Begin typing your search above and press return to search.

26 ఏళ్లుగా వెతుకుతున్న దేవుడు అత‌డికి క‌నిపించాడు

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:16 AM GMT
26 ఏళ్లుగా వెతుకుతున్న దేవుడు అత‌డికి క‌నిపించాడు
X
దేవుడేమిటి? క‌నిపించ‌టం ఏమిటి? అందుకోసం 26 ఏళ్లుగా వెత‌క‌టం ఏమిటి? అన్న డౌట్లు అక్క‌ర్లేదు. ఈ క‌థ‌నం మొత్తం చ‌దివితే మీరు క‌న్వీన్స్ కావ‌ట‌మే కాదు..ఒక ఫీల్ గుడ్ మూవీని చూసిన‌ట్లుగా ఫీల‌వుతారు. అంతేనా.. జాతీయ‌త పేరుతో ఇష్టారాజ్యంగా మాట్లాడే వారిపై అనుమానాలు పెర‌గ‌ట‌మే కాదు.. మేరా భార‌త్ మ‌హాన్ అన్న ఫీలింగ్ రావ‌టం ఖాయం.

1992 ముంబ‌యి అల్ల‌ర్లు గుర్తున్నాయి? ఎప్పుడేం జ‌రుగుతుందో? తెలీక ముంబ‌యి ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో వ‌ణికిపోయారు. క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లుగా చంపేసిన వైనం భార‌త ఆర్థిక రాజ‌ధానిని భారీగా దెబ్బ తీసింది. ముంబ‌యి అల్ల‌ర్ల ప్ర‌భావం నుంచి తేరుకోవ‌టానికి ఆ మ‌హాన‌గ‌రానికి చాలా ఏళ్లే ప‌ట్టింది. అలాంటి వేళ ఒక వ్య‌క్తి ప్రాణాన్ని కాపాడిందో ముస్లిం కుటుంబం. త‌న‌ను కాపాడి ప్రాణ‌భిక్ష పెట్టిన కుటుంబం కోసం ఆ వ్య‌క్తి 26 ఏళ్లుగా వెతుకుతున్నాడు.

రీల్ మూవీని త‌ల‌పించేలా ఉండే ఈ వ్య‌వ‌హారంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఒక ముస్లిం కుటుంబం మాన‌వత్వంతో కాపాడిన ఆ యువ‌కుడు ఈ రోజున ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత చెఫ్ ల‌లో ఒక‌డ‌య్యాడు. ఇంత‌కీ అత‌నెవ‌రు? అత‌న్ని ముస్లిం కుటుంబం ఎలా కాపాడింది? 26 ఏళ్ల వెతుకులాట ఎలా ముగిసింద‌న్న విష‌యాల్లోకి వెళితే..

ఈ రోజున ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత చెఫ్ గా పేరున్న విక్ర‌మ్ ఖ‌న్నా 1992లో ముంబ‌యిలోని ఒక హోట‌ల్లో ట్రైనీ చెఫ్ గా ప‌ని చేస్తుండేవాడు.

న‌వంబ‌రులో అల్ల‌ర్లతో అట్టుడుకిపోయిన వేళ‌.. ఆ విష‌యం తెలీక విక్ర‌మ్ త‌న షిఫ్ట్ ముగించుకొని బ‌య‌ట‌కు వ‌చ్చాడు. కాసేప‌టికి అత‌నికి ముంబ‌యిలో జ‌రుగుతున్న అల్ల‌ర్ల స‌మాచారం అందింది. తిరిగి వెన‌క్కి వెళ్లలేని ప‌రిస్థితి. అలాంటి వేళ‌లో ఒక ముస్లిం కుటుంబం అత‌న్ని ఆపి.. అల్ల‌ర్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. త‌మ ఇంట్లో ఉండాల‌ని చెప్పారు. అలా ఇంట్లోకి తీసుకెళుతున్న వేళ‌.. ఇర‌వై మందితో కూడిన గుంపు ఒక‌టి స‌ద‌రు ముస్లిం ఇంట్లోకి వ‌చ్చి విక్ర‌మ్ గురించి వాక‌బు చేశారు.

ఆ ఇంటి య‌జ‌మాని వికాస్ ఖ‌న్నా మాత్రం విక్ర‌మ్ త‌న అబ్బాయేన‌ని చెప్ప‌టంతో వాళ్లు ఏమీ చేయ‌కుండా వెళ్లిపోయారు. అనుమానంతో మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చి చూస్తుండేవారు. అలా ఒక‌టిన్న‌ర రోజుల పాటు ఆ ముస్లిం ఇంట్లోనే విక్ర‌మ్ ఉండిపోయాడు. ఆ సంద‌ర్భంగా వారు చూపించిన మాన‌వ‌త్వం.. ఇచ్చిన అతిధ్యం ఆయ‌న మ‌న‌సులో ఉండిపోయింది. అమృత్ స‌ర్‌కు చెందిన విక్ర‌మ్ అప్ప‌టి నుంచి త‌న‌ను కాపాడిన ముస్లిం కుటుంబం కోసం వెత‌క‌టం షురూ చేశారు. అయినా వారి స‌మాచారం ఆయ‌న‌కు ల‌భించ‌లేదు.

త‌ర్వాతి కాలంలో ఆయ‌న ప్ర‌ముఖ చెఫ్ గా మార‌టం.. సెల‌బ్రిటీల్లో ఒక‌రిగా అయ్యారు. తాజాగా బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేశ్ ఇంట‌ర్వ్యూలో త‌న‌కు ఎదురైన ఉదంతం గురించి చెప్పారు. త‌న‌ను కాపాడిన ముస్లిం కుటుంబాన్ని క‌ల‌వాల‌ని 26 ఏళ్లుగా తాను ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాన‌ని చెప్పాడు. త‌న క‌ల నెర‌వేరింద‌ని.. అతి క‌ష్ట‌మ్మీద త‌న‌ను కాపాడిన క‌టుంబాన్ని క‌లిసిన‌ట్లుగా వెల్ల‌డించాడు.

త‌న‌ను కాపాడిన ముస్లిం కుటుంబానికి గుర్తుగా.. ప్ర‌తి ఏడాది రంజాన్ మాసంలో ఒక రోజు ఉప‌వాస దీక్ష చేస్తుండేవాడు. మ‌రింత విచిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. 26 ఏళ్లుగా తాను వెతుకుతున్న కుటుంబం రంజాన్ మాసంలో ఆచూకీ ల‌భించ‌టంతో.. ఈసారి ఈద్‌ కి త‌న దేవుడితో పాటు జ‌రుపుకున్నాడు. ప్రాణాన్ని కాపాడిన వ్య‌క్తి దేవుడు కాకుండా ఇంకేం అవుతాడు చెప్పండి. మ‌నిషి ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు..అత‌ని ప్రాణాన్ని కాపాడ‌ట‌మే త‌ప్పించి అత‌ని మ‌తాన్ని చూడ‌కుండా ఉండ‌టానికి మించిన మాన‌వ‌త్వం భార‌త్ లో కాకుండా మ‌రెక్క‌డ దొరుకుతుంది?