అరుణాచల్ లో మరో డోక్లాం..ఉద్రిక్త పరిస్థితులు

Mon Apr 09 2018 13:06:45 GMT+0530 (IST)

ఇరుగుపొరుగున ఉన్న చైనా-భారత్ మధ్య మరోసారి ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.గత ఏడాది జూన్ 16 నుంచి 73రోజులపాటు డోక్లాంలో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగిన విషయం తెలిసిందే. చైనా సైనికులు అక్రమంగా రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించగా - అప్రమత్తమైన భారత బలగాలు చైనాను నిలువరించాయి. ఆగస్టు 28న ప్రతిష్టంభనకు తెరపడినప్పటికీ - భారత్ తన బలగాలను పూర్తిగా ఉపసంహరించలేదు. దీంతోపాటు చైనా సరిహద్దుల్లోని అన్ని కీలక ప్రాంతాల్లో గస్తీని తీవ్రతరం చేసింది. తాజాగా ఇరుదేశాల వాగ్యుద్ధానికి ఈసారి అరుణాచల్ ప్రదేశ్ కేంద్రమైంది. అరుణాచల్ లోని వాస్తవాధీనరేఖ వద్ద గస్తీ నిర్వహిస్తున్న భారత సైన్యం నిబంధనలను అతిక్రమిస్తోందని చైనా ఆరోపిస్తోంది. అయితే చైనా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అసఫిలా ప్రాంతంలోని అప్పర్ సుబాన్ సిరి ముమ్మాటికీ భారత అంతర్భాగమని స్పష్టంచేసింది. సైనికవివాదాల పరిష్కారానికి జరిపే ఇరుదేశాల భద్రతాసిబ్బంది సమావేశం బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బీపీఎం)లో ఇటీవల చైనా తన అభ్యంతరాలను తెలుపగా - భారత్ దీటుగా బదులిచ్చింది. దీంతో వివాదం రాజుకుంది.వాస్తవాధీన రేఖ వెంట లా - కిబితు (అరుణాచల్ ప్రదేశ్) - దౌలత్ బేగ్ ఓల్డి - చుశుల్ (లడఖ్) - నాథులా (సిక్కిం).. ఐదుచోట్ల బీపీఎం కేంద్రాలున్నాయి. మార్చి 15న కిబితులోని దాయిమాయి వద్ద జరిగిన బీపీఎంలో చైనా గస్తీ అంశాన్ని లేవనెత్తింది. వ్యూహాత్మకంగా సున్నితప్రాంతమైన అసఫిలాలో భారత్ గస్తీ నిర్వహించడం అతిక్రమణేనని దానిని అక్రమ చొరబాటుగానే భావించాల్సి ఉంటుందని చైనా తెలిపింది. అయితే చైనా ఉపయోగించిన పదజాలంపై అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్.. ఆ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది. `అసఫిలాలోని అప్పర్ సుబాన్ సిరి ప్రాంతంవరకు భారత్ లో అంతర్భాగం. వాస్తవాధీన రేఖపై పూర్తి అవగాహనతోనే భారత భూభాగంలో పహారా కాస్తున్నాం. దీనిని చైనా అతిక్రమణగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది` అని ఆర్మీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అసఫిలాలో భారత బలగాలు గస్తీ నిర్వహిస్తే ఇరుదేశాల మధ్య మళ్లీ యుద్ధవాతావరణం నెలకొనే అవకాశాలున్నాయని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారి ఒకరు పేర్కొన్నట్లు చైనా మీడియా తెలిపింది. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ అధికారి చెప్పారు.

ఇదిలాఉండగా...అరుణాచల్ ప్రదేశ్ లోని అసఫిలా ప్రాంతం ఇరుదేశాల సరిహద్దులో ఉన్న భారత భూభాగం. చేప తోక (ఫిష్ టెయిల్) ఆకారంలో ఉండే ఆ ప్రాంతం వ్యూహాత్మకంగా ఇరుదేశాలకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు చైనా కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నది. పలుమార్లు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన సంఘటనలూ ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ చివరివారంలో చైనాకు చెందిన కొందరు రోడ్డు నిర్మాణ కార్మికులు అరుణాచల్ లోని ట్యూటింగ్ ప్రాంతంలో సరిహద్దు నుంచి కిలోమీటరు లోపలికి వచ్చి తవ్వకాలకు ప్రయత్నించారు. అడ్డుకున్న భారత సరిహద్దు గస్తీదళం వాహనాలను - కార్మికులను తిప్పి పంపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోకి అడుగుపెట్టేందుకు చైనా నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే భారత్ అక్కడ నిత్యం గస్తీని ఏర్పాటు చేసింది. ఇది చైనాకు ఇబ్బందిగా మారింది.దీంతో కయ్యానికి కాలు దువ్వుతోంది.