Begin typing your search above and press return to search.

డోక్లాం వ‌దిలేసి...మ‌రో చోట కెలుకుతున్న చైనా

By:  Tupaki Desk   |   17 Jan 2018 5:06 AM GMT
డోక్లాం వ‌దిలేసి...మ‌రో చోట కెలుకుతున్న చైనా
X
కీల‌క‌మైన డోక్లాం ట్రై జంక్ష‌న్‌లో ర‌చ్చ చేసేందుకు ప్రయ‌త్నించి...నెల‌ల త‌ర‌బ‌డి అక్క‌డ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు దిగి....అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి ఒత్తిళ్లు రావ‌డంతో వెన‌క్కు త‌గ్గిన చైనా ఇప్ప‌టికీ త‌న కుట్ర‌పూర‌తి విధానాల‌ను ప‌క్క‌న పెట్ట‌డం లేదు. తాజాగా మరో వివాదానికి చైనా తెరలేపింది. ఈ ద‌ఫా రూటు మార్చి డోక్లాం కాకుండా వ్యూహాత్మక ప్రాంతమైన పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని షక్స్‌గాం లోయను ఎంచుకుంది. ఈ లోయ‌లో 36 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంతోపాటు సైనిక పోస్టుల నిర్మాణం చేపడుతూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది.

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్లో ఉన్న షక్స్‌గాం లోయ.. సియాచిన్ హిమానీనదానికి ఉత్తర దిక్కుగా ఉంది. తాజాగా ఇక్క‌డ చైనా రోడ్డు నిర్మిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను నిర్ధారిస్తున్నాయి. చైనా తీసుకున్న ఈ నిర్ణయం.. పశ్చిమ హిమాలయాల్లో భారత్-చైనాల మధ్య ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. నూతన రోడ్డు, సైనిక పోస్టుల నిర్మాణం వల్ల వాస్తవిక నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంట చైనాకు అదనపు ప్రాంతం లభిస్తుంది. పీవోకేలో భాగమైన షక్స్‌గాం లోయ.. సియాచిన్ హిమానీనదంతో పాటు చైనాలోని జిన్జియాంగ్ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉంది. సరిహద్దు ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ దీనిని 1963లో చైనాకు అప్పగించింది. అయితే దీనిని భారత్ గుర్తించడం లేదు. ఈ ప్రాంతాన్ని జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో భాగంగానే భారత్ గుర్తిస్తోంది.

కాగా, చైనా చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల సియాచిన్‌లోని భారత బలగాలకు నేరుగా ఎటువంటి ముప్పు లేకపోయినప్పటికీ.. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే చైనా ఇలా చేస్తున్నదని భారత ఉత్తర ఆర్మీ మాజీ కమాండర్ ఒకరు తెలిపారు. గతంలో భారత్-చైనాల మధ్య ఏర్పడిన డోక్లాం ప్రతిష్టంభన ముగిసినప్ప‌టికీ చైనా ఇలా చేయ‌డం క‌వ్వింపు చ‌ర్యేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.