Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ కు షాక్‌..సిట్టింగ్ ఎంపీ రాజీనామా

By:  Tupaki Desk   |   20 Nov 2018 1:24 PM GMT
టీఆర్ ఎస్‌ కు షాక్‌..సిట్టింగ్ ఎంపీ రాజీనామా
X
తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన లోక్‌ సభ సభ్యుడు - చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి... టీఆర్ ఎస్‌ కు రాజీనామా చేయనున్నారని ప్రచారం జోరుగా సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌లు నిజం అవుతూ తాజాగా అదే జ‌రిగింది. టీఆర్ ఎస్‌ కు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో కలకలం రేగింది. కొంతకాలంగా పార్టీ నేతలతో అంతంత మాత్రంగానే విశ్వేశ్వర్‌ రెడ్డి సంబంధాలున్నాయి... పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొద్దికాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా ఆయ‌న గుడ్‌ బై చెప్పేశారు.

లోక్‌ సభ సభ్యుడు - చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి... టీఆర్ ఎస్‌ కు రాజీనామా చేయనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ దశలో ఆయన రాజీనామా చేశారు... సీఎం కేసీఆర్‌ కు రాజీనామా లేఖ కూడా పంపించారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌ చల్ చేశాయి. దీనిపై స్పందించిన కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి... తన రాజీనామా వార్తలను ఖండించారు... నేను టీఆర్ ఎస్‌ కు రాజీనామా చేశాను అనే వార్తలు వాస్తవం లేదన్న ఆయన... తాను కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు రాజీనామా చేసే ఆలోచన లేదని ప్రకటించారు. అయితే కేటీఆర్‌ ను కలిసిన తర్వాతే కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఈ ప్రకటన చేశారు.

కాగా, మూడు పేజీల రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌ కు పంపించిన కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి రాజీనామాకు గల కారణాలను లేఖలో వివరించారు. ప్రధానంగా ఐదు కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీ గత రెండేళ్లుగా ప్రజలకు దూరమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెరాసలో సరైన గౌరవం లేదని, పార్టీ కోసం కష్టపడుతున్నకార్యకర్తలకు సరైన గౌరవం లేదని పేర్కొన్నారు. తెరాసలో సంప్రదాయ రాజకీయాలు లేవని తెలిపారు. పార్టీ - రాష్ట్ర స్థాయిల్లో ఎలాంటి గుర్తింపు లేదని తెలిపారు. ఎంపీగా తన నియోజకవర్గ ప్రజలకు ఆశించిన స్థాయిలో పనిచేశానన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు. తాజాగా ఆయ‌న రాజీనామా చేశారు.

ఇదిలాఉండ‌గా, ఈనెల‌ 23వ తేదీన కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ సమక్షంలో కొండా విశ్వేశ్వ‌ర్‌ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచుకొనున్న‌ట్లు తెలుస్తోంది. మేడ్చ‌ల్‌ లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి సోనియాగాంధీ వ‌స్తున్న సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్‌ లో చేర‌నున్న‌ట్లు స‌మాచారం.