Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో 2700 ఏళ్ల నాటి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశారు

By:  Tupaki Desk   |   17 April 2018 5:28 AM GMT
హైద‌రాబాద్‌ లో 2700 ఏళ్ల నాటి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశారు
X
ఔను. 2700 ఏళ్ల‌నాటి చ‌రిత్ర‌ను హైద‌రాబాద్‌లో తిర‌గ‌రాశారు. అది హైద‌రాబాద్‌లో. ద‌ళిత యువ‌కుడు, బ్రాహ్మ‌ణ పూజ‌రి వ‌ల్ల ఈ ప్ర‌త్యేకత చోటుచేసుకుంది. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...జియాగూడలోని చరిత్రాత్మకమైన రంగనాథస్వామి దేవాయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని ఆనందోత్సాహాల మ‌ధ్య‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవి ఉపాసకులు ఆదిత్య పరాశ్రీని సాయత్రం 4 గంటలకు రంగనాథస్వామి దేవాలయ ప్రాంగణ మండపం నుంచి తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ భుజస్కందాలపై ఎత్తుకొని ఆలయ ప్రవేశం చేశారు. భుజాలపై ఎత్తుకొని ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతులతో ఆహ్వానం పలికి ఆదిత్య పరాశ్రీకి శఠగోపం శిరస్సుపై ధరింపచేసి ఆశీర్వదించారు.

అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎస్ రంగరాజన్ మాట్లాడుతూ...2700 ఏళ్ల‌ నాటి లోకసారంగముని స్ఫూర్తితో రంగనాథస్వామి ఆలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. తమిళనాడులోని శ్రీరంగ ఆలయంలో దళితున్ని ఆలయంలోకి రామానుజాచార్యులు వారు స్వయంగా భుజస్కంధాలపై మోసుకెళ్లి స్వామి వారి దర్శనం చేయించారని గుర్తుచేశారు. ఇదే మునివాహన సేవ కార్యక్రమాన్ని జియాగూడలోని శ్రీ రంగనాథ్ స్వామి దేవాలయంలో నిర్వహించామని తెలిపారు. దళితులు నేటికీ అనేక వివక్షతలను ఎదుర్కొంటున్నారన్నారు. రాజ్యాంగం, చట్టాలు సైతం వాళ్లకు పరిరక్షణ కల్పించలేకపోవడం బాధాకరమన్నారు. నిత్యం దళితులపై ఎక్కడో ఒక చోట దాడులు జరగడం సాధారణంగా మారిందన్నారు. దళితులపై ఉన్న వివక్షతను తొలగించడానికి, సమానత్వాన్ని చాటి చెప్పేందుకు ఒక దళితుడిని భుజస్కందాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామని రంగ‌రాజ‌న్ తెలిపారు. ఇది అంకురార్పణ మాత్రమేనని ప్రతి ఆలయంలో ముని వాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి చైతన్యం తీసుకురావాలని కోరారు.

ఈ సందర్భంగా తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాల చారీ మాట్లాడుతూ..ప్రతి గుడిలో దళితులకు ప్రవేశం కల్పించడంతో పాటు వారిని అన్ని విధాల జాగృతం చేసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి కృషి చేయాలన్నారు. భక్తుడు అదిత్య పరశురాం మాట్లాడుతూ.. కుల - వర్ణ వివక్ష ఉండకూడదని, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు అందరూ దేవుని వద్ద సమానమేనని అన్నారు. ఈ మునివాహన సేవా మహా అద్భుతమైన ఘట్టమని తెలిపారు. తన గ్రామంలో అంజనేయ స్వామి ఆలయంలోకి తనను అనుమతించకపోవటంతో తాను మహారాష్టక్రు వెళ్లి ఓ గురువు వద్ద వేదాలు, మంత్రాలు నేర్చుకున్నానని ఆదిత్య పరశురాం తెలిపారు.