Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీలు గెలిచిన సంబరం బాబుకు లేదట

By:  Tupaki Desk   |   20 March 2017 8:16 AM GMT
ఎమ్మెల్సీలు గెలిచిన సంబరం బాబుకు లేదట
X
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీలో కొత్త చ‌ర్చ‌ మొద‌లైంది. శాసనమండలిలో కీలకమైన చైర్మన్-వైస్ చైర్మన్ పదవుల భర్తీపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. కులం-ప్రాంతం సమీకరణలతో కసరత్తు చేస్తోంది. ఇదే స‌మ‌యంలో అటు అసెంబ్లీ - శాస‌న‌స‌భా ప‌ద‌వుల‌ను సైతం దృష్టికి తీసుకొని స‌మీక‌ర‌ణ‌లు సాగిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లి ఉప స‌భాప‌తి ప‌ద‌వికి ఈ నెల 31న ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ సతీష్‌ రెడ్డి పదవీకాలం ముగియటం, చైర్మన్ చక్రపాణి పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుండటం, చీఫ్ విప్ - విప్‌ ల స్థానాలు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీచేయవలసి ఉంది.

చైర్మన్ చక్రపాణి యాదవ్ కాంగ్రెస్ హయాంలోనే నియమితులైన విషయం తెలిసిందే. ఆయన మరోసారి పొడిగింపు కోరుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ, చాలామంది సీనియర్లు ఉన్నందున ఆ అవకాశం దక్కకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుత చైర్మన్ చక్రపాణి రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక మళ్లీ సీమకు చెందిన నేతకే చైర్మన్ పదవి ఇవ్వాలని భావిస్తే బీసీల్లో యాదవ వర్గానికి చెందిన తిప్పేస్వామి - డిప్యూటీ చైర్మన్ పదవిని రెడ్లకు ఇవ్వాలనుకుంటే ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇవ్వచ్చంటున్నారు. ప్రస్తుతం సభలో రెడ్డి వర్గం నుంచి సోమిరెడ్డి - మాగుంట - శిల్పా - దీపక్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, వీరిలో దీపక్ జూనియర్. ఇక సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమయింది. ఆయనది సుదీర్ఘ అనుభవమున్న మంత్రిస్థాయి కాబట్టి ఈ పదవికి పరిశీలించరని భావిస్తున్నారు. మరోవైపు మాగుంటకూ మంత్రి పదవి ఇస్తారంటున్నారు. ఒకవేళ మాగుంటకు ఏదైనా సమీకరణల దృష్ట్యా మంత్రి పదవి రాకపోతే, మంత్రితో సమానమైన డెప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత శాసనమండలిలో కమ్మ వర్గానికి చెందిన గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎంవిఎస్ మూర్తి సీనియర్లు. అయితే ఒకవైపు అదే వర్గానికి చెందిన కోడెల శివప్రసాదరావు శాసనసభాపతిగా ఉన్నందున, మళ్లీ అదే సామాజిక వర్గానికి మండలి చైర్మన్ ఇవ్వ‌క‌పోవ‌చ్చిన అంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విమర్శలకు భయపడకపోతే ముద్దుకృష్ణమనాయుడుకు అవకాశం దక్కవచ్చంటున్నారు. అయితే ఇప్పటికే కమ్మ సామాజికవర్గ దూకుడు పెరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నందున బాబు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. కాగా, మైనారిటీలకు ఇచ్చి ఆ వర్గానికి చేరువకావాలని నిర్ణయిస్తే ఎంఏ షరీఫ్‌కు చైర్మన్ పదవి దక్కవచ్చు. కానీ ఆయన పేరు అటు మంత్రివర్గం జాబితాలోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. ముందు చైర్మన్‌గా ఎవరినైతే నిర్ణయిస్తారో, డెప్యూటీ చైర్మన్ ఎంపిక అందుకు భిన్నంగా ఉండనుంది. అంటే చైర్మన్ పదవి ఓసీకి ఇస్తే డెప్యూటీ చైర్మన్ పదవి బీసీకి, ఒకవేళ బీసీకి చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే ఓసీకి డెప్యూటీ చైర్మన్ పదవి ఇస్తారు. చైర్మన్ పదవి సీమకు కేటాయిస్తే డెప్యూటీ చైర్మన్ పదవి కోస్తాకు, కోస్తాకు చైర్మన్ పదవి ఇస్తే డెప్యూటీ సీమకు ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. కాగా, ఈ నెల 31న జరగనున్న డెప్యూటీ చైర్మన్ పదవికి బీసీల్లోని శెట్టిబలిజకు చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం, అంగర రామ్మోహన్‌రావు, దళిత వర్గం నుంచి శమంతకమణి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చీఫ్ విప్ పదవిని సీనియర్ నేత టిడి జనార్ధనరావుకు ఇవ్వడం దాదాపు ఖాయమయందంటున్నారు. ఆయన ఇప్పటికే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనధికార సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. మరో రెండు విప్ పదవులు కూడా భర్తీ కానున్నాయి. ఒకవేళ రెడ్డి సుబ్రమణ్యం, తిప్పేస్వామికి డెప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కకపోతే వారిద్దరికీ విప్ పదవులు లభించవచ్చంటున్నారు. ఈ విషయంలో మళ్లీ కుల సమీకరణలో తేడా వస్తే ఎస్టీ వర్గానికి చెందిన సంధ్యారాణికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/