Begin typing your search above and press return to search.

ఆ విషయంలో చంద్రబాబే ఎంటరవుతన్నారు

By:  Tupaki Desk   |   26 Nov 2015 6:32 AM GMT
ఆ విషయంలో చంద్రబాబే ఎంటరవుతన్నారు
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సచివాలయం తరలింపు - ఆర్థిక - పాలన పరమైన అంశాలను చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రెండు రోజుల్లో హైదరాబాద్ లోని సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. శనివారం ఈ సమాచారం ఉంటుందని తెలుస్తోంది. దశలవారీగా రాజధాని ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించిన నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికారుల తరలింపుకు సంబందించి ప్రభుత్వం ఇప్పటికే మూడు ప్రత్యేకమైన తేదీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ పదేళ్ళపాటు కొనసాగే అవకాశమున్నప్పటికీ ఇప్పటికిప్పుడు రాజధానికి తరలి రావాలని ప్రభుత్వం కోరడంపై ఉద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారు. కార్యాలయాలతో పాటు తమను అమరావతికి రావాలని ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోందని అధికారులు, ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశంపై చర్చించేందుకు చంద్రబాబు ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతికి కార్యాలయాలు తరలించినా ఉద్యోగులు అక్కడ నివాసముండేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇంత వరకు చేయలేదని, ఉద్యోగులుగా తాము రాజధానికి వస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని వారి నుంచి ప్రశ్నలు తలెత్తున్నాయి.

అధికారులకు నివాస ఏర్పాట్లను కల్పిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదని సాక్ష్యాత్తు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాజధానికి తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వం ఇంటి అద్దె అలవెన్సులను చెల్లించాలన్న డిమాండ్‌ ఉద్యోగుల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు మాత్రం పూర్తి స్థాయిలో అమరావతి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించాలని, ఇందుకు అధికారులు, ఉద్యోగులు కలిసి రావాలని అభ్యర్ధిస్తున్నారు. మంత్రులు తమ సమీక్షా సమావేశాలను విజయవాడలోనే నిర్వహించాలని, ఖరీదైన హోటళ్ళలో బస చేయటానికి వీలు లేదని ప్రభుత్వం ఇప్పటికే మంత్రులను ఆదేశించింది. కొంతమంది మంత్రులు ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకోగా మరికొంత మంది ఆ ప్రయత్నంలో ఉన్నారు.

అధికారుల్లో కొంతమంది విజయవాడ నుంచే కార్యకలాపాలను సాగిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు విజయవాడలో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకోగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కేవలం సమీక్షా సమావేశాలకు విజయవాడకు వెళ్ళివస్తున్నారని, మిగతా కార్యకలాపాలను హైదరాబాద్‌ నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పనికి ఏపీకి చెందిన ప్రజలు హైదరాబాద్‌ కు రావడం కుదరదని తాను విజయవాడలో కూర్చోని ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాలన్న నిర్ణయానికి వచ్చానని అధికారులు - ఉద్యోగులు - సిబ్బంది సైతం విజయవాడకు రావాలని సీఎం పదేపదే కోరుతున్నారు. కనీసం విద్యాసంవత్సరం పూర్తయ్యేలోపన్న ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. కాగా నెలల తరువాత ఏపీ సీఎం సెక్రటేరియట్ కు రానుండడం ఆసక్తికరంగా మారింది.