స్పష్టత లేనిది.. పవన్ కా - చంద్రబాబుకా?

Tue Apr 10 2018 11:24:33 GMT+0530 (IST)

పవన్ కల్యాణ్ కు రాజకీయ వైఖరిపై స్పష్టత లేదని ఆయన నిన్నొక రకంగా - ఇవాళ  ఇంకొక రకంగా - రేపు మరొక రకంగా మాట్లాడుతుంటారని అంతా అంటూ ఉంటారు. అయితే రాజకీయంగా సమకాలీన పరిణామాలను గమనించినప్పుడు.. స్పష్టత అనేది పవన్ కల్యాణ్ కంటె ఘోరంగా లేని వ్యక్తి చంద్రబాబునాయుడు అనిపిస్తుంది. కేవలం ప్రత్యేకహోదా అనే విషయాన్నే తీసుకుంటే.. ఆయన తొలినుంచి ఇప్పటికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట మారుస్తూ వచ్చారో గమనిస్తే.. తన మాటలు మాత్రమే కాదు.. ప్రజల దృష్టిని కూడా మళ్లించడానికి ఎన్ని రకాల గేమ్స్ ఆడుతూ వచ్చారో గమనిస్తే... ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు స్పష్టత లేక అలా చేస్తున్నారా? లేదా తనకు మాత్రమే తెలిసిన వక్ర ప్రయోజనాలను సాధించుకోవడానికి ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే అనుమానాలు కూడా కలుగుతాయి.ప్రత్యేకహోదా ఎలా తగలడినా సరే.. దానికోసం పోరాడుతున్నట్లుగా తన పార్టీకి ప్రజల దృష్టిలో మైలేజీ వస్తే చాలు అనుకుంటున్న నాయకుడు చంద్రబాబునాయుడు. ఆయన ఈ విషయంలో తొలినుంచి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట మార్చారో గమనిస్తే..

తిరుపతి ఎన్నికల ప్రచార సభలో.. మోడీతో పాటూ.. ఆయనకూడా ప్రత్యేకహోదా వచ్చి తీరుతుంది అంటూ ప్రతిజ్ఞలు చేశారు. మోడీ పదేళ్లు హోదా ఇస్తాం అంటే కాదు పదిహేనేళ్లు ఇచ్చి తీరాల్సిందే అన్నారు.

తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉభయులూ హామీ ఇచ్చినదే అయిన ప్ర్యతేకహోదా గురించి ఆయన రెండేళ్లపాటూ పట్టించుకోనేలేదు. ఆ తర్వాత కూడా నారా ద్వయం- చంద్రబాబు - లోకేష్ ఇద్దరూ కూడా.. ఎన్ని రకాలుగా హోదా అనే వాంఛను కించపరుస్తూ మాట్లాడారో అందరికీ తెలుసు. హోదా జిందా తిలిస్మాత్ కాదని - రాత్రికిరాత్రే అభివృద్ధి రాదని అన్నారు. చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి హోదా మాటెత్తితే జైళ్లకే అని కూడా హెచ్చరించారు.

ఓ అర్ధరాత్రి జైట్లీ ప్యాకేజీ ఇవ్వగానే ఆ భజన ప్రారంభించారు.  ప్రజలు - ప్రధాన  ప్రతిపక్షం వైకాపా హోదాకు అనుకూలంగా విజృంభించిన తర్వాత.. ఆయనకూడా ఆ పాట అందుకున్నారు. ప్యాకేజీ అక్కర్లేదు హోదానే కావాలి అంటూ యాగీ చేశారు.

తీరా ఇప్పుడు జేసీ ద్వారా మరో డ్రామా ఆడిస్తున్నారు. హోదా రాదు ప్యాకేజీ కావాలా వద్దా అని సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలే తన వద్దకొచ్చి.. హోదా వద్దు సీఎం గారూ.. ప్యాకేజీకి ఒప్పుకోండ అని అడగాలని ఆయన కోరిక లాగుంది. ఇన్ని రకాలుగా కన్ఫ్యూజ్ అవుతూ - ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ వంచించే నాయకుడు మరొకరు ఉంటారా? అనే ప్రశ్నలు వినవస్తున్నాయి.