Begin typing your search above and press return to search.

కొత్త నీటి వివాదాలకు బాబు తెరలేపుతున్నారా...?

By:  Tupaki Desk   |   17 Dec 2017 10:04 AM GMT
కొత్త నీటి వివాదాలకు బాబు తెరలేపుతున్నారా...?
X
పోలవరం చూశాక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎంత కష్టమో ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి తెలిసొచ్చుండాలి. అయినప్పటికీ ఆయన కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదిస్తున్నారు. శనివారం జరిగిన ఎపి కేబినెట్‌ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఒరిస్సా - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక - తమిళనాడుల మధ్య నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చారు సిఎం. రైతులకు - రాష్ట్రానికి మేలు చేసే పథకాలు చేపట్టడం మంచిదే. కాని పోలవరం పూర్తిచేయకుండా కొత్త వాటిని తలకెత్తుకోవటాన్ని ఏవిథంగా అర్థంచేసుకోవాలి?పోలవరం అంతరాష్ట్ర వివాదాన్ని పరిష్కరించలేకపోతున్న ఆయన కొత్త వివాదాలు తలకెత్తుకోవడం ఎవరి కోసం? సాధారణంగా ఏ రాజకీయనాయకుడైనా ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు చేసే పనులు రెండు మూడు కోణాల్లో ఉంటాయి. ప్రజలకు మేలు చేయాలి. తద్వారా రాజకీయంగా తాను లేదా తమ పార్టీ లాభపడాలి. మరోవైపు నాలుగురాళ్లు వెనకేసుకోవాలి. ఇది సహజంగా మనదేశంలో అమలయ్యే విధానం. ఈనేపథ్యంలోనే కొత్తగా చంద్రబాబునాయుడు మహానది - గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరీ నదుల అనుసంధానం ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. పెరిగిన ఇంజనీరింగ్‌ నైపుణ్యం - అందుబాటులోకి వచ్చిన ఎత్తిపోతల విద్యుత్‌ యంత్ర పరికరాల నేపథ్యంలో ఏ ప్రాజెక్టు కూడా పూర్తిచేయటం సాంకేతికంగా సాధ్యంకాదని చెప్పలేం. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న కాళేశ్వరం - ఆంధ్రాలో విజయవంతమైన హంద్రీ-నీవా - పట్టిసీమ - పురుషోత్తమపట్నం - ముచ్చుమర్రి లాంటి ఎత్తిపోతల పథకాలు ఈకోవలోకే చెందుతాయి.

ఈ విధంగా ప్రాజెక్టులు పూర్తి చేసినట్లుగా పోలవరం ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఆ ప్రాజెక్టుల్లో పనులు అత్యధిక భాగం గత ప్రభుత్వ హయాంలోనే జరిగిపోయాయి. ఆమాటకు వస్తే పోలవరం ప్రాజెక్టులో కూడా అత్యధిక అనుమతులు ముఖ్యంగా అటవీ - పర్యావరణ - ప్లానింగ్‌ - కేంద్ర జలసంఘం లాంటి అత్యంత క్లిష్టమైన అనుమతులు అప్పట్లోనే రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం సాధించింది. మరిప్పుడు పోలవరం ప్రాజెక్టును వేగంగా ఎందుకు నిర్మించలేకపోతున్నారంటే అందుకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దాగుడుమూత విధానాలేనని స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు మరొక వివాద అడుగు ముందకు వేశారు. శనివారం (డిసెంబర్‌ 16న) జరిగిన కేబినెట్‌ లో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఒరిస్సా - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక - తమిళనాడుల మధ్య నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చారు. అసలు రాష్ట్రంలో నదుల అనుసంధానం తామే సాధించామని పట్టిసీమను ఘనంగా చెప్పుకుంటున్నారు. నిజానికి నదుల అనుసంధానం దేశంలో ఎప్పుడో జరిగింది. బ్రిటీషర్ల కాలంలో కేసీ కాలువ చేపట్టారు. ఆ తరువాత హెచ్చెల్సీ ద్వారా కృష్ణా నీళ్లు పెన్నాకు అనుసంధానం అయ్యాయి. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా నీటిని తెలుగుగంగ ద్వారా పెన్నాకు - తద్వారా తమిళనాడుకు తరలించే పనులు ప్రారంభించారు. ఇక దేశంలో వస్తే పెన్‌-బట్వా నదుల అనుసంధానం ఉత్తరప్రదేశ్‌ - మధ్యప్రదేశ్‌ ల మధ్య ఆరంభమైంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ నదుల అనుసంధానానికి చంద్రబాబే ఆదిపురుషుడుగా తెలుగుదేశం కీర్తిస్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను ఆదుకున్నందుకు ఆయనను అభినందించి నదుల అనుసంధానం సాధించినందుకు మెచ్చుకోవాల్సిందే. కానీ అన్నీ ఏ తరహాలో సాధ్యం కావు - చేయలేరు. పోలవరంలోనే ఆయన ప్రతిభ వెల్లడవుతోంది. ఇప్పటికే 42 సార్లు సమీక్షించి 23 సార్లు ప్రాజెక్టు వద్దకు ఆయన వెళ్లినా ఫలితం లేకపోయింది.

