్త భిన్నంగా ఉంటాయ‌ని చెప్పాలి. కిర్గిస్థాన్‌.. త‌జికిస్థాన్‌.. అఫ్ఘ‌నిస్థాన్ లు గోడ మీద పిల్లి వాటంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. ఎప్ప‌టి అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు అప్పుడు వ్య‌వ‌హ‌రించ‌టం ఆ దేశాల ల‌క్ష‌ణంగా చెప్పాలి. నేపాల్‌.. భూటాన్ లు రెండు భార‌త్ తో స్నేహ సంబంధాలు ఉన్న‌వే. తైవాన్‌.. కంబోడియా.. బ్రూనై దేశాలకూ చైనా అంటే చిరాకే. స‌ముద్ర జ‌లాల్ని పంచుకునే చైనా స‌రిహ‌ద్దు దేశాల్లో ఒక్క మ‌లేషియా మాత్ర‌మే చైనా ప‌ట్ల త‌ట‌స్థ వైఖ‌రిని క‌న‌ప‌రుస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.