Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ తో చంద్రబాబు పోటీపడడం కష్టమేనా?

By:  Tupaki Desk   |   10 Dec 2017 5:32 AM GMT
కేసీఆర్‌ తో చంద్రబాబు పోటీపడడం కష్టమేనా?
X
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ర్టం మళ్లీ టాప్ ర్యాంకుల దిశగా దూసుకెళ్తోంది. గత ఏడాది ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి కూడా ఒకటి లేదా రెండో ర్యాంకు కైవసం చేసుకునే సూచనలు కనిపిస్తు్న్నాయి. అయితే... గత ఏడాది తెలంగాణతో పాటు మొదటి స్థానంలో నిలిచిన ఏపీ ఈసారి ఫస్టు ర్యాంకు సాధించడం అంత సులభం కాకపోవచ్చని తెలుస్తోంది.

పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుమతులు ఇవ్వడం, ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన సంస్కరణలను, వాటి ఫలాలను సామాన్యులకు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణకు వరసగా రెండోసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మంచి ర్యాంకు ఖాయమంటున్నారు. 2016లో దేశం మొత్తం మీద తొలి ర్యాంకును సాధించి పరిశ్రమలకు అనుమతులు, సంస్కరణల అమలులో ప్రపంచానికి తెలంగాణ తన సత్తా చాటింది. ఈ సారి ప్రాథమిక ర్యాంకుల్లో హర్యానాకు అతి చేరువలో తెలంగాణ రాష్ట్రం ఉండడం విశేషం. ప్రస్తుతానికి ర్యాంకులు ఖరారు కానప్పటికీ టాప్ పది స్థానాల్లో హర్యానా 69 పాయింట్ల స్కోరుతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 68.46 పాయింట్లతో దానికి అత్యంత చేరువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది.

కేంద్రం ఆధీనంలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) తెలంగాణలో పర్యటించి వివిధ సంస్కరణల అమలు తీరును పరిశీలించనుంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో సంస్కరణల అమలు తీరును సమీక్షిస్తున్నారు. వివిధ సంస్కరణల అమలు తీరు తెన్నులను సమీక్షించి, ఇంతవరకు తీసుకున్న చర్యలను నిశితంగా పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తున్నారు. మంత్రి కెటిఆర్ వారానికోసారి, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి 15 రోజులకోసారి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించి తగిన దిశ, దశ నిర్దేశానికి ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటోంది.

ఈ ఏడాది డిఐపిపి కొత్త వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. దీనిపై రాష్ట్రాలు తీసుకున్న చర్యలు, సలహాలను కొత్త ఫార్మెట్‌లో పంపించాలని డిఐపిపి కోరింది. ఈ సంస్కరణల అమలు ప్రాతిపదికన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలుకు ర్యాంకులను ప్రకటిస్తారు. కొత్త ర్యాంకింగ్ ఇచ్చేందుకు 294 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 13 సచివాలయ శాఖలు , 27 హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్స్ ఉన్నాయి. ఈర్యాంకుల ఖరారుకు 340 పాయింట్లను సాధారణగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సారి డిఐపిపి మరో 32 పాయింట్లను కలిపింది. దీంతో 372 పాయింట్లలో వివిధ రాష్ట్రాలు సాధించిన ప్రగతి - సంస్కరణల అమలును పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు నిర్ణయిస్తారు.