పవన్ ప్రపోజల్ ను తుంగలో తొక్కిన బాబు!

Mon Feb 19 2018 19:04:59 GMT+0530 (IST)

‘నోట్ దిస్ పాయింట్ మిస్టర్ పవన్ కల్యాణ్’ అంటూ ఎలుగెత్తి చెప్పండి. పవన్ మనోడే.. అంటూ పార్టీశ్రేణులకు భరోసా ఇచ్చి.. పవన్ చేస్తున్న కసరత్తుకు రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు ఇచ్చి.. అన్ని రకాలుగానూ పవన్ ప్రేమను పుష్కలంగా ప్రదర్శిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఆయన చేసిన విలువైన సూచనను మాత్రం తుంగలో తొక్కేశారు. ఒకవైపు పవన్ ను ఉద్దేశించి ‘కొందరు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు’ అని అంటూనే.. మేధావులతో కలిసి పవన్ చేసిన సూచన అవిశ్వాసం అనే దానిని మాత్రం ఆయన దారుణంగా తుంగలో తొక్కారు. పైకి మాత్రం అవసరమైతే పెడతాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.అయితే పవన్ సూచనను గౌరవించి.. తాము అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని.. అయితే బలం చాలదు గనుక.. తెదేపా కూడా కలిసి రావాలనిజగన్ ప్రతిపాదన చేసిన నేపథ్యంలో కూడా చంద్రబాబు అదే మాట్లాడుతున్నారు. అవిశ్వాసం గురించిన మాటను తలాతోకాలేని మాటగా కొట్టి పారేస్తున్నారు. అయితే అవిశ్వాసం అనే ఆలోచననే చంద్రబాబు నీరుగార్చడం విశేషం. కేంద్రానికి పూర్తి మెజారిటీ ఉందని అవిశ్వాసం ద్వారా తాము సాధించేది ఏమీ ఉండదని ఆయన అంటున్నారు. ‘ఆయన అవిశ్వాసం పెడితే.. ఆయన వెంట మేం పోవాలంట’ అని వెటకారంగా మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు అదేసమయంలో ‘తెదేపా అవిశ్వాసం పెట్టినా కూడా తాము మద్దతిస్తాం’ అని జగన్ ఇచ్చిన మాటను మాత్రం కన్వీనియెంట్ గా విస్మరిస్తున్నారు. అవిశ్వాసం వల్ల ఉపయోగం లేదని ఒకసారి ఫెయిలైతే మళ్లీ ఆరునెలల వరకు ఆ టాపిక్ మాట్లాడడానికి కూడా ఉండదని ఆయన అంటున్నారు. జగన్ భాజపా మధ్య రహస్య ఒప్పందం ఉందంటున్న ఆయన వారు కలవకుండా ఉండడానికే తాను సంకీర్ణంలో కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.

పవన్ కు చిత్తశుద్ధి ఉంటే

అయితే మరో వైపు నుంచి పవన్ కల్యాణ్ మీద సందేహాలు మొదలవుతున్నాయి. అవిశ్వాసం ప్రతిపాదనను  కొట్టిపారేసిన చంద్రబాబునాయుడు తీరు గురించి పవన్ కల్యాణ్ స్పందించాలని వైకాపా నేత బొత్స డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్ల కిందటినుంచి హోదా విషయంలో తాము మద్దతిస్తామంటే పట్టించుకోకుండా ఆ డిమాండును బాబు సర్వనాశనం చేశారని ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి పెంచే అవిశ్వాసం  అంశాన్ని కూడా తొక్కేస్తున్నారని బొత్స ఆరోపిస్తున్నారు.

 

అయితే ఇక్కడో సంగతి గమనించాలి...

సోమవారం నాడు చంద్రబాబు మాట్లాడుతూ.. ఆఖరి ప్రయత్నం కింద అవసరమైతే అవిశ్వాసం పెట్టడానికి కూడా తాము వెనుకాడమని చెప్పారు. అయితే ప్రజలు మాత్రం.. ఇంకా ఆరునెలలు కూడా ఉండని ప్రభుత్వం విషయంలో ఇంకా  ఆఖరి ప్రయత్నం అనడం వెనుక పరమార్థం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ వెంట మేం వెళ్లాలా.. అంటున్న చంద్రబాబు.. కనీసం తానే ప్రతిపాదించి.. తన వెంట జగన్ ను రమ్మన్నా పరవాలేదని.. అందుకు కూడా జగన్ సిద్ధమేనని ప్రజలు సూచిస్తున్నారు. మరి బాబుకు అందుకు సిద్ధమేనా? జగన్ ప్రకటన వల్ల పార్టీకి జరగగల నష్టాన్ని తప్పించడానికి ఈ ప్రకటన చేసినట్లుగా ఉన్నదే తప్ప.. చిత్తశుద్ధి ఉంటే.. ఆదిశగా ఇప్పటికే ప్రయత్నం ప్రారంభించాలని పలువురు అంటున్నారు.