Begin typing your search above and press return to search.

సచివాలయంలో చంద్రన్న.. సందడి, టెన్షన్

By:  Tupaki Desk   |   28 Nov 2015 9:15 AM GMT
సచివాలయంలో చంద్రన్న.. సందడి, టెన్షన్
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుమారు 3 నెలల తర్వాత ఏపీ సచివాలయంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన వరుస సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు తరువాత పాలన వ్యవహారాలన్నీ విజయవాడ కేంద్రంగానే సాగిస్తున్న చంద్రబాబు అక్కడే తన నివాసాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన సెక్రటేరియట్ కు రావడమే లేదు. హైదరాబాదు వచ్చినా హడావుడిగా వెళ్లిపోతున్నారు. తాజాగా ఆయన సెక్రటేరియట్ లో మళ్లీ సమావేశాలు నిర్వహించడం ఆసక్తి కలిగిస్తోంది.

శుక్రవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు శనివారం ఉదయం నేరుగా సచివాలయానికి వచ్చారు. ఎల్ బ్లాకులోని తన కార్యాలయంలో మంత్రులు - అధికారులతో సమావేశమయ్యారు. 2015- 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యాలపై సమావేశానికి రాష్ట్ర మంత్రులు - ముఖ్య కార్యదర్శులు - అన్ని విభాగాల ఉన్నతాధికారులతో చర్చించారు. 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నదుల అనుసంధానం, నీరు- చెట్టు కార్యక్రమాలతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సచివాలయంలో మంత్రులు - ముఖ్య కార్యదర్శులు - హెచ్‌ ఓడీలతో జరుగుతున్న సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి ఎత్తిపోతల నీళ్లు తప్ప కృష్ణా డెల్టాకు నీళ్లు లేని పరిస్థితి నెలకొందని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి పైనుంచి రావాల్సిన నీళ్లు రాలేదని అన్నారు. సూక్ష్మ బిందు సేద్యం విధానాలు మంచి ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. అనంతపురంలో వర్షపాతం ఊహించని విధంగా పెరిగిందని అన్నారు. రాయలసీమలో గతంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకునే వారని, ఆ పరిస్థితి ప్రస్తుతం రాకుండా చేశామని అన్నారు. 20 ఏళ్లలో రానంతగా ఈసారి వర్షాలు పడ్డాయని, మూడు గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.

కాగా చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం 3 గంటలకు పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. విజయవాడకు కార్యాలయాలను, ఉద్యోగులను తరలించడంపైనా ఆయన ఆయావర్గాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సుదీర్ఘకాలం తరువాత రావడంతో సెక్రటేరియటల్ లో సందడి ఏర్పడింది. అయితే... అదేసమయంలో ఇంతకాలం ఇష్టారాజ్యంగా ఉన్న కొందరు అధికారులు మాత్రం తమకేం ముంచుకొస్తుందో అని టెన్షన్ పడుతున్నారు.