ఇప్పుడు తాజాగా నదులు అనుసంధానం తెరమీదకు తీసుకురావటం వెనుక ఒకటి నాయకులకు ఉండే ప్రజలకు మేలు చేయాలనే ఆశ రాజకీయాల్లో పేరుప్రాఖ్యాతులు గడించాలనే కోరిక - అదే సమయంలో ముడుపుల ఆరోపణలు. నిజానికి దక్షిణాది రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానం ఆయన అనుకున్నట్లు ఏమాత్రం సులభం కాదు. పోలవరం విషయంలో ఇప్పటికే ఆయనకు అర్థమై ఉండాలి. ఎందుకంటే భూసేకరణ - అనుమతులు సాధించటం ఒక ఎత్తయితే - నిధులు సమకూర్చుకోవటం మరో సమస్య. ఇవి కాకుండా వివాదాలను పరిష్కరించటం. ఇప్పటికే గోదావరి - కృష్ణా నదుల నీటి వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ - ఒరిస్సా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిని పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో ప్రధానే పరిష్కరిస్తారంటూ తాజాగా ఆయన చేతులెత్తేశారు.

ఇప్పుడు మహానది - గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి అనుసంధానం ఇక ఏవిధంగా సాధ్యమవుతుంది? వీటిని ఐఎల్‌ ఆర్‌ ప్రాజెక్టులుగా పిలుస్తుంటారు. ఐఎల్‌ఆర్‌ అంటే ఇంటర్‌ లింకింగ్‌ ఆఫ్‌ రివర్స్‌. గత ఆరేడు దశాబ్దాలుగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎన్‌ డబ్ల్యూడీఏ హిమాలయాల్లో 14 - ఇతర ప్రాంతాల్లో 16 నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించింది. వాటిల్లో మొత్తం 16 నదుల అనుసంధానానికి సంబంధించి సాధ్యత నివేదికలు ఎప్పుడో రూపొందించారు. 2004కు ముందు ఎన్‌ డీఏ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం సురేష్‌ ప్రభు ఆధ్వర్యంలో టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటయ్యింది. కానీ ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందుకు ప్రధాన సమస్యలు నీళ్ల వాటాపై రాష్ట్రాల మధ్య తాగాదాలు - భూసేకరణ - అనుమతులు - నిధులు సమీకరించుకోవటం ప్రధానమైనవి. ఈనేపథ్యంలో బాబు కొత్త వివాదాలు తట్టిలేపుతున్నారు. అసలు గతంలోనే ఆయన నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించారు. నదుల్లో నీటి పంపకాలపై రాష్ట్రాల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అందులో భాగంగానే పోలవరం సమస్య పరిష్కారం కావటంలేదు.

ఈ పరిస్థితుల్లోనే నదుల అనుసంధానంపై ఎన్‌ డబ్ల్యుడిఎ - కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చి కొత్త వివాదానికి తెరలేపారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానాన్ని ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవు. ఇక సొంతంగా చేద్దామంటే పోలవరమే నిర్మింంచుకోలేకపోతున్నాము. కేంద్ర నిధులు ఇస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక కొత్తవి సొంతంగా నిర్మించగలమా? 2004కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై 'నిధులు ఎక్కడివి? నీళ్ళు ఎక్కడున్నాయి? అసలు నిర్మాణం సాధ్యమవుతాయా?' అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనే కొత్త పథకాలు ప్రతిపాదిస్తున్నారు. ఈ విధంగా ఆయన వైఖరిలో మార్పు రావడానికి దివంగత ముఖ్యమంత్రి అని చెప్పడంలో తప్పేమీ ఉండదేమో!

--- ఎస్‌ వి