Begin typing your search above and press return to search.

తునిలో జర్నలిస్టులను అంతదారుణంగా కొట్టారా?

By:  Tupaki Desk   |   7 Feb 2016 9:00 AM GMT
తునిలో జర్నలిస్టులను అంతదారుణంగా కొట్టారా?
X
వారం కిందట ఇదే అదివారం రోజున తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ మంత్రి.. కాపునేత ముద్రగడ పద్మనాభం భారీ సభను ప్రారంభించిన 15 నిమిషాల వ్యవధిలోనే రాస్తారోకోకు.. రైల్ రోకోకు పిలుపునివ్వటం.. గర్జనకు హాజరైన లక్షలాదిమంది తీవ్ర భావోద్వేగానికి గురై.. పిలుపు మేరకు రోడ్ల మీదకు.. రైల్వేస్టేషన్ వైపు దూసుకెళ్లటం తెలిసిందే. అనంతరం రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను తగలబెట్టేయటం.. తునిలోని రెండు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం.. దాదాపు 15 వాహనాల్ని దగ్థం చేయటం లాంటివి చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు పోలీసులు గాయపడినట్లుగా వార్తలు వచ్చాయి.

సాధారణంగా ఇలాంటి సందర్భంలో పోలీసులతో పాటు.. ఆందోళనకారులకు తీవ్ర గాయాలు కావటం లాంటివి జరుగుతాయి. కానీ.. విచిత్రంగా కాపు ఐక్య గర్జనలో ఆందోళనకారులకు ఇసుమంత కూడా ఏమీ జరగలేదు సరికదా.. పోలీసులతో పాటు.. జర్నలిస్టులపై భారీగా దాడులు జరిగాయి. ఈ దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. దేశంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా క్షణాల్లో జర్నలిస్టులు స్పందించి వార్తలు ఇస్తుంటారు. అలాంటి జర్నలిస్టులకు ఏదైనా జరిగితే వార్తలు కూడా రాని పరిస్థితి.

కాపు ఐక్యగర్జన సంగతే చూస్తే.. ఈ ఘటనలో భారీ ఎత్తున జర్నలిస్టులకు గాయాలయ్యాయి. జర్నలిస్టులను టార్గెట్ చేసి మరీ వారిపై దాడి చేశారు. విలువైన వీడియో కెమేరాలు.. ఫోటో కెమేరాలు.. ట్యాబ్ లు.. కంప్యూటర్లు.. ఇలా చాలానే పరికరాల్ని బలవంతంగా లాక్కొని వాటిని మంటల్లో పడేయటమో లేదంటే ధ్వంసం చేయటమో జరిగింది. గర్జన సందర్భంగా సుమారు 40 మందికి పైగా జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఆందోళనకారుల నుంచి తప్పించుకొని పరుగులు పెడుతున్న జర్నలిస్టులను వెంటాడి మరీ కొట్టేసిన ఘటనకు సంబంధించిన వార్తలు ఎక్కడా రాలేదు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ యూనియర్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రతినిధులు తునికి వెళ్లి.. అక్కడి జర్నలిస్టులను కలిసి.. వారి పరిస్థితి స్వయంగా చూసిన తర్వాత వారు తీవ్ర విస్మయానికి గురయ్యారు. ఈ స్థాయిలో దెబ్బలు తగిలాయా? అన్న ఆశ్చర్యం వ్యక్తం కావటంతో పాటు.. తమ పరికరాల్ని మంటల్లో పడేశారని.. ప్రాణభయంతో తాము పరుగులు పెడుతున్నా విడిచి పెట్టకుండా వెంటపడి రాళ్లతో తరిమి కొట్టారంటూ చెప్పుకొచ్చారు.

దురదృష్టకరమైన అంశం ఏమిటంటే.. వీరికి జరిగిన అన్యాయానికి సంబంధించి మీడియాలో పెద్దగా ప్రస్తావన లేకపోవటం.. వార్తలు రాకపోవటం. అన్నేళ్ల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల మీద ఈ తరహా దాడి జరిగింది లేదు. ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరగటం శోచనీయంగా మారింది. జర్నలిస్టులపై దాడి జరిగిన ఉదంతంపై సమగ్ర విచారణ జరిపించాలని.. సిట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆందోళనకారులే ఈ దాడి చేశారా? లేక వారి పేరుతో ‘కొందరు’ ఈ తరహా దాడికి ప్లాన్ చేశారా? అన్న విషయం తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.