Begin typing your search above and press return to search.

తెలంగాణలో దిక్కులేదు..ఢిల్లీలో చక్రం తిప్పుతాడట

By:  Tupaki Desk   |   11 Dec 2018 2:30 PM GMT
తెలంగాణలో దిక్కులేదు..ఢిల్లీలో చక్రం తిప్పుతాడట
X
ఉట్టికెగరలేనమ్మ.. ఆకాశానికి ఎగిరిందంట అని ఒక సామెత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి జనాలు ఈ సామెతే గుర్తు చేసుకుంటున్నారు. కొంత కాలంగా ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం దేశమంతా తిరిగేస్తున్నారు. వివిధ పార్టీల నేతల్ని కలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో కూడా చేతులు కలిపేశారు. ఆ పార్టీకి ఆర్థిక సహకారం అందిస్తూ తెలంగాణ ఎన్నికల బరిలోనూ నిలిచారు. రాహుల్ అండ్ కోతో కలిసి తెలంగాణలో ఉద్ధృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడ వివిధ పార్టీలతో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రజా కూటమి విజయం ఖరారైపోయినట్లుగా బిల్డప్ ఇస్తూ.. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామని చూశారు.

కానీ ఈ రోజు వెల్లడైన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘోరాతి ఘోరంగా దెబ్బ తింది. కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు ఆ పార్టీకి. మరీ ఈ స్థాయి పరాభవం ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలోనే అతి పెద్ద పరాభవాల్లో ఒకటనడంలో సందేహం లేదు. ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో ఇక ఆయన జాతీయ రాజకీయాల్లో ఏం చక్రం తిప్పబోతున్నట్లు? పునాది కదిలిపోతుంటే.. ఇక భవనం గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ? ఆయన కోరుకున్నట్లు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తింది. కానీ చంద్రబాబుది మరింత ఘోర పరాజయం. ఈ స్థితిలో ఇక జాతీయ రాజకీయాలంటూ తిరిగే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఇలాంటి ఓటమిని వెనకేసుకుని ఏ పార్టీ నేతనైనా కలిస్తే బాబుకు ఏమాత్రం విలువ ఇస్తారు? ముందు వెళ్లి ఏపీలో పార్టీ పరిస్థితి చూసుకో అంటారు. కాబట్టి ఇక ఆయన ఏపీలో పార్టీ సంగతి చూసుకుంటే బెటర్ అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.