Begin typing your search above and press return to search.

బాబును వీడ‌ని ఓటుకు నోటు కేసు

By:  Tupaki Desk   |   29 Aug 2016 9:42 AM GMT
బాబును వీడ‌ని ఓటుకు నోటు కేసు
X
ఏపీ సీఎం చంద్ర‌బాబును తెలంగాణ‌లోని ఆయ‌న కేడ‌ర్‌ ను తీవ్ర‌స్థాయిలో డిఫెన్స్‌ లో ప‌డేసిన ఓటుకు నోటు కేసు మ‌రో సారి తెర‌మీద‌కి వ‌చ్చింది. దాదాపు ఏడాది కింద‌ట ఈ కేసు ఏపీ - తెలంగాణ‌ల్లో అత్యంత వాడి.. వేడిని ర‌గిలించిన విష‌యం తెలిసిందే. దాదాపు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఏపీ సీఎం అని కూడా చూడ‌కుండా చంద్ర‌బాబును బ‌హిరంగ స‌భ వేదిక‌గా దొంగ అంటూ సంబోధించ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌మ అభ్య‌ర్థికి ఓటు వేయాలంటూ నామినేటెడ్ స‌భ్యుడైన స్టీఫెన్‌ స‌న్‌ కు టీ టీడీపీ నేత కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేరుగా డ‌బ్బులు ఎర‌చూపిన‌ట్టు మీడియాలో విజువ‌ల్స్ కూడా ప్ర‌సార‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా స్టీఫెన్‌ కు ఏమీ కాద‌ని, అంతా త‌మ బాస్ చూసుకుంటార‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఓ వాయిస్ రికార్డును కూడా స్టీఫెన్‌ కు వివ‌రించారు.

అయితే, ఇదంతా ప‌క్కాగా రికార్డు చేసిన స్టీఫెన్‌.. నేరుగా ఏసీబీకే విష‌యాన్ని చేర‌వేశారు. దీంతో రేవంత్‌ ను రెడ్ హ్యాండెడ్‌ గా అరెస్టు చేసిన ఏసీబీ.. త‌ర్వాత జైలుకు కూడా పంపింది. అయితే, కొన్నాళ్ల‌కు ఆయ‌న ఆంక్ష‌ల‌తో కూడిన బెయిల్ తెచ్చుకున్నారు. ఇదిల‌వుంటే, ఈ మొత్తం ఎపిసోడ్‌ లో కీల‌కంగా భావిస్తున్న వాయిస్ రికార్డ్ చంద్ర‌బాబుదేన‌ని విపక్షం వైసీపీ స‌హా తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు ఆరోపించారు. దీంతో ఈ వాయిస్‌ ను ల్యాబ్‌ కు పంపారు. త‌ర్వాత రిజ‌ల్ట్ కూడా వ‌చ్చింది. అయితే, ఇంత‌లో ఏమైందో ఏమో తెలీదు కానీ.. కేసు దాదాపు క‌నుమ‌రుగైంది. అయితే, తాజాగా దీనిని తిర‌గ‌దోడాల‌ని, అస‌లు విచార‌ణే స‌రిగా సాగ‌లేద‌ని పేర్కొంటూ.. జ‌గ‌న్ పార్టీ వైసీపీ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి(ఆర్కే) ఏసీబీ కోర్టును ఆశ్ర‌యించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అంత‌ర్జాతీయ ల్యాబ్‌ లో ఆయ‌న ఈ వాయిస్ రికార్డుపై జ‌రిపించిన ప‌రీక్ష‌ల రిజ‌ల్ట్‌ ను కూడా న్యాయ‌స్థానానికి అంద‌జేశారు. దీంతో ప‌రిస్థితి తీవ్రంగా మారింద‌నే చెప్పొచ్చు. ఆర్కే త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌ల‌తో ఏసీబీ కోర్టు ఏకీభ‌వించింది. ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ.. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని, ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని అభ్య‌ర్థించారు. ఆ వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన కోర్టు.. ఈ కేసును పునర్విచారణ చేయాలని, వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. దీంతో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆనందం నిండిపోతే.. చంద్ర‌బాబులో సెప్టెంబ‌ర్ 29 టెన్ష‌న్ మొద‌లైంది.