Begin typing your search above and press return to search.

సోనియాతో భేటీ... బాబు రికార్డు సృష్టించినట్టే

By:  Tupaki Desk   |   19 May 2019 1:11 PM GMT
సోనియాతో భేటీ... బాబు రికార్డు సృష్టించినట్టే
X
టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిజంగానే రికార్డు సృష్టించారనే చెప్పాలి. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో కీలక నేతలందరినీ కలిసేసిన చంద్రబాబు... ఈ జాబితాలో మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతోనే కాసేపటి క్రితం భేటీ అయ్యారు. నిన్నటి నుంచి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న చంద్రబాబు.. నిన్న ఢిల్లీలో రాహుల్ గాంధీ, శరద్ పవార్, సురవరం సుధాకర్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత లక్నో వెళ్లి అఖిలేశ్ యాదవ్ - మాయావతిలతోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాత తిరిగి విజయవాడ రావాల్సిన ఆయన లక్నో నుంచి మళ్లీ ఢిల్లీకి వెళ్లారు.

నేటి ఉదయం మరోమారు రాహుల్ - శరద్ పవార్ - సీతారం ఏచూరీలతో వరుస భేటీలు నిర్వహించిన చంద్రబాబు... చివరగా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. నిన్న లక్నో నుంచి అమరావతికి కాకుండా తిరిగి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు కేవలం సోనియా గాంధీతో భేటీ కోసమే తన పర్యటనను అప్పటికప్పుడు మార్చుకున్నారు. అయితే నేటి మధ్యాహ్నం దాకా సోనియా గాంధీ నుంచి అపాయింట్ మెంట్ రాని నేపథ్యంలో ఈ రోజైనా చంద్రబాబు ఆమెతో భేటీ అవుతారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు సోనియా నుంచి అపాయింట్ మెంట్ రావడం, ఆ వెంటనే చంద్రబాబు 10 జనపథ్ కు వెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అధికారంలోకి రాకుండా బీజేపీని ఎలా అడ్డుకోవాలన్న కోణంలో ఆయన సోనియాతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీికి అధినేతగా ఉన్న చంద్రబాబు.. ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీలకు చెందిన అందరు నేతలతో ఎప్పుడో ఒకప్పుడు భేటీ అయ్యారు. అయితే సోనియాతో మాత్రం ఆయన ఇప్పటిదాకా ఎన్నడూ భేటీ కాలేదు. అయితే ఆ లోటును కూడా భర్తీ చేస్తూ చంద్రబాబు... సోనియాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబుతో భేటీ కాని నేత ఇక దేశంలో ఎవరూ లేరన్న కోణంలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా సోనియాతో భేటీ ద్వారా చంద్రబాబు సరికొత్త రికార్డును సృష్టించారన్న మాట.