Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలపై నో ఛేంజస్ అట!

By:  Tupaki Desk   |   30 Sep 2016 5:17 AM GMT
కొత్త జిల్లాలపై నో ఛేంజస్ అట!
X
దసరా రోజున కొత్త జిల్లాల్ని ప్ర‌క‌టించాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలపై పలు దఫాలు పలు విధాలుగా అనుకున్నప్పటికీ.. ఆ మధ్యన 17 కొత్త జిల్లాలతో మొత్తంగా 27 జిల్లాలుగా డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల ముసాయిదాపై తెలంగాణలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. కోదండరాం లాంటి ఉద్యమ నేతలు అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేసి.. శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. అసెంబ్లీలో చర్చించిన తర్వాత కొత్త జిల్లాల అంశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయటం తెలిసిందే.

ఇక.. విపక్షానికి చెందిన పలువురు నేతలు కొత్త జిల్లాలపై తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కొత్త జిల్లాలపై కేసీఆర్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అత్యున్నత స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సమీక్షలో భాగంగా కేసీఆర్‌ ఏమేం నిర్ణయాలు తీసుకున్నారన్నది అధికారికంగా బయటకు రానప్పటికీ విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం చూస్తే..

= కొత్త జిల్లాలు 27 అన్నది డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారట.

= ఇక డివిజన్లు.. మండలాలకు సంబంధించి మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలా? లేక.. ఏం చేయాలన్న విషయంపై మాత్రం ఏటూ తేల్చుకోలేకపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.

= శంషాబాద్ జిల్లాను ఓకే చేసిన కేసీఆర్.. ఈ జిల్లాలో మరో మూడు మండలాల్ని కలపాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ మార్పుల‌ను తుది నోటిఫికేషన్లో పొందుపర్చాలని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది.

= వివాదాస్పదంగా మారిన హన్మకొండ జిల్లా ఏర్పాటు విషయంలో కేసీఆర్ మొదట అనుకున్న దానికే ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హన్మకొండ జిల్లా ఏర్పాటు ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

= దసరా రోజు తెరపైకి రానున్న కొత్త జిల్లాల వేడుకల్లో సిద్ధిపేట జిల్లాను తాను ప్రారంభిస్తానని చెప్పినట్లే కేసీఆర్ చేతుల మీదుగా సిద్ధిపేట జిల్లా స్టార్ట్ అవుతుందని.. మిగిలిన జిల్లాల్ని ఎవరు స్టార్ట్ చేయాలన్న అంశంపై ఫైనల్ నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెబుతున్నారు.

= ముసాయిదాలో ప్రకటించిన జిల్లాల్లో రంగారెడ్డి.. వరంగల్.. మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి పలు సమస్యలు ఉన్నట్లుగా గుర్తించి.. వాటిపై మరింత కసరత్తు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు. సరిహద్దుల విషయంలో ఉన్నపంచాయితీలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పినట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/