మంత్రి కొడుకు బూతులు బజర్లోకి వచ్చాయ్

Tue Dec 12 2017 14:20:16 GMT+0530 (IST)

గులాబీ నేతలు చెలరేగిపోతున్నారు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ఉదంతాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిరాకు తెప్పిస్తున్నాయి.  గులాబీ నేతలకు.. వారి కుటుంబాలకు అధికారం ఎంతగా తలకెక్కిందన్న వైనం గడిచిన వారంలో బయటకు వచ్చిన ఇష్యూలు తెలంగాణ సర్కారు ఇమేజ్ను భారీగా డ్యామేజ్ చేస్తున్నాయి. అధికారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఒక ఎత్తు అయితే.. సొంత పార్టీ నేతల్ని సైతం లెక్క చేయకపోవటం.. బూతులు తిట్టేయటం సంచలనంగా మారింది.తాజాగా ఎంపీ సీతారాంనాయక్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి చందులాల్ కొడుకు బూతులు తిట్టిన వైనానికి సంబంధించి బయటకు వచ్చిన ఆడియో టేపు సంచలనం సృష్టిస్తోంది. సొంత పార్టీకి చెందిన ఎంపీని.. అంత తీవ్రస్థాయిలో విరుచుకుపడటం హాట్ టాపిక్ గా మారింది. వైరల్ గా మారిన చందూలాల్ కొడుకు బూతు మాటల ఆడియో క్లిప్ తో కేసీఆర్ సర్కారు ఆత్మరక్షణలో పడింది.

ప్రత్యర్థి పార్టీల వారిపైనో.. అధికారుల పైనో పవర్ చూపించటాన్ని అర్థం చేసుకోవచ్చని.. ఒక మంత్రికొడుకు.. సొంత పార్టీ ఎంపీని అంతలా చులకన చేసి మాట్లాడతారా? అన్నది ప్రశ్నగా మారింది.  జయశంకర్ జిల్లా ములుగు మండలం జంగాల పల్లికి చెందిన టీఆర్ ఎస్ కార్యకర్త రవిదాసు మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ కు ఫోన్ చేశారు.

తనకు పదవి రాలేదని.. మొన్నమొన్న వచ్చినోళ్లకు పదవులు ఇస్తున్నారంటూ కాస్త గట్టిగానే వాదించాడు. ఆవేశానికి గురైన ప్రహ్లాద్ ఉంటే ఉండు.. పోతే పో అంటూ దరుసుగా మాట్లాడారు. దీనికి సదరు కార్యకర్త స్పందిస్తూ మేం ఎందుకు పోతాం సార్ అని వ్యాఖ్యానించారు.

దీనికి స్పందించిన ప్రహ్లాద్.. ఎంపీ పేరు చెబితే వాడు వచ్చి పీకుతాడా? ఏంటీ ఎంపీ గొప్ప? అంటూ నోరు పారేసుకున్నారు. నువ్వు మెసేజ్ పెట్టినావు కదా.. నా నియోజకవర్గానికి వచ్చి ఎంపీ పీకుతాడా? అంటూ బూతుపురాణం మొదలెట్టటం ఆడియో క్లిఫ్ లో ఉంది.

డెఫినెట్గా నువ్వు ఎంపీ దగ్గరకు పోవాలి.. వాడు నీకేం పదవి ఇస్తాడో చూస్తా.. వాడి పేరు చెప్పిన నన్ను భయపెట్టిస్తున్నావా? అంటూ ఫైర్ అయ్యాడు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఆడియో క్లిఫ్ లో ఎంపీ సీతారాంనాయక్ పేరును వాడటం ఒక ఎత్తు అయితే.. గౌరవం లేకుండా వాడు.. వీడు అంటూ బూతుమాటలు మాట్లాడటంపై గులాబీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికే ఈ క్లిప్ ఎపిసోడ్ను తెర మీదకు తెచ్చినట్లుగా మంత్రి చందూలాల్ వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.