Begin typing your search above and press return to search.

కొత్త హుషారు; బాబు బుల్లెట్ నడిపాడు

By:  Tupaki Desk   |   1 Dec 2015 8:55 AM GMT
కొత్త హుషారు; బాబు బుల్లెట్ నడిపాడు
X
ప్రజల్లో మమేకం కావటం కోసం.. క్యాడర్ లో మరింత ఉత్సాహపర్చటం కోసం ప్రముఖులు అప్పుడప్పడు వ్యవహరించే వైఖరి ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. అందునా చంద్రబాబు లాంటి నేత నుంచి కొన్ని అస్సలు ఆశించలేం. నాటకీయంగా వ్యవహరించటం.. ఊహించని విధంగా స్పందించటం.. మాటలతో.. చేతలతో ఆకట్టుకోవటం లాంటి విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చాలా వీక్ గా చెబుతారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారమే చూడండి.. ఆయన మాట్లాడే నాలుగు మాటలైనా.. చేసే ఒక్క పనైనా అలా గుర్తిండిపోతుంది. ఇలాంటి వైఖరే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరా కనిపిస్తుంది. ఇక.. ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వీరందరికి ఆయన ఆది గురువులాంటి వాడు.

అయితే.. ఈ మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రిలో చాలానే మార్పు వచ్చింది. తొమ్మిదిన్నరేళ్ల ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో చేసిన తప్పుల్ని ఆయన చాలావరకూ చేయటం లేదు. ప్రజలతో మమేకం అయ్యేందుకు.. మరింత హుషారుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అలాంటిదే లేకపోతే.. చంద్రబాబు లాంటి వ్యక్తి హుషారుగా బుల్లెట్ తోలటం ఏమిటి? జనాల్ని ఉర్రూతలూగించటం ఏమిటి? తాజాగా గుంటూరుజిల్లా వేములో ఆయన జన చైతన్య యాత్రల్ని షురూ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. సరదాగా బుల్లెట్ నడిపారు. సైకిల్ తొక్కే బాబును చూశాం కానీ.. బుల్లెట్ నడిపే బాబును చూడని వారికి ఆయన కనువిందు చేశారు.

సరదాగా బుల్లెట్ నడిపిన చంద్రబాబును చూసి అక్కడ చేరుకున్న ప్రజలంతా హర్షాతిరేకాలు చేశారు. బుల్లెట్ తోనే సరిపెట్టకుండా.. చిన్నారుల్ని ఎత్తుకోవటం.. లాంటి వాటితో మరింత మనసు దోచుకునే పని చేశారు. బాబులో వచ్చిన మార్పు తెలుగు తమ్ముళ్లలో కొత్త హుషారును తీసుకొస్తోంది. మార్పు మంచిదే.