Begin typing your search above and press return to search.

కఠిన చర్యలతోనే ర్యాగింగ్ కు అడ్డుకట్ట

By:  Tupaki Desk   |   31 July 2015 12:26 PM GMT
కఠిన చర్యలతోనే ర్యాగింగ్ కు అడ్డుకట్ట
X
రోజురోజుకు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ర్యాగింగ్ కు అడ్డుకట్ట వేయాలంటే కఠిన చర్యలతోనే సాధ్యమవుతుంది. లేకపోతే ఇది రోజు రోజుకు విస్తరించి ఒక జాఢ్యంగా మారే అవకాశమూ ఉంది. ఇప్పటికే నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్.. రిషితేశ్వరి ఆత్మహత్య సంచలనం సృష్టిస్తే.. తాజాగా నెల్లూరు జిల్లాలో అనంతపురం జిల్లాకు చెందిన మధు సీనియర్ల ర్యాగింగ్ కు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

సాధారణంగా ఇటువంటి విషయాలపై చాలా సీరియస్ గా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా వెంటనే స్పందించాలి. ర్యాగింగ్ చేసిన విద్యార్థులను డీబార్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు విద్యా సంస్థల నిర్లక్ష్యం కూడా ర్యాగింగ్ కు కారణమవుతోంది. నెల్లూరులో ప్రైవేటు కాలేజీలో ర్యాగింగ్ జరిగింది. అయితే సదరు బాధితుడి తండ్రి మూడు నాలుగు సార్లు ఆ కాలేజీకి వెళ్లాడు. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేశాడు. సీనియర్ల పేర్లు చెప్పి మరీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అయినా సదరు కాలేజీ యాజమాన్యం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఫలితంగా అభం శుభం తెలియని కుర్రాడు ప్రాణం తీసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో సదరు కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని.. ఆ కాలేజీ యజమానులు మరే పేరుతోనూ కాలేజీ పెట్టకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సదరు కాలేజీపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశాయి కూడా.

ఇప్పుడు వెలుగులోకి వచ్చిన రిషితేశ్వరి, మధు ఉదంతాలు అయినా ఇంతకు ముందు జరిగినవి అయినా ఇందుకు కారణం ఒక్కటే. గతంలో ర్యాగింగ్ పై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడం. ఒకరిద్దరు విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయేమోననే ఉదార భావంతో కాలేజీలు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కఠినంగా వ్యవహరించి విద్యార్థులతోపాటు సదరు కాలేజీలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.