Begin typing your search above and press return to search.

మోడీ టీం స‌భ్యుడి పొగడ్త‌ల‌కు కేసీఆర్ ఫిదా

By:  Tupaki Desk   |   19 Feb 2018 11:30 PM GMT
మోడీ టీం స‌భ్యుడి పొగడ్త‌ల‌కు కేసీఆర్ ఫిదా
X
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు అనూహ్య‌మైన ప్ర‌శంస ద‌క్కింది. ఢిల్లీకి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్‌ - ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ టీంలోని ప్ర‌ముఖుడు కేసీఆర్‌ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన - కేసీఆర్ కిట్స్ - భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం - రైతులకు పంట పెట్టుబడి మద్దతు పథకం లాంటి కార్యక్రమాలు ఎంతో గొప్ప కార్యక్రమాలని - దేశమంతా వీటిని అధ్యయనం చేసి అమలు చేయాలని ప్రముఖ ఆర్థిక వేత్త - కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సుపరిపాలనకు గుండెకాయలాంటిదని వ్యాఖ్యానించారు. తల్లి - బిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యయానికి వెనుకాడకుండా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ చాలా గొప్ప కార్యక్రమమని, తననెంతో ప్రభావితం చేసిందని అభినందించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పదని - ఏప్రిల్ 20న ప్రారంభమయ్యే తొలి విడత సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమం (నేషనల్ ఈవెంట్) గా నిర్వహించాలని - తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించారు. శాంతి భద్రతలు బాగుంటేనే ప్రగతి సాధ్యమని - తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన అభినందించారు. స్త్రీ - పురుష నిష్పత్తిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వ్యత్యాసం లేకపోవడం ప్రగతిశీలమైన విషయమని చెప్పారు.

అరవింద్ సుబ్రమణ్యన్ సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. నీటి పారుదల ప్రాజెక్టులు - రైతులకు పంట పెట్టుబడి మద్దతు పథకం - భూ రికార్డుల ప్రక్షాళన - మిషన్ కాకతీయ - మిషన్ భగీరథ - రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ - టిఎస్ ఐపాస్ చట్టం - రెసిడెన్షియల్ స్కూళ్లు - కేసీఆర్ కిట్స్ - పెన్షన్లు - కళ్యాణ లక్ష్మి - ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రగతి నిధి - మైనారిటీల సంక్షేమం - హరితహారం తదితర కార్యక్రమాల అమలును వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను డిజిపి మహేందర్ రెడ్డి వీడియో రూపంలో ప్రదర్శించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

భూ రికార్డుల ప్రక్షాళన - కేసీఆర్ కిట్స్ - పంట పెట్టుబడి మద్దతు పథకాలపై సుబ్రమణ్యన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన చాలా గొప్ప కార్యక్రమమని - దేశమంతా ఈ విధంగా చేయాలని అభిప్రాయపడ్డారు. మొదటి విడతలోనే 93 శాతం భూములకు సంబంధించిన రికార్డులను క్లియర్ చేసి - యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వడం అద్భుతమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కిట్స్ కార్యక్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్స్ పథకం ద్వారా పేద గర్భిణీలు కూలీకి పోకపోవడం వల్ల జరిగే వేతన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు - మగ పిల్లాడు పుడితే రూ.12 వేల నగదు అందించడంతో పాటు తల్లీ - బిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన రూ.3వేల విలువైన కేసీఆర్ కిట్ ను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు.

దీంతో సుబ్రమణ్యన్ ఎంతో ప్రభావితమై కేసీఆర్ కిట్ ను అడిగి తెప్పించుకుని మరీ ప్రతీ వస్తువును ఆర్థిక శాఖ స‌ల‌హాదారు పరిశీలించారు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమైన పథకమని కొనియాడారు. కేసీఆర్ కిట్స్ పథకం గురించి తాను కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరిస్తానని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు ఇది ఆదర్శమన్నారు. తెలంగాణకు హరితహారం - భారీ ఎత్తిపోతల పథకాలు కూడా తెలంగాణలో చాలా చక్కగా అమలవుతున్నాయని అభినందించారు. రైతులకు పెట్టుబడి అందించడం చాలా ఉపయోగకరమైన పథకమని - మొదటి విడత సాయం అందించే కార్యక్రమానికి తాను తప్పక హాజరవుతానని వెల్లడించారు. రైతులకు పెట్టుబడి మద్దతు కింద మొదటి విడత నాలుగు వేలు అందించే కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలని సిఎంకు సూచించారు. తాను త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని అప్పుడు కేసీఆర్ కిట్స్ - ఎత్తిపోతల పథకాలు - హరితహారం లాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని వెల్లడించారు. కళ్యాణలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడపిల్ల పెళ్ళికి రూ.75,116 చొప్పున ప్రభుత్వమే సహాయం అందించడాన్ని ప్రస్తావిస్తూ - ప్రభుత్వమే ఆడపిల్లకు కట్నం ఇస్తున్నట్లా అని హ్యాస్యోక్తి విసిరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ - ప్రగతి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు నిధులు తగ్గించకుండా - ప్రోత్సహించే విధంగా కేంద్ర విధానం ఉండాలని కోరారు. ఈ దిశగా కేంద్రం ఆలోచించేలా చొరవ చూపాలని కోరారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిండాన్ని తాము వ్యతిరేకించడం లేదని - కాని ముందడుగు వేసే రాష్ట్రాలను నిలువరించే చర్యలు మానుకోవాలని చెప్పారు. ఆదాయవృద్ధిలో ముందంజలో ఉండి - చేసిన అప్పులను తీర్చగలిగే శక్తి ఉన్న రాష్ట్రాలకు ఎఫ్.ఆర్.బి.ఎం. పరిధిని పెంచాలని కోరారు. దేశ తలసరి ఆదాయం రూ.1.03 లక్షలుంటే - తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం రూ.1.55 లక్షలని చెప్పారు. జిఎస్టీ అమలు చేయకముందు ఆదాయంలో వృద్దిరేటు 21 శాతముంటే - జిఎస్టీ అమలు చేసిన తర్వాత కూడా 16.5 శాతం వృద్ధిరేటుతో దేశంలో అగ్రస్థానంలో ఉందని సిఎం చెప్పారు. 2013-14 లో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.1.36 లక్షలయతే - 2017-18 తెలంగాణ బడ్జెట్ రూ.1.49వేల కోట్లని సిఎం చెప్పారు. ఇంత ముందడుగు వేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని పెంచి - మరింత తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రాలు పురోగమిస్తేనే దేశం పురోగమిస్తుందని - రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటే దేశ ప్రగతి కూడా కుంటు పడుతుందని సిఎం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులే ఎక్కువ మంది ఉన్నారని - వారు అభివృద్ది చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే గట్టి నమ్మకంతో తామున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అందుకే రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని - వ్యవసాయరంగాభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని సీఎం వివరించారు. తెలంగాణకు గోదావరి - కృష్ణా నదుల్లో ఉన్న వాటా కేవలం కాగితాలకే పరిమితమని - సమైక్య పాలనలో నీళ్లు తెలంగాణ పొలాలకు రాలేదని సిఎం వివరించారు. అందుకే తాము సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని - కాళేశ్వరం - పాలమూరు - సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. 2020 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతులు రెండు పంటలు పండించుకుంటారని, రైతులు ఏటా రూ.1.25 లక్షల విలువైన పంటలు పండిస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.