Begin typing your search above and press return to search.

మాటల్లోనే మోడీ మద్దతా? ఇస్రో శాస్త్రవేత్తలకు జీతంలో కోత?

By:  Tupaki Desk   |   10 Sep 2019 8:19 AM GMT
మాటల్లోనే మోడీ మద్దతా? ఇస్రో శాస్త్రవేత్తలకు జీతంలో కోత?
X
ఇస్రో గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రయోగాల్లో విఫలమైనప్పటికీ.. విజయాల శాతం ఎక్కువే. కీలకమైన.. కష్టతరమైన ప్రయోగాల్ని విజయవంతంగా పూర్తి చేసిన ట్రాక్ రికార్డు ఈ సంస్థ సొంతం. అలాంటి ఇస్రో ఇటీవల చంద్రయాన్ 2ను ప్రయోగించటం.. ఆ ప్రయోగంలో చివరి అంకంలో విక్రమ్ ల్యాండ్ రోవర్ కు.. ఇస్రోకు మధ్య కమ్యూనికేషన్ కట్ కావటం తెలిసిందే.

ప్రయోగం వేళలో అక్కడే ఉన్న ప్రధాని మోడీ.. ఇస్రో శాస్త్రవేత్తల్ని ఊరడించటమే కాదు.. వారిలో మనోస్థైర్యాన్ని పెంచేలా స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని చేశారు. సైన్స్ లో ప్రయోగాలు మాత్రమే ఉంటాయే తప్పించి.. వైఫల్యాలు ఉండవన్నారు. మోడీ ప్రసంగంతో ఇస్రో సైంటిస్టులు పలువురు అప్పటికి ఉన్న తమ బ్యాడ్ మూడ్ నుంచి ఛేంజ్ అయ్యారు.

కీలకమైన వేళ స్ఫూర్తివంతమైన ప్రధాని మోడీ స్పీచ్ తో ఇస్రో సైంటిస్టుల్లో కొత్త స్థైర్యాన్ని నింపింది. దీనికి తోడు దేశ ప్రజలంతా కూడా అదే టోన్ వినిపిస్తూ అండగా నిలవటంతో.. విజయాన్ని సాధించాలన్న తపన మరింత పెరిగేలా చేసింది. దీనికి తగ్గట్లే లింకు మిస్ అయిన విక్రమ్ ల్యాండర్ ను గుర్తించటంతో పాటు.. దాన్ని పునరుద్దరించే పనిలో బిజీగా ఉంది ఇస్రో.

ఇదిలా ఉంటే.. తాజాగా షాకింగ్ అంశం ఒకటి వెలుగు చూసింది. ఇస్రోలో పని చేస్తున్న సీనియర్ స్టాఫ్ సభ్యులు.. శాస్త్రవేత్తలు.. ఇంజనీర్ల వేతనాల్లో కోత విధిస్తూ కేంద్రం షాకిచ్చింది. అదనపు ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు నో చెప్పటంతో జీతంలో కోత పడనుంది.

దీనికి సంబంధించిన ఉత్తర్వు జూన్ 12న విడుదల చేయగా.. జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. చంద్రయాన్ 2 ఫలితానికి.. తాజా కోతకు సంబంధం లేదన్న మాట వినిపిస్తున్నా.. పరిశోధనా రంగంలో ఉండే వారి జీతాల్లో కోత వేయటం ప్రతికూల పరిస్థితులకు దారి తీస్తుందన్న మాట వినిపిస్తోంది. కేంద్రం ఇచ్చిన షాక్ పుణ్యమా అని.. 90 శాతం మంది ఇస్రో ఉద్యోగుల జీతాల్లో దగ్గర దగ్గరగా రూ.10వేల మేర కోత పడనుంది. ఎంత ఇస్రో సైంటిస్టులు అయినప్పటికీ.. రూ.10వేల మేర కోత అంటే భారీ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. కేంద్రం చర్యను ఇస్రోలోని స్పేస్ ఇంజనీర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. వేతనాల్లో కోత లేకుండా చూడాలని కేంద్రానికి విన్నవించింది. మాటల్లో స్థైర్యాన్ని నింపిన మోడీ.. తాజా అంశంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.